తమిళనాడు కేబినేట్ అత్యవసర సమావేశం
చెన్నై: తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో నేడు పలు కీలక సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్ర కేబినేట్ బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించనుంది. సీఎం పన్నీర్ సెల్వం నేతృత్వంలో ఉదయం 9.30 గంటలకు మంత్రి వర్గ సభ్యులు భేటీకానున్నారు. పార్టీ చీఫ్ శశికళ ముఖ్యమంత్రి అని వదంతులు వస్తున్న నేపథ్యంలో దీనిపై కేబినేట్ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ బుధవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు.
మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే పార్టీ సర్వ సభ్య సమావేశం కూడా నేడు జరగనుంది. అన్నా అరివాలయంలోని డీఎంకే రాష్ట్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి రెండు నెలల అనంతరం డీఎంకే అధినేత ఎం.కరుణానిధి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో పార్టీ కోశాధికారి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ కు నిర్వాహక అధ్యక్షుడి పగ్గాలు అప్పగించే అవకాశముంది.