ప్రియుడు సహా టీడీపీ నేత భార్య ఆత్మహత్య
► విషం తాగి 12 ఏళ్ల కుమారుడూ మృతి
►కన్యాకుమారి లాడ్జీలో ముగ్గురి మృతదేహాలు
సాక్షి ప్రతినిధి,చెన్నై: వివాహేతర సంబంధం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. భర్త ఆకస్మిక మృతి, ఉరివేసుకుని భార్య, విష ప్రభావంతో కుమారుడు ప్రాణాలు విడిచారు. వీరితోపాటు మరో వ్యక్తి ఉరివేసుకుని తమిళనాడు, కన్యాకుమారిలోని ఒక లాడ్జీలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతులంతా విజయవాడకు చెందిన వారు కాగా, మృతుల్లో ఇద్దరు మాచవరం తెలుగుదేశం పార్టీ నగర కార్యదర్శి దివంగత శ్రీనివాస యాదవ్ భార్య కల్యాణి, కుమారుడు ఉజ్వల్ కృష్ణ యాదవ్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం మేరకు.. కన్యాకుమారి వివేకానందపురం కూడలిలోని ఒక లాడ్జీకి ఈనెల 4వ తేదీన వచ్చిన వ్యక్తి తన పేరు అనిల్‌కుమార్ చౌదరి అని, కన్యాకుమారిని సందర్శించేందుకు తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ సమీపం మంచాలుదురై నుంచి వచ్చామని పరిచయం చేసుకున్నాడు.
తనతో ఉన్నవారిని భార్య, కుమారుడి (12)గా పరిచయం చేశాడు. 5వ తేదీన కన్యాకుమారిలో తిరిగి రాత్రి రూముకు చేరుకున్నారు. మరుసటి రోజు తలుపులు తెరవకపోవడంతో అనుమానించిన లాడ్జీ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తలుపులు తెరిచి చూడగా పెద్దవాళ్లిద్దరూ ఉరి వేసుకుని వేలాడుతుండగా, 12 ఏళ్ల బాలుడు విషంసేవించి నేలపైన శవాలుగా పడిఉన్నారు. వారికి సమీపంలో దొరికిన ఉత్తరంలో వ్యాపారంలో వచ్చిన నష్టం కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డామని, తమ అం త్యక్రియలు కన్యాకుమారీలోనే జరిపించాల్సిం దిగా పేర్కొన్నారు. అంత్యక్రియల ఖర్చుకు త మ వద్ద నున్న నగలను వాడుకోవాలని, తమ బలవన్మరణాలను బంధువులకు తెలపవద్దని వేడుకున్నారు. పోలీసులు మృతదేహాలను స్వా ధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపారు. అ లాగే వారి ఫొటోలను ఆంధ్రప్రదేశ్ పోలీసులకు పంపి వివరాలు సేకరించాల్సిందిగా కోరారు.
మృతురాలు దేశం నేత భార్య
మృతుల ఫొటోలు చూసిన ఏపీ పోలీసులు ఇచ్చిన సమాచారంతో కన్యాకుమారి పోలీసులు ఖంగుతిన్నారు. మృతుడు అనిల్‌కుమార్ చౌదరి అసలుపేరు అనిల్‌కుమార్ యాదవ్ (35), అతనితోపాటు వచ్చిన మహిళ పేరు కల్యాణి (35). వీరిది విజయవాడ సమీపంలోని మాచవరం. మారుతీనగర్ కాట్టూరులారీ వీధిలో నివసిస్తున్నారు. కల్యాణి భర్త ఉమ్మిడి శ్రీనివాస యాదవ్. ఈ దంపతులకు ఉజ్వల్ కృష్ణయాదవ్ (12) అనే కుమారుడు ఉన్నాడు. శ్రీనివాస యాదవ్ మాచవరం తెలుగుదేశం పార్టీ నగర కార్యదర్శిగా ఉండేవారు. వడ్డీ వ్యాపారి. గత ఏడాది శ్రీనివాసయాదవ్ అకస్మాత్తుగా చనిపోగా, సహాయకునిగా ఉండిన పడాల కనకారావు అలియాస్ కన్న వ్యాపారాన్ని కొనసాగించాడు. కనకారావుకు, కల్యాణీకి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుసుకున్న బంధువులు కల్యాణీని హెచ్చరించారు.
కల్యాణి కనకారావును కలవడం మానివేసి అదే ప్రాంతానికి చెందిన చిన్ని అనిల్‌కుమార్ యాదవ్‌తో సాన్నిహిత్యాన్ని పెంచుకుంది. గత నెల 25వ తేదీన కనకారావు సైతం అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనిల్‌కుమార్‌తో కల్యాణి సాగిస్తున్న వివాహేతర సంబంధం కనకారావుకు తెలిసిపోవడం వల్ల ఇద్దరూ కలిసి హత్యచేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. గతనెలలో కల్యాణిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారించి పంపివేశారు. అదేనెల 27వ తేదీన మరోసారి విచారణకు రావాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. అయితే ఈ తరుణంలో కుమారుడు సహా కల్యాణి ఇంటి నుంచి మాయమైంది.
మాచవరం పోలీసులు కల్యాణి కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కల్యాణి, ఆమె ప్రియుడు అనిల్‌కుమార్ యాదవ్ ఆత్మహత్య చేసుకున్న సమాచారాన్ని కన్యాకుమారి పోలీసులు పంపిన ఫొటోల ద్వారా తెలుసుకున్నారు. కన్యాకుమారి పోలీసులు పంపిన ఫొటోల ఆధారంగా మృతులు కల్యాణి, కుమారుడు కృష్ణ, అనిల్‌కుమార్ యాదవ్‌గా బంధువులు గుర్తించారు. గురువారం కన్యాకుమారి చేరుకున్న బంధువులు ఇచ్చిన సమాచారం వల్ల వివాహేతర సంబంధాల బాగోతం బైటపడింది. ముగ్గురూ ఆత్మహత్యకు పాల్పడ్డారా లేక అనిల్‌కుమార్ తల్లి, కుమారుడిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడా పోస్టుమార్టం రిపోర్టు వస్తేగానీ తెలియదని పోలీసులు చెప్పారు. పోస్టుమార్టం పూర్తయిన తరువాతనే మృతదేహాలను అప్పగిస్తామని బంధువులకు చెప్పారు.