జీఎస్‌టీచిచ్చు
► ఆగిన వాటర్ క్యాన్ల సరఫరా
► రేపు 36 గంటల హోటళ్ల బంద్
► మెడికల్స్ కూడా మూత
► పోరుబాటలో వర్తక సంఘాలు
సాక్షి, చెన్నై: జీఎస్‌టీ రేపిన చిచ్చు పలు రంగాల్లో ఆగ్రహాన్ని రేపుతోంది. వాటర్ క్యాన్ల సరఫరాను నిలుపుదల చేస్తూ ఉత్పత్తి దారులు ఆదివారం సమ్మె సైరన్ మోగించారు. మంగళవారం 36 గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హోటళ్లు మూత పడనున్నాయి.
అలాగే, ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మెడికల్ షాపులు మూత పడనున్నాయి. అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో వర్తక సంఘాలు ఆందోళనలకు నిర్ణయించాయి.వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) అమల్లో భాగంగా కేంద్రం వివిధ రకాల వస్తువులను పన్ను శ్లాబుల్లోకి చేరుస్తూ గతవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఎలక్ట్రానిక్, కార్ల్ల వంటి వాటి మీద పన్ను మోత మోగించారు.
అలాగే, కొన్ని రకాల వస్తువుల్ని శ్లాబుల్లోకి చేర్చడంతో ఆయా రంగాల్లో పన్నుమోత తప్పడం లేదు. ఈ ప్రభావంతో ఆందోళనకు గురైన ఆయా రంగాల్లో వారు జీఎస్‌టీకి వ్యతిరేకంగా గళాన్ని విప్పుతున్నారు.జీఎస్‌టీ పన్నుల మోత రగిల్చిన చిచ్చు ప్రభావం హోటళ్ల మీద కూడా పడనున్నదని చెప్పవచ్చు. కేంద్రానికి తలొగ్గి సాగుతున్న తమిళ ప్రభుత్వం జీఎస్‌టీకి రెడ్ కార్పెట్ ఆహ్వానం పలకడంతో సర్వత్రా ఆందోళనలో పడ్డారు. ఇక, రాష్ట్రంలో జీఎస్‌టీ రూపంలో పన్నుల మోత భరించాల్సిన పరిస్థితి ఏర్పడడంతో ఇక, పోరుబాటతో తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు.
వాటర్ క్యాన్ల సమ్మె : ప్రస్తుతం రాష్ట్రంలో తాగు నీటి ఎద్దడి తీవ్రంగానే ఉంది. ప్రైవేటు వాటర్ క్యాన్ల మీద ఆధార పడాల్సిన పరిస్థితి జనానికి తప్పడం లేదు. నీటి ఎద్దడిని ఆసరాగా చేసుకుని 20 లీటర్ల క్యాన్ ధరను పెంచే పనిలో ఆయా ఉత్పత్తి సంస్థలు నిమగ్నమయ్యాయి. ఈ పరిస్థితుల్లో జీఎస్‌టీ రూపంలో 18శాతం మేరకు పన్ను తమ మీద పడనుండంతో, ఆ భారాన్ని ప్రజల నెత్తిన వేయడం ఆయా సంస్థలకు కష్టతరం కాక తప్పదు. ఇందుకు కారణం పోటీ ప్రపంచంలో రోజురోజుకు పుట్టుకు వస్తున్న ఉత్పత్తి సంస్థల సంఖ్య పెరుగుతుండడమే. దీంతో జీఎస్‌టీకీ వ్యతిరేకంగా ఉత్పత్తిని నిలుపుదల చేసి, సమ్మెబాటలో వాటర్ క్యాన్ ఉత్పత్తి సంస్థలు పయనం సాగిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వాటర్ క్యాన్ల ఉత్పత్తి ఆగడంతో, సోమవారం క్యాన్ల సరఫరా ఆగనున్నాయి. దీంతో నీటి కోసం తంటాలు పడాల్సిన పరిస్థితి ఎదురు కానుంది.
రేపు హోటళ్ల బంద్, మెడికల్స్ మూత : జీఎస్‌టీ రూపంలో తమ మీద పడనున్న భారాన్ని పరిగణించి, ఉప సంహరించుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తూ మంగళశారం రాష్ట్ర వ్యాప్తంగా హోటళ్ల బంద్ నిర్వహించనున్నారు. 36 గంటల పాటు అన్ని హోటళ్లు మూత పడనున్నాయి. ఒకటిన్నర లక్షల హోటళ్లు సోమవారం రాత్రితో మూతపడతాయి. తిరిగి బుధవారం ఉదయం తెరవనున్నారు. అప్పటికీ పాలకుల నుంచి స్పందన లేని పక్షంలో జూన్ మూడున తదుపరి నిర్ణయాన్ని హోటళ్ల యజమానుల సంఘాలు తీసుకోనున్నాయి.
ఇక, మందుల మీద కూడా పన్ను ప్రభావం పడే రీతిలో కేంద్రం నిర్ణయం ఉండడంతో, తాము సైతం అంటూ పోరుబాటకు మందుల షాపుల యజమానుల సంఘాలు నిర్ణయించారు. మందుల దుకాణాలు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మూసి వేసి, తమ నిరసనను తెలియజేయనున్నారు. ఇక, వర్తక సంఘాల నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి.