Membership Registration program
-
టార్గెట్ 30 లక్షలు.. జరిగింది 2.5 లక్షలే.. ఆ నాలుగు ఓకే.. కానీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ సభ్యత్వనమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. నవంబర్ ఒకటిన ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు రెండున్నర లక్షలమంది మాత్రమే సభ్యులుగా చేరారు. వచ్చేఏడాది జనవరి 26తో ఈ ప్రక్రియ ముగియనుంది. గడువు వరకు 30 లక్షల సభ్యత్వాలు నమోదు చేయించాలని టీపీసీసీ లక్ష్యం పెట్టుకుంది. 20 రోజుల క్రితమే లోక్‌సభ నియోజకవర్గాలవారీగా ఇన్చార్జీల నియామకం పూర్తయినప్పటికీ ఆ ప్రక్రియ ఇంకా గాడిన పడలేదని ఈ లెక్కలు చెబుతున్నాయి. పార్టీకి పట్టున్న లోక్‌సభ స్థానాల పరిధిలోనూ అంతంత మాత్రంగానే జరుగుతుండటం గమనార్హం. హజరుకాని నేతలు...: సభ్యత్వ నమోదు ప్రక్రియపై సోమవారం గాంధీభవన్‌లో జరిగిన సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్, పార్టీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి మహేశ్ కుమార్‌గౌడ్, డిజిటల్ సభ్యత్వ నమోదు ఇన్చార్జీలు హర్కర వేణుగోపాల్, దీపక్ జాన్‌లు హాజరై పార్లమెంటు స్థానాలవారీగా ప్రక్రియను సమీక్షించారు. పలు పార్లమెంటరీ స్థానాల ఇన్చార్జీలు ఏఆర్జీ వినోద్‌రెడ్డి, గోపిశెట్టి నిరంజన్, సిరిసిల్ల రాజయ్య, సంభాని చంద్రశేఖర్, రాములు నాయక్, కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు హాజరు కాగా మిగతా ఏడుగురు ఇన్చార్జీలు డుమ్మాకొట్టారు. సభ్యత్వ నమోదులో ఎదురవుతున్న సమస్యలు, సాంకేతిక ఇబ్బందుల గురించి సమావేశంలో చర్చించారు. త్వరలోనే అసెంబ్లీ స్థాయి కోఆర్డినేటర్లను నియమించాలని, సభ్యత్వ నమోదులో చురుగ్గా పాల్గొనని స్థానికనేతలపై అవసరమైతే వేటు వేయాలని నిర్ణయించారు. చదవండి:నాకు జీవం లేదు.. 4 రోజుల క్రితమే చనిపోయాను: కాంగ్రెస్ ఎమ్మెల్యే నల్లగొండ, మల్కాజ్గిరి, నాగర్‌కర్నూల్, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాల్లో కొంత చురుగ్గానే సభ్యత్వ నమోదు సాగుతోంది. నాగర్‌కర్నూల్‌లో 23 వేలు, మల్కాజ్‌గిరిలో 20 వేలు, నల్లగొండ, మహబూబాబాద్‌లలో 18 వేల చొప్పున సభ్యత్వాలు పూర్తయ్యాయి. సభ్యత్వనమోదు కోసం మండల స్థాయి ఇన్చార్జీల నియామకంలో నల్లగొండ స్థానం ముందుంది. కానీ, హైదరాబాద్, సికింద్రాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ స్థానాల పరిధిలో ఇప్పటివరకు కనీసం వెయ్యిమందిని కూడా చేర్పించకపోవడం గమనార్హం. సభ్యత్వనమోదు ఇప్పుడే గాడిలో పడుతోందని, జనవరి 26 నాటికి లక్ష్యాన్ని చేరుకుంటామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి మహేశ్‌కుమార్‌గౌడ్ ‘సాక్షి’కి చెప్పారు. -
‘5 లక్షల కోట్ల’ లక్ష్యం సాధిస్తాం
వారణాసి: దేశ ఆర్థిక వ్యవస్థను వచ్చే ఐదేళ్లలో రూ.340 లక్షల కోట్ల (5 లక్షల కోట్ల డాలర్ల) స్థాయికి తీసుకెళ్లాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని తప్పుపట్టేవారంతా నిపుణులైన నిరాశావాదులని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. వచ్చే ఐదేళ్లలో అనుకున్న లక్ష్యాన్ని సాధించి, నవభారత్ ముందుకు దూసుకెళుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ సిద్ధాంతకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ 118వ జయంతిని పురస్కరించుకుని వారణాసిలో చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన..