తమిళులను బలిగొని
తమిళనాడులో పార్టీనా
సభ్యత్వ నమోదుకు ససేమిరా
పార్టీ ప్రవేశాన్ని అడ్డుకుంటాం
చెన్నై, సాక్షి ప్రతినిధి:తెలుగుదేశం పార్టీ తమిళనాడుశాఖ ఆవిర్భావానికి ఆదిలోనే అడ్డు తగిలింది. సభ్యత్వ నమోదు కార్యక్రమంతో రాష్ట్రంలో పార్టీ ప్రవేశాన్ని అడ్డుకుంటామని తమిళనాడు ముస్లిం మున్నేట్ర కళగం (తముక) పేర్కొంది. 20 మంది తమిళులను ఎన్‌కౌంటర్‌లో హతమార్చి తమిళనాడులో పార్టీ పెడతావా చంద్రబాబు ఖబడ్దార్ అంటూ ఆపార్టీ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటన ద్వారా హెచ్చరించింది. తిరుపతి శేషాచల అడవుల్లో 20 మంది తమిళ కూలీలు ఏపీ పోలీసులు కాల్పుల్లో ప్రాణాలు విడిచారు. ఎర్రచందనం స్మగ్లర్లకు కొమ్ముకాస్తూ అమాయక కూలీలను పొట్టన పెట్టుకున్నారని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రం యావత్తూ ఆందోళనలతో అట్టుడికి పోయింది. తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలతో రాష్ట్రం దద్దరిల్లిపోయింది. సీఎం చంద్రబాబు, అటవీశాఖా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి దిష్టిబొమ్మలను తగులబెట్టి తమిళులు తమ నిరసనలను తెలిపారు. అయితే ఈ ఆందోళనలు కొద్ది రోజుల తరువాత సద్దుమణిగాయి.
టీడీపీ సన్నాహాలు:
తమిళుల మనోభిప్రాయాలను తక్కువగా అంచనావేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పార్టీని విస్తరించే పనికి పూనుకుంది. ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్‌రావులను తమిళనాడు పరిశీలకులుగా పార్టీ నియమించింది. చెన్నైలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించి ఐదు లక్షల సభ్యత్వ నమోదు చేయాలని వారు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కొందరిపై బాధ్యతలు పెట్టారు. సభ్యత్వ నమోదుకు ఈనెల 17వ తేదీన ముహూర్తం నిర్ణయించారు. టీడీపీ ఇక జాతీయపార్టీ, కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని అప్పుడే పచ్చతమ్ముళ్లు ఆ సమావేశంలో ప్రగల్భాలకు పోయారు. అయితే ఇంతా చేస్తే ఆనాటి సన్నాహక సమావేశానికి చెన్నైలో అసలైన తెలుగుదేశం నేతలు హాజరుకాలేదు. సీనియర్లను వదలి సభ్యత్వానికి సిద్ధం పడడంపై విమర్శలు మొదలైనాయి. సభ్యత్వ నమోదులో పాల్గొంటున్నారని ఒక నేతను అడిగితే ఏదో సమావేశానికి వెళ్లాను, టీడీపీ పోస్టర్ చేతిలో పెట్టారని వ్యాఖ్యానించాడు.
తముక హెచ్చరిక ః
సన్నాహక సమావేశమే వివాదాస్పదం అయిన తరుణంలో తముక పార్టీతో టీడీపీకి కొత్త తంటా వచ్చిపడింది. తమిళనాడులో పార్టీ ఏర్పాట్లపై తముక ప్రధాన కార్యదర్శి అదియమాన్ విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎక్కడైనా పార్టీని పెట్టుకునే హక్కు ఉంది, ఇందుకు తాము వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. సీఎం చంద్రబాబు తమిళ కూలీలను పిట్టలను కాల్చినట్లు కాల్పించి హతమార్చిన సంఘటనతో రాష్ట్ర ప్రజల రక్తం ఉడుకుతుండగానే పార్టీ పెట్టడానికి ఆయన సాహసించారని ఆయన దుయ్యబట్టారు. కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు చంద్రబాబు సాయం చేయలేదు,
అమానుషంగా కాల్పులకు పాల్పడిన పోలీసులపై క్రమశిక్ష ణ చర్య తీసుకోలేదని ఆయన తప్పుపట్టారు. ఏపీ ప్రభుత్వ తీరును ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు సాగాయి. ఇవన్నీ చంద్రబాబుకు తెలిసి కూడా తమిళుల హృదయాలను మరింత గాయపరుస్తూ రెచ్చగొట్టే విధంగా పార్టీ స్థాపనకు దిగాడని ఆయన విమర్శించారు. తమిళులతో కలిసి చంద్రబాబు చర్యలను ఖండించాల్సిన రాష్ట్రంలోని తెలుగువారు కొంచెం కూడా మనస్సాక్షి లేకుండా వ్యవహరించారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు చర్యలను తాము చూస్తూ ఊరుకోబోమని, ఈనెల 17వ తేదీన జరుగనున్న టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.
చంద్రబాబూ ఖబడ్దార్
Published Fri, May 15 2015 1:54 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement
Advertisement