పళనిపై అవిశ్వాసం పెట్టండి
పుదుచ్చేరి/సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ఇన్‌చార్జ్ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు గురువారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ కానున్నారు. అన్నాడీఎంకేలోని దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామికి మద్దతు ఉపసంహరించగా ప్రభుత్వం మైనార్టీలోకి పడిపోయిన విషయంపై వీరివురూ చర్చించనున్నారు.
ప్రభుత్వం నిలబడాలంటే పళనిస్వామికి 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా ప్రస్తుతం ఆయనవైపు 112 మంది మాత్రమే ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా పళనిస్వామిని ఆదేశించాలని గవర్నర్‌ను డీఎంకే ఇప్పటికే కోరడం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ కూడా పళనిస్వామిపై విశ్వాసపరీక్షకు డిమాండ్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు విద్యాసాగర్‌కు బుధవారం ఓ లేఖ రాశారు. పళనిస్వామి మాత్రం విశ్వాస పరీక్ష పెట్టినా తమ ప్రభుత్వానికి వచ్చే ముప్పేమీ లేదని ధీమాతో ఉన్నారు. ఈ దశలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది.
అన్నాడీఎంకేలోని రెండు వర్గాల విలీనం తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం కలసి అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. అరియలూరులో జరిగిన ఈ సభలో పన్నీర్‌సెల్వం మాట్లాడుతూ పార్టీని ఎవ్వరూ ధ్వంసం చేయలేని ఓ కోటగా జయలలిత మలిచారని అన్నారు.