‘అమితా’నందం
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాక కమలనాథుల్లో ఉత్సాహం నింపింది. తొలిసారిగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన తమ అధినేతకు బ్రహ్మరథం పట్టారు. అమిత్ షాతో పీఎంకే నేత అన్భుమణి రాందాసు, ఐజేకే నేత పచ్చముత్తు పారివేందర్, పుదియ నిధి కట్చి నేత ఏసీ షణ్ముగం భేటీ అయ్యారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు.
సాక్షి, చెన్నై:రాష్ట్రంలో బీజేపీ బలోపేతంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా దృష్టి పెట్టారు. ఇది వరకు అనధికారిక పర్యటనతో చెన్నైకి వచ్చారు. అధికారిక పర్యటనగా శనివారం తమిళనాట అడుగు పెట్టారు. కేరళ పర్యటనను ముగించుకుని శనివారం మధ్యాహ్నం చెన్నైలోకి అడుగు పెట్టిన తమ అధినేతకు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్, కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్, జాతీయ నేతలు మురళీధరరావు, ఇల గణేషన్, హెచ్.రాజ తదితరులు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అమి త్ షా కాసేపు గిండిలోని ఓ హోటల్‌లో బస చేశారు.
మిత్రులతో భేటీ
పీఎంకే అధినేత రాందాసు తనయుడు, ఎంపీ అన్భుమణి రాందాసు, ఆ పార్టీ సీనియర్ నేత ఏకే.మూర్తి తదితరులు అమిత్ షాను కలుసుకున్నారు. అలాగే ఐజేకే నేత పచ్చముత్తు పారివేందర్, పుదియనిధి కట్చి నేత ఏసీ షణ్ముగం భేటీ అయ్యారు. అన్భుమణి మీడియాతో మాట్లాడుతూ తమిళులు ఎదుర్కొంటున్న సమస్యల్ని అమిత్ షా దృష్టికి తెచ్చేందుకు వచ్చామన్నారు. జాలర్లపై దాడులు, కావేరి, ముల్లై పెరియార్ వివాదాలను ఆయన దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరామన్నారు.
బలమైన శక్తిగా అవతరిద్దాం
మరై మలైనగర్ వేదికగా శనివారం సాయంత్రం బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా అమిత్ షా యూపీఏ పాలనను ఎండగట్టారు. ఆరు నెలల తమ పాలన గురించి రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారని, మరి పదేళ్లు వాళ్లేమి చేశారోనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రధాని నరేంద్ర మోడీ దూతగా ప్రతి నాయకుడు, కార్యకర్త గ్రామగ్రామాన తిరిగి సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తమిళనాడులో కుటుంబ పాలనకు స్వస్తి పలకాలని, మార్చి మార్చి అధికారం అప్పగించే పద్ధతిని వీడాలని కోరారు. తమిళులు గౌరవప్రదంగా జీవిం చాలన్నా, తమిళ ఖ్యాతిని చాటే విధంగా ముందుకు సాగాలన్నా బీజేపీకి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బలమైన శక్తిగా అవతరించేందుకు ప్రతి కార్యకర్తా శ్రమించాలని పిలుపు నిచ్చారు.
సినీ గ్లామర్
నటి గాయత్రీ రఘురాం, సంగీత దర్శకుడు గంగై అమరన్, నటి కుట్టి పద్మినిలు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. డీఎంకే నుంచి బయటకు వచ్చిన కేంద్ర మాజీ మంత్రి నెపోలియన్ బీజేపీలో చేరనున్నట్లు తమిళ పత్రికల్లో ప్రకటనలు వెలువడ్డాయి. అయితే సభలో ఆయన కనిపించలేదు. నెపోలియన్ ఆదివారం బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. చెన్నైలోని కమలాలయంలో అమిత్ షా ఆదివారం తొలిసారిగా అడుగు పెట్టబోతున్నారు. ఉదయం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. అనంతరం మీడియాతో మాట్లాడతారు. చివరగా పార్టీ జిల్లాల కార్యదర్శులతో భేటీ కానున్నారు. అలాగే పార్టీ సభ్యత్వ ప్రక్రియకు శ్రీకారం చుడతారు.