
కట్టు తెంచుకున్న జల్లికట్టు
• తమిళనాడు ఆర్డినెన్స్‌కు గవర్నర్ విద్యాసాగర్‌రావు ఆమోదం
• నేడు ఆటను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం
• సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటున్న నిరసనకారులు
• అప్పటి వరకు మెరీనా బీచ్ నుంచి కదలబోమని స్పష్టీకరణ
సాక్షి ప్రతినిధి, చెన్నై/న్యూఢిల్లీ: తమిళుల సంప్రదాయ క్రీడ జల్లికట్టు మూడేళ్ల నిషేధపు కట్లు తెంచుకుని తిరిగి పూర్వవైభవంతో సందడి చేయనుంది. ఆట నిర్వహణకు అడ్డంకులు తొలగిస్తూ తమిళనాడు ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను గవర్నర్ విద్యాసాగర్ శనివారం ఆమోదించారు. జల్లికట్టు కోసం ప్రజలు భారీ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆర్డినెన్స్ సరైన చర్యేనని, నిరసనకారులు ఇక ఇళ్లకు వెళ్లాలని ఆయన కోరినట్లు రాజ్‌భవన్ తెలిపింది. ఆర్డినెన్స్ రాకతో ఆదివారం రాష్ట్రంలో జల్లికట్టు అట్టహాసంగా తిరిగి ప్రారంభం కానుంది. ఆటకు ప్రసిద్ధిగాంచిన మదురైజిల్లా అలంగానల్లూరులో సీఎం పన్నీర్ సెల్వం ఉదయం జెండా ఊపి క్రీడను ప్రారంభిస్తారు. ఆట కోసం 350 ఎద్దులను సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ చెప్పారు. జల్లికట్టు కోసం అన్ని వర్గాల ప్రజలు ఉద్యమించడం, బంద్‌తో రాష్ట్రం స్తంభించడంతో.. తమిళనాడు ప్రభుత్వ ముసాయిదా ఆర్డినెన్స్‌ను కేంద్రం శుక్రవారం ఆమోదించడం తెలిసిందే.
మెరీనా బీచ్‌లో నిరసనలో ప్లకార్డు చేతపట్టుకున్న చిన్నారి
జంతుహింస నిరోధక చట్టం–1960లోని ప్రదర్శన జంతువుల(పెర్ఫామింగ్ యానిమల్స్) జాబితా నుంచి ఎద్దులను తొలగించేందుకు సవరణ కోసం ఈ ఆర్డినెన్స్ తెచ్చారు. దీనికి రాష్ట్రపతి తెలిపిన ఆమోదం శుక్రవారం రాత్రి తమకు చేరిందని, ఆటపై నిషేధం తొలగినట్లేనని సీఎం తెలిపారు. జల్లికట్టు నిర్వహణకు ఆర్డినెన్స్ శాశ్వత పరిష్కారమని, దీని స్థానంలో బిల్లును, జంతుహింస నిరోధక చట్టానికి సవరణను అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతామన్నారు. ఆట విషయంలో మద్దతిచ్చిన ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు. ఫోన్‌లోనూ కృతజ్ఞతలు తెలిపారు.
ఆగని నిరసనలు
ఆర్డినెన్స్‌పై జల్లికట్టు మద్దతుదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. శాశ్వత పరిష్కారం కావాలని, అంతవరకు పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. చెన్నై మెరీనా బీచ్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. శాశ్వత పరిష్కారం లభించేంతవరకు బీచ్ నుంచి కదలబోమని అక్కడున్న 2 లక్షల మంది ఉద్యమకారులు చెప్పారు. జల్లికట్టుకు మద్దతుగా వళ్లువర్‌కోట్టంలో డీఎంకే నేత ఎంకే స్టాలిన్ నిరాహార దీక్ష చేశారు.
అన్ని యత్నాలూ చేస్తున్నాం: మోదీ
తమిళ ప్రజల సాంస్కృతిక ఆకాంక్షలను నెరవేర్చేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని ప్రధాని మోదీ శనివారం ట్వీట్ చేశారు. సుసంప్ననమైన తమిళనాడు సంస్కృతిని చూసి గర్వపడుతున్నామని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
పెటాకు సూర్య నోటీసులు
జల్లికట్టుకు తాను మద్ధతు ఇవ్వడంపై జంతు సంరక్షణ సంస్థ (పెటా) నిర్వాహకులు చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు సూర్య స్పందించారు. జల్లికట్టు పోరాటానికి సూర్య వంత పాడటం ఆశ్చర్యంగా ఉందని, తన సినిమా ప్రచారానికి దీన్ని వాడుకుంటున్నారని సంస్థ నిర్వాహకులు విమర్శించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన సూర్య తన న్యాయవాది ద్వారా ఆ సంస్థకు నోటీసులు పంపారు.