పన్నీర్ సెల్వంకు మొండిచేయి!
చెన్నై: తమిళనాడు నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై గవర్నర్ విద్యాసాగర్ రావు తక్షణం స్పందించాలని ప్రతిపక్ష నాయకుడు ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గవర్నర్ పై ఉందన్నారు. డీఎంకే కీలక భేటీ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గవర్నర్ వెనుక బీజేపీ ఉందని తమిళ ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు.
మెజారిటీ ఉన్నవాళ్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అన్నాడీఎంకే తమ ప్రత్యర్థి అని, ఆ పార్టీకి మద్దతు ఇవ్వబోమని ఆయన స్పష్టం చేశారు. పన్నీర్ సెల్వంకు మద్దతుపై ఎలాంటి తీర్మానం చేయలేదని వెల్లడించారు. అధికార పార్టీలో నెలకొన్న సంక్షోభంలో రాష్ట్రంలో అభివృద్ధి స్తంభించిందని తెలిపారు. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి, రైతుల ఆత్మహత్యలతో కరువు పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. శశికళ అక్రమాస్తుల కేసుపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.
కాగా, ఆపత్కాలంలో తనకు డీఎంకే అండగా నిలుస్తుందని ఆశిస్తున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆశలపై స్టాలిన్ ప్రకటనతో నీళ్లు చల్లినట్టయింది. తాము మద్దతు ఇవ్వబోమని స్టాలిన్ విస్పష్ట ప్రకటన చేయడంతో పన్నీర్ సెల్వం ఆశలకు గండిపడింది.