‘5 లక్షల కోట్ల డాలర్ల లక్ష్యం అవసరం ఏమిటంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. లక్ష్య సాధనకు మార్గాలు చూపడం బదులు విమర్శించడమే పనిగా పెట్టుకున్న ఇటువంటి వారిని నేను నిపుణులైన నిరాశావాదులంటాను. సాధారణ ప్రజానీకం గురించి వారికి పట్టింపు ఉండదు. వారిని మీరు ఏదైనా సలహా అడిగితే, మిమ్మల్ని సమస్యల పాలుచేస్తారు’ అంటూ ఎద్దేవా చేశారు. ‘లక్ష్య సాధనలో చర్చలు, విమర్శలు కూడా అవసరమే. కానీ, లక్ష్యాన్ని తప్పుపట్టడం మాత్రం సరికాదు. అలాంటి వారితో అప్రమత్తంగా ఉండాలి’ అని హెచ్చరించారు. తలసరి ఆదాయం, వినియోగం, ఉత్పాదకత పెంపు ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను రెట్టింపు చేసేందుకు 2019–20 బడ్జెట్ రోడ్‌మ్యాప్‌గా ఉపయోగపడుతుందని, నవభారత్ సాధన దిశగా దేశాన్ని ముందుకు దూసుకుపోయేలా చేస్తుందని ప్రధాని అన్నారు. ‘కేక్ ఎంత పెద్దదన్నదే అసలు విషయం. పెద్ద కేక్ అయితే, ఎక్కువ మందికి వస్తుంది. అదే విధంగా, దేశ ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేర్చడం లక్ష్యంగా పెట్టుకున్నాం’ అన్నారు. వచ్చే ఐదేళ్లలో రోడ్లు, నౌకాశ్రయాలు వంటి మౌలిక రంగాల అభివృద్ధికి, అందరికీ గృహకల్పన, దేశీయ ఉత్పత్తిరంగం అభివృద్ధి వంటి వాటికి రూ.100 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలతో మమేకం కావాలి పార్టీ సభ్యత్వంపై ప్రధాని మాట్లాడుతూ..‘అన్ని వర్గాల ప్రజలను పార్టీతో మమేకం చేయాలి. పార్టీతో కలిసి దేశానికి రాయబారులు మాదిరిగా పనిచేయడానికి సభ్యత్వ నమోదు ఉపయోగపడాలి’ అన్నారు. ఒక రోజు పర్యటనలో భాగంగా ఆయన వారణాసి విమానాశ్రయం వద్ద మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రధాని నగరంలో మొక్కలు నాటే కార్యక్రమం ‘ఆనంద్ కానన్’ను ప్రారంభించారు. జన్‌సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ 118వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు ఘన నివాళులర్పించారు. ‘జాతి సమగ్రతకు ఆయన అందించిన సేవలు కలకాలం గుర్తుండిపోతాయి. ఆయన గొప్ప విద్యావేత్త, జాతీయవాది’ అని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
చంద్రబాబూ ఖబడ్దార్
తమిళులను బలిగొని తమిళనాడులో పార్టీనా సభ్యత్వ నమోదుకు ససేమిరా పార్టీ ప్రవేశాన్ని అడ్డుకుంటాం చెన్నై, సాక్షి ప్రతినిధి:తెలుగుదేశం పార్టీ తమిళనాడుశాఖ ఆవిర్భావానికి ఆదిలోనే అడ్డు తగిలింది. సభ్యత్వ నమోదు కార్యక్రమంతో రాష్ట్రంలో పార్టీ ప్రవేశాన్ని అడ్డుకుంటామని తమిళనాడు ముస్లిం మున్నేట్ర కళగం (తముక) పేర్కొంది. 20 మంది తమిళులను ఎన్కౌంటర్లో హతమార్చి తమిళనాడులో పార్టీ పెడతావా చంద్రబాబు ఖబడ్దార్ అంటూ ఆపార్టీ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటన ద్వారా హెచ్చరించింది. తిరుపతి శేషాచల అడవుల్లో 20 మంది తమిళ కూలీలు ఏపీ పోలీసులు కాల్పుల్లో ప్రాణాలు విడిచారు. ఎర్రచందనం స్మగ్లర్లకు కొమ్ముకాస్తూ అమాయక కూలీలను పొట్టన పెట్టుకున్నారని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రం యావత్తూ ఆందోళనలతో అట్టుడికి పోయింది. తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలతో రాష్ట్రం దద్దరిల్లిపోయింది. సీఎం చంద్రబాబు, అటవీశాఖా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి దిష్టిబొమ్మలను తగులబెట్టి తమిళులు తమ నిరసనలను తెలిపారు. అయితే ఈ ఆందోళనలు కొద్ది రోజుల తరువాత సద్దుమణిగాయి. టీడీపీ సన్నాహాలు: తమిళుల మనోభిప్రాయాలను తక్కువగా అంచనావేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పార్టీని విస్తరించే పనికి పూనుకుంది. ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్‌రావులను తమిళనాడు పరిశీలకులుగా పార్టీ నియమించింది. చెన్నైలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించి ఐదు లక్షల సభ్యత్వ నమోదు చేయాలని వారు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కొందరిపై బాధ్యతలు పెట్టారు. సభ్యత్వ నమోదుకు ఈనెల 17వ తేదీన ముహూర్తం నిర్ణయించారు. టీడీపీ ఇక జాతీయపార్టీ, కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని అప్పుడే పచ్చతమ్ముళ్లు ఆ సమావేశంలో ప్రగల్భాలకు పోయారు. అయితే ఇంతా చేస్తే ఆనాటి సన్నాహక సమావేశానికి చెన్నైలో అసలైన తెలుగుదేశం నేతలు హాజరుకాలేదు. సీనియర్లను వదలి సభ్యత్వానికి సిద్ధం పడడంపై విమర్శలు మొదలైనాయి. సభ్యత్వ నమోదులో పాల్గొంటున్నారని ఒక నేతను అడిగితే ఏదో సమావేశానికి వెళ్లాను, టీడీపీ పోస్టర్ చేతిలో పెట్టారని వ్యాఖ్యానించాడు. తముక హెచ్చరిక ః సన్నాహక సమావేశమే వివాదాస్పదం అయిన తరుణంలో తముక పార్టీతో టీడీపీకి కొత్త తంటా వచ్చిపడింది. తమిళనాడులో పార్టీ ఏర్పాట్లపై తముక ప్రధాన కార్యదర్శి అదియమాన్ విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎక్కడైనా పార్టీని పెట్టుకునే హక్కు ఉంది, ఇందుకు తాము వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. సీఎం చంద్రబాబు తమిళ కూలీలను పిట్టలను కాల్చినట్లు కాల్పించి హతమార్చిన సంఘటనతో రాష్ట్ర ప్రజల రక్తం ఉడుకుతుండగానే పార్టీ పెట్టడానికి ఆయన సాహసించారని ఆయన దుయ్యబట్టారు. కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు చంద్రబాబు సాయం చేయలేదు, అమానుషంగా కాల్పులకు పాల్పడిన పోలీసులపై క్రమశిక్ష ణ చర్య తీసుకోలేదని ఆయన తప్పుపట్టారు. ఏపీ ప్రభుత్వ తీరును ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు సాగాయి. ఇవన్నీ చంద్రబాబుకు తెలిసి కూడా తమిళుల హృదయాలను మరింత గాయపరుస్తూ రెచ్చగొట్టే విధంగా పార్టీ స్థాపనకు దిగాడని ఆయన విమర్శించారు. తమిళులతో కలిసి చంద్రబాబు చర్యలను ఖండించాల్సిన రాష్ట్రంలోని తెలుగువారు కొంచెం కూడా మనస్సాక్షి లేకుండా వ్యవహరించారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు చర్యలను తాము చూస్తూ ఊరుకోబోమని, ఈనెల 17వ తేదీన జరుగనున్న టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. -
‘సభ్యత్వ’ ప్రభంజనం
రెట్టింపు దిశగా సాగుతున్న నమోదు లక్ష్యాన్ని ఎప్పుడో దాటేశాం కేసీఆర్ పథకాలకు ఆకర్శితులవుతున్న జనం ‘సాక్షి’తో టీఆర్ఎస్ జిల్లా పరిశీలకుడు సామ్యుల్ సంగారెడ్డి : ఉద్యమగడ్డ అయిన మెతుకుసీమలో టీఆర్ఎస్కే ప్రజలు పట్టం కట్టారు.. అదే స్ఫూర్తితో జిల్లాలో ప్రభంజనంలా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు సాగుతోంది..