మహదాయికి తారాబలం | Tara strength mahadayiki | Sakshi
Sakshi News home page

మహదాయికి తారాబలం

Published Mon, Sep 14 2015 1:51 AM | Last Updated on Sun, Sep 3 2017 9:20 AM

మహదాయికి తారాబలం

మహదాయికి తారాబలం

పోరాటానికి మద్దతు తెలిపిన చలనచిత్ర పరిశ్రమ
హుబ్లీలో భారీ ర్యాలీ
నీటి పథకం అమలయ్యే వరకూ పోరాటం
 

బెంగళూరు :  ఉత్తర కర్ణాటక ప్రాంతానికి తాగు, సాగు నీటిని అందించడానికి ఉద్దేశించిన మహదాయి పథకాన్ని వెంటనే ప్రారంభించాలని కన్నడ చిత్ర రంగానికి చెందిన నటీనటులు డిమాండ్ చేశారు. మహదాయి విషయంలో రాష్ట్ర రైతుల వెన్నంటి ఉంటామని వారు భరోసా ఇచ్చారు. మహదాయి పథకాన్ని ప్రారంభించాలంటూ గత కొన్ని నెలలుగా ఉత్తర కర్ణాటక ప్రాంత ప్రజలు వివిధ రూపాల్లో తమ నిరసనను తెలియజేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుల పోరాటానికి కన్నడ చిత్రపరిశ్రమ మద్దతు తెలిపింది. ఈ క్రమంలో హుబ్లీలో  ఆదివారం జరిగిన నిరసన కార్యక్రమంలో శాండిల్‌వుడ్‌కు చెందిన నేటి తరం హీరో, హీరోయిన్‌లతో పాటు అలనాటి నటీనటులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కన్నడ రైతులకు ఏ కష్టం వచ్చినా ఆదుకోవడంతో చిత్ర రంగం ముందుటుందని తెలిపారు. ఈ నిరసన కేవలం ఆరంభం మాత్రమేనని ఈ పథకం అమలు కోసం ఢిల్లీలో ధర్నా జరపడానికి కూడా వెనుకాడబోమని తెలిపారు.

కేవలం హీరో, హీరోయిన్‌లే  కాకలైట్‌బాయ్ మొదలుకుని దర్శకుల వరకు వందల సంఖ్యలో శాండిల్‌వుడ్‌కు చెందిన పలు విభాగాల నిపుణులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. హుబ్లీ ప్రజలే కాకుండా తమ అభిమాన నటీనటులను చూడటానికి చుట్టు పక్కల గ్రామాల నుంచి వేల సంఖ్యలో అభిమానులు నిరసన వేదిక వద్దకు వచ్చారు. పోలీసు శాఖ అంచనాల కంటే రెట్టింపు సంఖ్యలో ప్రజలు ఒకచోటకు చేరడంతో చిన్నపాటి గందరగోళం నెలకొంది. ప్రజల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ... ‘మహదాయితో పాటు కళస-బండూరి పథకం అమలయ్యేంత వరకూ కన్నడ చలన చిత్ర సీమ ఏదో ఒక రూపంలో నిరసన కార్యక్రమం చేపడుతూనే ఉంటుంది. వెనక్కితగ్గేది లేదు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. అందువల్ల వారి ప్రయోజనాలు కాపాడటం కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తూనే ఉంటాం’ అని అన్నారు.  భారతి విష్ణువర్ధన్ మాట్లాడుతూ... న్యాయ పరంగానే కాదు, మానవీయ కోణంలో చూసినా మహదాయి, కళసా బండారు పథకాలను వెంటనే ప్రారంభించాలని అన్నారు. రైతులు లేకపోతే రాష్ట్రం లేదన్న విషయాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు గుర్తించాలని అన్నారు.

 ఉపేంద్ర మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలను పక్కన పెట్టి రైతుల మేలు కోసం కృషి చేయాలన్నారు. మహదాయి విషయంలో కొంతమంది నాయకులు అనవసర రాద్దాంతాలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. పొలాన్ని నమ్ముకున్న రైతులను కూడా కుట్ర రాజకీయాల్లోకి లాగుతున్నారని మండిపడ్డారు. కళసబండూరితో పాటు మహదాయి పథకం అమలయ్యేంత వరకూ వెనక్కు తగ్గబోమని ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement