తుళ్లూరు సీఆర్‌డీఏ కార్యాలయంలో రికార్డులతో కుస్తీ పడుతున్న అధికారులు
‘సాక్షి’ కథనాలతో అధికార పార్టీ నేతల్లో కలవరం
రైతులు నిలదీయడంతో అనంతవరం సీఆర్‌డీఏ కార్యాలయానికి తాళం
భూ కుంభకోణం వాస్తవమేనన్న టీడీపీలోని ఓ వర్గం నేతలు
సాక్షి, అమరావతి బ్యూరో: ఏపీ రాజధాని గ్రామాల్లో అవినీతి ‘సెంటు’ నుంచి తప్పించుకునేందుకు అధికార పార్టీ నేతలు, కొందరు సీఆర్‌డీఏ అధికారులు నానా తంటాలు పడుతున్నారు. భూ కబ్జాపై ‘సాక్షి’ పత్రిక తప్పుడు కథనాలు రాసిందని చెప్పడానికి టీడీపీ నేతలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా రెండ్రోజులుగా విలేకరుల సమావేశం అని చెప్పి రద్దు చేసుకుంటున్నారు. ఇదిలాఉంటే ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం రాత్రి వరకు తుళ్లూరు సీఆర్‌డీఏ కార్యాలయంలో అధికారులు రికార్డులతో కుస్తీ పడుతున్నారు. అనంతవరంలో సెంట్ల చొప్పున భూదోపిడీపై ‘సాక్షి’కి పక్కా ఆధారాలు ఎలా దొరికాయి? ఎవరి చ్చారు? అనే దానిపై టీడీపీ నేతలు విచారణ చేపట్టారు.
మా భూమి ఎలా మాయమైంది?
రాజధాని అమరావతి పరిధిలోని అనంతవరంలో భూ కుంభకోణంపై ‘సాక్షి’ పక్కా ఆధారాలతో వరుస కథనాలను ప్రచురించిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ నేతలు ‘సాక్షి’ ప్రతినిధులను బెదిరించడం, గ్రామస్తులను భయపెట్టడం వంటి చర్యలకు దిగారు. పత్రికలో వచ్చిన కథనాలు అవాస్తవం... తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు గానీ వాటిని బయటపెట్టడం లేదు. మరోవైపు సోమవారం ఉదయం సీఆర్‌డీఏ కార్యాలయానికి వచ్చిన అధికారులను గ్రామస్తులు చుట్టుముట్టారు. తమ భూమిలో నుంచి సెంట్ల చొప్పున స్థలం ఎలా మాయమైందని నిలదీశారు. అధికారులు ఏం సమాధానం చెప్పాలో తెలియక కార్యాలయానికి తాళం వేసుకుని వెళ్లిపోయారు.
రైతులకు అన్యాయం జరిగితే సహించం
రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ సహించలేక టీడీపీలోని ఓ వర్గం ప్రభుత్వ తీరును తప్పుబడుతోంది. భూ కుంభకోణంపై ‘సాక్షి’లో వచ్చిన కథనాలు వాస్తవమేనని ఆ వర్గం నేతలు స్పష్టం చేశారు.
పొరపాట్లు ఉంటే సవరించుకుంటాం
‘‘100 రెవెన్యూ రికార్డులను పరిశీలించి భూ యజమానులను గుర్తించాం. ఫారం 9(1) ఇచ్చిన రైతుల భూముల వివరాలు, సర్వేలో వెల్లడైన భూముల వివరాలు ఒకేలా ఉండకపోవచ్చు. ఎక్కడైనా పొరపాట్లు ఉంటే సవరించుకుంటాం. సర్వే నంబర్ 270లో ఆరుగురు రైతులకు కలిపి 15 ఎకరాల 94 సెంట్లు పొలం ఉందన్నారు. వీరిలో బండల వెంకాయమ్మ అనే మహిళా రైతు 3 ఎకరాల 74 సెంట్లు సీఆర్‌డీఏకు ఇచ్చింది. అయితే సీఆర్‌డీఏ నిర్వహించిన సర్వేలో 3 ఎకరాల 39 సెంట్లు మాత్రమే ఉన్నట్టు తేలింది.
ఈటీఎస్ ద్వారా సర్వే నిర్వహించగా 3 ఎకరాల 42 సెంట్లు ఉన్నట్లు తేలింది. దీంతో అందరికీ లెక్క సరిపోయింది. వెంకాయమ్మ ఇచ్చింది 3 ఎకరాల 74 సెంట్లు. డాక్యుమెంట్ల ప్రకారం అయితే సర్వే నంబర్‌లో ఉన్న 15 ఎకరాల 94 సెంట్లకు మరో 32 సెంట్లు అదనంగా చేర్చాల్సి ఉంది. ఈ అదనపు భూమిని సీఆర్‌డీఏ ఎక్కడ నుంచి తేవాలి? జమ్మిగుంపుల పద్మజ సర్వేనంబర్ 114 లో 1.95 ఎకరాలు ఉన్నట్టు చూపగా ఎకరం 90 సెంట్లకు సెటిల్ చేశాం.
నెల్లూరి రావమ్మ సర్వేనెంబర్ 119/బిలో 1.99 సెంట్లు చూపగా 1.90 సెంట్లకు సెటిల్ చేశాం. గొరిజాల అరుణకు 1.17 ఎకరాలు చూపగా ఎకరానికి సెటిల్ చేశాం. పోలు భూ దేవయ్య సర్వే నెంబర్ 81/1 లో 1. 13 ఎకరాలు ఉన్నట్టు చూపినా ఆయన వద్ద కేవలం 40 సెంట్లకు మాత్రమే డాక్యుమెంట్ ఉంది. సర్వేనంబర్ 100ఈలో బండల సూరిబాబుకు 36 సెంట్లు ఉన్నా 8 సెంట్లే ఉన్నట్లు సీఆర్‌డీఏ అధికారులు తప్పుడు సర్టిఫికెట్ ఇవ్వడంపై విచారణ చేస్తాం’’
– చెన్నకేశవులు, సీఆర్‌డీఏ డిప్యూటీ కమిషనర్