జనాభా ప్రాతిపదికన బడ్జెట్ ప్రవేశపెట్టాలి
ఆమోదిస్తే బహిరంగ సభపై వైఖరి మార్చుకుంటాం: తమ్మినేని
చిట్యాల: సామాజిక న్యాయమే ధ్యేయంగా జనాభా ప్రాతి పదికన ప్రభుత్వం శాసన సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆమోదిస్తే ఈ నెల 19న హైదరాబాద్‌లో చేపట్టనున్న భారీ మహాజన బహిరంగసభ నిర్వహణపై తమ వైఖరిని మార్చుకుంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నల్లగొండ జిల్లాలో మహాజన పాదయాత్ర ముగిసిన సందర్భంగా శనివారం చిట్యాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు పేదలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. టీఆర్‌ఎస్ హయాంలో అన్ని రంగాల్లో రాష్ట్రం వెనుకబాటుకు గురవుతోందన్నారు.
బీజేపీ విజయం.. సెక్యులరిజానికి ప్రమాదం
మతతత్వ ఎజెండాను అమలు చేయడం ద్వారా ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ నాలుగు రాష్ట్రాల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించిందని తమ్మినేని అన్నారు. బీజేపీ విజయంతో దేశ సెక్యులరిజానికి ముప్పు పొంచి ఉందని.. ఇప్పటికై నా లౌకిక శక్తులు ఏకం కావాలని అభిప్రాయపడ్డారు.