‘చిదంబర’ రహస్యం
Published Wed, Jan 8 2014 3:11 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి: ‘ఆ పార్టీ చేసిన ప్రతిపాదనను తమ పార్టీ వ్యతిరేకించడమే సిద్ధాంతం’ అనే రాజకీయసూక్తిని అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలూ అవకాశం చిక్కినపుడల్లా అమలుచేస్తూనే ఉంటాయి. రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చిదంబరం ఆలయ నిర్వహణపై సర్వహక్కులు వంశపారంపర్య దీక్షితులదేనంటూ సుప్రీం కోర్టు తీర్పు, కేసు వ్యవహారంలో అధికారపార్టీ వైఖరి ఆయా పార్టీల సిద్ధాంతాన్ని మరోమారు గుర్తుచేసింది. ఆలయంలో అనాదిగా దేవారం భక్తిగీతాలు పాడే కడలూరు జిల్లా కుముడిమూలై గ్రామానికి చెందిన శివనడియార్ ఆరుముగస్వామి(90)కి ఆలయ ప్రధాన అర్చకులకు మధ్య రేగిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది.
దీంతో అప్పటి డీఎంకే ప్రభుత్వం జోక్యం చేసుకుని ట్రస్టీలను ఏర్పాటుచేసి దేవాదాయ కమిషనర్‌ను నియమించిం ది. ప్రభుత్వ జోక్యం సరికాదంటూ వంశపారంపర్య ప్రధాన అర్చకులు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పువచ్చింది. దీంతో అర్చకులు సుప్రీంకోర్టుకెళ్లారు. ఈ పోరాట దశలోనే డీఎం కే స్థానంలో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చింది. డీఎంకే హయాం నుంచి నడుస్తున్న కేసు కావడంతో అన్నాడీఎంకే పెద్దగా ఆసక్తిచూపలేదు. ఈ క్రమంలో ఆలయ నిర్వహణలో ప్రభుత్వ జోక్యం చేసుకోరాదంటూ సుప్రీం కోర్టు తీర్పులో స్పష్టం చేశారు.
ప్రజాకోర్టులో తేల్చుకుంటాం: చిదంబరం ఆల యంపై ప్రజాకోర్టులో తేల్చుకుంటామని మాన వ హక్కుల కేంద్రం (చెన్నై) కన్వీనర్ ఎస్ జిమ్‌రాజ్ మిల్టన్ తెలిపారు. పలు భాషా సంఘాల ప్రతినిధులతో చెన్నై కొత్త సచివాలయం నుంచి సోమవారం ర్యాలీ చేశారు. అనంతరం పెరియార్ విగ్రహం ముందు ధర్నా చేసి, బీజేపీ అగ్రనేత సుబ్రమణ్యస్వామి చిత్రాలను తగులబెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 40 ఎకరాల విస్తీర్ణంలోని ఆలయం, 27 ఎకరాల స్థలం, కొన్ని కోట్లరూపాయల విలువైన ఆలయ ఆభరణాలు అర్చకుల పరమైపోయాయని పేర్కొన్నారు. ప్రభుత్వం కేసు గెలవాలనే దిశగా సీఎం జయలలిత ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని, పైగా దీక్షితులకు అనుకూలంగా వ్యవహరించిందని విమర్శించారు.
కరుణ ఖండన: చిదంబరం కేసు సమయంలో సీఎంగా ఉండిన డీఎంకే అధినేత కరుణానిధి ఘాటుగా స్పందించారు. 1987లో ఎంజీఆర్ సీఎంగా, ఆర్‌ఎం వీరప్పన్ దేవాదాయ మం త్రిగా ఉన్నపుడే ఆలయాన్ని ప్రభుత్వం స్వాధీ నం చేసుకుందన్నారు. దీక్షితులు ఆరోజుల్లోనే కోర్టుకెళ్లారని చెప్పారు. ప్రభుత్వ చర్య సమర్థనీయమంటూ 2009లో హైకోర్టు తీర్పు చెప్పిం దని గుర్తు చేశారు. ప్రధాన అర్చకులు లేదా వారి పూర్వీకులు ఆలయాన్ని నిర్మించలేదని తాము రుజువుచేశామని చెప్పారు. ఈ ప్రభుత్వం చొరవ చేసుకోనందునే సుప్రీం తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దీక్షితులకు అనుకూలంగా వచ్చిందని ఆయన ఆరోపించారు.
Advertisement