రాజధాని గ్రామాల్లో రౌడీయిజం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం రౌడీయిజం చేస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై, భూములు ఇవ్వని రైతులపై టీడీపీ సర్కారు దౌర్జన్యానికి పాల్పడుతోంది. ల్యాండ్‌పూలింగ్‌కు ఇవ్వని పంటపొలాలను ధ్వంసం చేసి రైతుల్లో భయాందోళనలు సృష్టించడానికి ప్రభుత్వ పెద్దలు ప్రయత్నించారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటను ధ్వంసం చేసేందుకు యత్నించారు.
లింగాయపాలెం సమీపంలోని అనుమోలు గాంధీకి చెందిన పొలంలో బుధవారం భారీ చెట్లను కూల్చివేశారు. విషయం తెలుసుకున్న స్థానిక రైతులు పరుగు పరుగున రావడం గమనించిన డ్రైవర్లు జేసీబీలను విడిచి పారిపోయారు. రైతులు, ఐక్యవేదిక సభ్యులు పంటపొలాల వద్దకు చేరుకుని ప్రభుత్వ దౌర్జన్యంపై నిరసన తెలిపారు. రైతులను భయపెట్టి భూములు లాక్కోవాలని చూస్తే అంతుచూస్తామని హెచ్చరించారు.
ఏం జరిగిందంటే..
లింగాయపాలెంలో అనుమోలు గాంధీకి సర్వే నంబర్ 184లో 4.03 ఎకరాల పొలం ఉంది. ఈ భూమిని ఆయన పూలింగ్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆ పొలాన్ని లింగాయపాలెం గ్రామానికి చెందిన శంకరయ్య అనే రైతుకు కౌలుకు ఇచ్చారు. ఆ రైతు ఎకరానికి రూ.2.25లక్షల చొప్పున మొత్తం రూ.9లక్షలు వెచ్చించి మొక్కజొన్న, కంద పంట సాగు చేశారు. విరగపండిన మొక్కజొన్న కోతలు ప్రారంభించారు. ఇంకా కొంత కోయాల్సి ఉంది. అది పూర్తయ్యాక కంద తవ్వకం ప్రారంభించాలనుకున్నారు.
ఇంతలో బుధవారం మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో రెండు జేసీబీలు గాంధీ పొలం వద్దకు చేరుకున్నాయి. పంటపొలంలోకి వెళ్లేందుకు అడ్డుగా ఉన్న భారీ తాటిచెట్లను జేసీబీలతో పెకలించటం ప్రారంభించారు. 10 చెట్లను పెకలించి నూర్పిడికి సిద్ధంగా చేసిన మొక్కజొన్న పంటలోనే పడేశారు. తాటిచెట్లను పెకలించే సమయంలో కంద పంట కూడా కొంత దెబ్బతింది. భారీ తాటిచెట్లు కిందపడే సమయంలో వచ్చిన శబ్ధంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. జేసీబీలు ఉన్న ప్రాంతానికి స్థానికులు కొందరు పరుగులు పెట్టారు. రైతులు వస్తున్నారని గమనించిన డ్రైవర్లు జేసీబీలను విడిచి పారిపోయారు.
జేసీబీలను పంపించినదెవరు?
రాజధాని గ్రామాల్లో ప్రభుత్వ దౌర్జన్యాలు ఓ పథకం ప్రకారం సాగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో సాగుతున్న దౌర్జన్యకాండలో ప్రభుత్వ విభాగాలు, అధికారులు పావులుగా వ్యవహరిస్తున్నారు. దౌర్జన్యాలు జరిగే సమయంలో సీఆర్‌డీఏ, రెవెన్యూ విభాగం నేరుగా రంగంలో ఉండటం లేదు. బుధవారం జరిగిన దౌర్జన్యకాండలోనూ సీఆర్‌డీఏ నేరుగా తెర మీదకు రాలేదు. భూములు ఇవ్వని రైతులను భయపెట్టి లాక్కోవడంలో భాగంగా ప్రభుత్వ పెద్దలే జేసీబీలు పంపించినట్లు రైతులు చెబుతున్నారు.
ఉద్యమనేతలకు ప్రభుత్వ హెచ్చరిక!
రాజధానిలో ప్రభుత్వం రైతుల చేస్తున్న అన్యాయాలపై దళితులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, సీపీఐ నేతలు ఏకమై రాజధాని ఐక్యవేదిక పేరుతో ఇటీవల లింగాయపాలెంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ప్రభుత్వంపై పోరాడేందుకు ఆ సదస్సులో నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై జాతీయస్థాయిలో ఉద్యమం చేపడుతున్నట్లు ప్రకటించారు. రాజధానిలోని పలుగ్రామాల్లో నిపుణుల కమిటీ సభ్యులను రైతులు అడ్డుకోవటాన్ని ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. రైతులను ఏకం చేస్తున్న ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే ఐక్యవేదిక సభ్యుడు అనుమోలు గాంధీని టార్గెట్ చేసి ఉద్యమకారులకు హెచ్చరికలు జారీ చేశారనే ప్రచారం జరుగుతోంది.
భయపెట్టి బలవంతంగా లాక్కోవటమే లక్ష్యం
రాజధాని ప్రకటించిన మొదట్లో భూములు ఇవ్వటానికి నిరాకరించిన రైతులను ప్రభుత్వం రకరకాలుగా వేధిపులకు గురించేసింది. ఉండవల్లి, పెనుమాకలో అరటితోటను గుర్తుతెలియని వ్యక్తులు తగులపెట్టారు. మల్కాపురం వద్ద చెరుకుతోటకు నిప్పంటించారు. వెలగపూడి, లింగాయపాలెం పరిధిలోనూ పంటపొలాల్లో దౌర్జన్యం చేసి రైతులను భయభ్రాంతులకు గురిచేశారు.
అదే తరహాలో మరోసారి రైతులను భయభ్రాంతులకు గురిచేసేందుకే జేసీబీలను పంపించిందని తెలుస్తోంది. ప్రభుత్వ చర్యలపై ఐక్యవేదిక సభ్యులు మండిపడ్డారు. భూముల కోసం రైతులను భయపెట్టాలని అనుకుంటే ప్రభుత్వం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఐక్యవేదిక కొనసాగిస్తున్న ఉద్యమాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపే ప్రసక్తిలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ దౌర్జన్యకాండపై చట్టపరంగా ముందుకు వెళ్తామని ప్రకటించారు.
పెనుమాకకు నోటిఫికేషన్
రాజధానిలో మరో గ్రామానికి భూసేకరణ నోటిఫికేషన్ జారీ అయింది. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి అధికారులు 660.83 ఎకరాలకు నోటిఫికేషన్ జారీచేశారు. దీంతో 904 మంది భూ యజమానులు ప్రభావితులు అవుతారని ఆ నోటిఫికేషన్‌లో అధికారులు పేర్కొన్నారు.