సామాజిక శక్తులను ఐక్యం చేస్తాం: తమ్మినేని
చర్ల /దుమ్ముగూడెం: తెలంగాణలోని అన్ని సామాజిక శక్తులను ఐక్యం చేసి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొడతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. ఆయన చేపట్టిన మహాజన పాదయాత్ర శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో కొనసాగింది. దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలో జరిగిన బహిరంగసభలో తమ్మినేని మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు వస్తాయని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికిన టీఆర్‌ఎస్ ఇప్పటి వరకు ఎన్ని నిధులు, నీళ్లు వచ్చాయి.. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు.
సాగునీరు ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: పాత ఖమ్మం జిల్లాలో ప్రధానంగా ఉన్న సాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శనివారం లేఖ రాశారు. పక్కనే గోదావరి, దానికి పోటీపడుతూ సాగే తాలిపేరు, దాని చుట్టూ అనేక వాగులు వంకలూ ఉన్నప్పటికీ చర్ల, దుమ్ముగూడెం మండలాలకు సాగునీటి గ్యారెంటీ లేదన్నారు.