23 ఏళ్లలో.. 24 బదిలీలు!!
ఆయనో సీనియర్ ఐఏఎస్ అధికారి. పనిచేసేది తమిళనాడులో. 23 ఏళ్ల సర్వీసులో ఆయనకు 24 బదిలీలు వచ్చాయి. అంతేకాదు.. కేవలం 48 గంటల వ్యవధిలో కూడా రెండుసార్లు బదిలీ అయిన చరిత్ర ఆయనకుంది. అలాంటి అధికారిని తమిళనాడులో అక్రమ గ్రాఫైట్ తవ్వకాలపై దర్యాప్తు చేయాల్సిందిగా కోర్టు సూచించింది. ఆయన పేరు యు.సహాయం (52). గత వారంలోనే ఆయనకు రెండుసార్లు ఏమాత్రం ప్రాధాన్యం లేని పోస్టులు ఇచ్చారు. చివరకు ఇంత సమర్ధుడిగా కోర్టు గుర్తించిన వ్యక్తిని కో-ఆప్టెక్స్ అధినేతగా కూడా రెండేళ్ల పాటు నియమించారు.
తాజాగా.. తమిళనాట సాగుతున్న గ్రాఫైట్ తవ్వకాలపై మద్రాసు హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. మదురై కలెక్టర్గా ఉన్న సమయంలో ఈ స్కామును బయటపెట్టిన ఐఏఎస్ అధికారి సహాయంను ఎందుకు తరచు బదిలీ చేస్తున్నారని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గడిచిన 23 సంవత్సరాల్లో ఆయనకు 24 బదిలీలు బహుమతిగా వచ్చాయి. గత బుధవారం ఆయన్ను భారతీయ వైద్యం, హోమియోపతి కమిషనర్గా నియమించారు. రెండు రోజులు కూడా గడవకముందే అక్కడినుంచి సైన్స్ సిటీ వైస్ చైర్మన్గా మార్చారు. రాష్ట్ర చేనేతశాఖ మంత్రి ఎస్.గోకుల్ ఇందిరతో గొడవల వల్లే ఆయన్ను అంతలా బదిలీ చేశారని అంటున్నారు. ఇప్పుడు మళ్లీ కోర్టు జోక్యంతో ఆయనకు సరైన పోస్టింగ్ రావచ్చని చెబుతున్నారు.