కూల్చేందుకు కుట్ర!
♦ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో స్టాలిన్ బేరం
♦ టీటీవీ ఆరోపణ
♦ పార్టీ వర్గాలతో సమాలోచన
♦ ప్రచారం కోసమే ఈ ఆరోపణ : స్టాలిన్
సాక్షి, చెన్నై: సీఎం ఎడపాడి పళనిస్వామి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చేందుకు డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ తీవ్ర కుట్ర చేస్తున్నారని అన్నాడీఎంకే(అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలతో బేరాలు సాగిస్తున్నారని, కొందరు ఎమ్మెల్యేలు స్వయంగా తన దృష్టికి వివరాలను తీసుకొచ్చారని పేర్కొన్నారు. రాయపేటలోని అన్నాడీఎంకే రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఉదయం సీఎం ఎడపాడి పళనిస్వామి, ప్రిసీడియం చైర్మన్ సెంగుట్టయన్, మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ భేటీ అయ్యారు.
గంట పాటు సాగిన ఈ భేటీలో కొంతమంది ఎమ్మెల్యేలను మాత్రమే పిలిపించి ఉండడం గమనించాల్సిన విషయం. ఈ భేటీ అనంతరం టీటీవీ చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తే, ఆ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు పిలిపించారా అన్న ప్రశ్న బయలు దేరక మానదు. స్టాలిన్ తమ ఎమ్మెల్యేలతో బేరాలు సాగిస్తున్నారని టీటీవీ ఆరోపించడం గమనార్హం.ఎమ్మెల్యేలతో భేరం : ఈ సమావేశానంతరం మీడియాతో టీటీవీ మాట్లాడుతూ సీఎం ఎడపాడి పళనిస్వామి ప్రభుత్వాన్ని కూల్చడం లక్ష్యంగా స్టాలిన్ తీవ్ర కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ ద్రోహి పన్నీరుసెల్వంకు మద్దతుగా ఆయన కుట్రలు సాగుతున్నాయని పేర్కొన్నారు.
పన్నీరు శిబిరంలోకి చేరాలని తమ శిబిరానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారని , కొందరితో బేరాలు సైతం సాగిస్తున్నారని ఆరోపించారు. పన్నీరు శిబిరంలోకి వెళ్లేందుకు సిద్ధం అని ఒక్క మాట చెబితే చాలు అని, వారికి కావాల్సిన వన్నీ సమకూర్చేందుకు స్టాలిన్ సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. అన్నాడీఎంకేను నిర్వీర్యం చేయడం లక్ష్యంగా కుట్రలు సాగుతున్నాయని, వారి కుట్రల్ని భగ్నం చేసి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు.
కొందరు ఎమ్మెల్యేలు స్వయంగా తన దృష్టికి స్టాలిన్ సాగించిన బేరాల గురించి తెలియజేశారని వివరించారు. పదిహేను మంది ఎమ్మెల్యేలకు అనేక ఆశల్ని కూడా చూపించారని ఆరోపించారు. ఇక, రెండాకుల చిహ్నం దూరం కావడం వెనక బీజేపీ కుట్ర ఉందని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఉప ఎన్నికల్లో తాను గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేస్తూ ముందుకు సాగారు.
ప్రచారం కోసం ఆరోపణ : టీటీవీ ఆరోపణలపై స్టాలిన్‌ను మీడియా ప్రశ్నించగా, ఇలాంటి వాటికి సమాధానాలు ఇచ్చి తన స్థాయిని దిగజార్చుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. పబ్లిసిటీ(ప్రచారం) కోసం ఈ ఆరోపణలు టీటీవీ సందిస్తున్నారని ఎద్దేవా చేశారు. అర్హత లేని వాళ్లు చేసే వాఖ్యలను పరిగణించాల్సిన అవసరం లేదన్నారు.