►అమ్మ మరణంపై జ్యుడీషియల్ విచారణ..
►శశికళ, దినకరన్‌కు పళనిస్వామి చెక్..
►త్వరలో ఒకటికానున్న ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలు
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై తమిళనాడు ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. అలాగే పొయెస్ గార్డెన్స్‌లోని జయ నివాసమైన వేద నిలయాన్ని జయలలిత స్మారక చిహ్నంగా మారుస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ముఖ్యమంత్రి పళనిస్వామి గురువారం కీలక నిర్ణయం తీసుకున్నారు. జయలలిత మరణంపై నెలకొన్న సందేహాలపై విచారణ జరపడానికి రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని పళనిస్వామి తెలిపారు. ఆ కమిటీ విచారణ జరిపి త్వరలో నివేదిక సమర్పిస్తుందని ఆయన పేర్కొన్నారు.
కాగా జయలలిత మరణం అనుమానాస్పదమేనని, అపోలో ఆసుపత్రిలో అడ్మిట్‌కాక ముందే కుట్ర జరిగిందని అన్నాడీఎంకే నేతలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అలాగే ‘అమ్మ’ మృతిపై అనుమానం ఉందని, దీని గురించి న్యాయ విచారణ జరపాలంటూ మాజీ సీఎం పన్నీర్ సెల్వం కూడా డిమాండ్ చేశారు. కాగా అన్నాడీఎంకేలో అమ్మ, పురట్చి తలైవి శిబిరాలు విలీనం అవుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో పళినిస్వామి తాజా నిర్ణయంతో శశికళ, దినకరన్‌కు చెక్ పెట్టినట్లు అయింది.
మరోవైపు అన్నాడీఎంకేలో రెండు వర్గాల విలీనానికి పన్నీర్ సెల్వం పెట్టిన డిమాండ్లను పళినిస్వామి ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. ఇటీవలే దినకరన్‌ను పార్టీ పదవుల నుంచి తొలగించారు కూడా. తాజా సంకేతాలతో ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలు త్వరలో ఒకటి కానున్నాయి. ఇక జయ మరణంపై న్యాయ విచారణకు ఆదేశించడాన్ని పన్నీర్ సెల్వం స్వాగతించారు. కాగా జయలలితకు సరైన చికిత్స అందినట్లు సీఎం పళనిస్వామి ఇప్పటివరకూ చెప్పారని, అకస్మాత్తుగా విచారణకు ఎందుకు ఆదేశించారని డీఎంకే ప్రశ్నించింది. కాగా జయలలిత గత ఏడాది సెప్టెంబరులో హఠాత్తుగా అస్వస్థత గురి అయ్యారు. సుమారు 70 రోజులకు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 5న హఠాత్తుగా మృతి చెందారు.