థియేటర్ల బంద్‌తో హత్యలు పెరుగుతాయ్
చెన్నై (పెరంబూర్): సినిమా థియేటర్ల బంద్ వల్ల తమిళనాడులో హత్యలు, దొంగతనాలు ఎక్కువ అవుతాయని లక్ష్య ద్రావిడ మున్నేట్ర కళగం పార్టీ అధ్యక్షుడు, సినీయర్ నటుడు టి.రాజేందర్ వ్యాఖ్యానించారు. ఈయన జీఎస్టీ, రాష్ట్రప్రభుత్వం విధించనున్న 30 శాతం పన్ను విధానాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం స్థానిక అన్నాశాలైలోని దక్షిణ భారత సినీ వాణిజ్యమండలి ఆవరణ ముందు ధర్నా చేశారు. ఆయనతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. టి.రాజేందర్ మాట్లాడుతూ.. జీఎస్టీ, రాష్ట్రప్రభుత్వపన్ను విధానాలను వ్యతిరేకిస్తూ తనలాంటి సామాన్యులు చాలా మంది పోరాడుతున్నారన్నారు.
తనను ఇక్కడ ధర్నా చేయరాదంటూ నిర్మాతల నుంచి బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. తాను భావావేశాలతోనే ఇక్కడకు వచ్చానని అన్నారు. సినిమానే తనకు అన్నం పెట్టిందన్నారు. పన్ను విధానంపై రాష్ట్రప్రభుత్వం ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, సినిమా థియేటర్లు ఇదే విధంగా 10 రోజులు మూత పడితే తమిళనాడులో హత్యలు, దొంగతనాలు అధికం అవుతాయని హెచ్చరించారు. జీఎస్టీ సమస్యపై ప్రశ్నించని సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చినా ఏం చేయలేరని, ఆయన అసలు తమిళుడే కాదని అందుకే సమస్యలకు దూరంగా ఉంటున్నారని ఇటీవల దర్శకుడు రాజేందర్ మండిపడ్డ విషయం తెలిసిందే.