రాష్ట్రంలోనే మెదక్ జిల్లాను అగ్రస్థానంలో నిలుపుతాం’.. అని చెబుతున్నారు టీఆర్ఎస్ జిల్లా పరిశీలకులు మందుల సామ్యుల్. నేటితో సభ్యత్వ నమోదుకు తెరపడనున్న నేపథ్యంలో సభ్యత్వ నమోదు,పార్టీ తీరుతెన్నులపై గురువారం సామ్యుల్‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రశ్న: జిల్లాలో టీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది? జ : మెదక్ జిల్లా ఉద్యమానికి దిక్సూచి. ఈ జిల్లానే తెలంగాణ ప్రజలకు యుద్ధం నేర్పింది. ఉద్యమనేత, సీఎం కేసీఆర్ సొంత జిల్లా ఇది. టీఆర్ఎస్ ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది. అందుకే ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు మా పార్టీకే పట్టం కడుతున్నారు. మంత్రి హరీష్‌రావు సారథ్యంలో జిల్లాలో టీఆర్ఎస్ ఎంతో బలంగా ఉంది. ప్ర: సీఎం సొంత జిల్లాకు పరిశీలకునిగా రావడాన్ని ఎలా భావిస్తున్నారు? జ : అదృష్టంగా భావిస్తున్నా. నాది నల్గొండ జిల్లా మోత్కూరు మండలం ధర్మారం గ్రామం. ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి నేను కేసీఆర్ వెన్నంటే ఉన్నా. పదేళ్లుగా ఎస్సీ సెల్ విభాగానికి అధ్యక్షునిగా పనిచేస్తున్నా. కేసీఆర్ నాపై నమ్మకం ఉంచి మెదక్ జిల్లాకు సభ్యత్వ నమోదు బాధ్యతలు అప్పగించడం గర్వంగా ఉంది. ప్ర: జిల్లాలో పార్టీ నాయకత్వం పనితీరు ఎలా ఉంది? జ: చాలా బాగుంది. పార్టీ నేతలు, కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో సహా ముఖ్యనేతలంతా సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. ప్ర: జిల్లాలో సభ్యత్వ నమోదుకు స్పందన ఎలా ఉంది? జ: అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ కార్యక్రమం ప్రభంజనంలా సాగుతోంది. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌తో కలిసి న్యాల్కల్ వంటి మారుమూల మండలంలోని పల్లెల్లో తిరిగి చూశా. ప్రజల నుంచి ఊహించని రీతిలో స్పందన వస్తోంది. పది నియోజకవర్గాల్లో ప్రజలు స్వచ్ఛందంగా సభ్యత్వం స్వీకరిస్తున్నారు. విదేశాల్లో ఉన్న వారు సైతం ఆన్లైన్ ద్వారా తీసుకుంటున్నారు. ప్ర: లక్ష్యాన్ని చేరుకుంటారా? జ: లక్ష్యాన్ని ఎప్పుడో దాటాం. రెట్టింపు దిశగా అడుగులు వేస్తున్నాం. జిల్లాలో మూడు లక్షలపైచిలుకు సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటివరకు 4,22,230 సభ్యత్వ నమోదు పూర్తయింది. ఇందులో 88 వేల పైచిలుకు మంది క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. శుక్రవారంతో సభ్యత్వ నమోదు పూర్తవుతుంది. సభ్యత్వ నమోదు ఆరు లక్షలు దాటుతుందని భావిస్తున్నాం. ప్ర: ఎందుకు ఇంత స్పందన వస్తుందంటారు? జ: సీఎం కేసీఆర్ సర్కార్ చేపడుతోన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు టీఆర్ఎస్ వైపు ఆకర్శితులవుతున్నారు. పింఛన్లు, భూ పంపిణీ, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలను చూసి ప్రజలు టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీలను ఎవరూ విశ్వసించడంలేదు. కేసీఆర్ సారథ్యంలోనే బంగారు తెలంగాణ సాధ్యమని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ప్ర: మంత్రి హరీష్‌రావు ఏమైనా సూచనలు చేశారా? జ: కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ‘హరీష్‌రావు ముఖ్యమైన మంత్రి’. హరీష్‌రావు రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు అద్భుతం. కేసీఆర్ నాయకత్వ లక్షణాలను హరీష్‌రావు అచ్చంగా పుణికి పుచ్చుకున్నారు. సభ్యత్వ నమోదు విజయవంతమయ్యేందుకు ఆయన సలహాలు ఎంతో ఉపకరించాయి. ఎంపీ, ఎమ్మెల్యేలు సైతం సంపూర్ణ సహకారాన్ని అందించారు. ప్ర: సభ్యత్వం తీసుకున్న వారికి ఎలాంటి ప్రయోజనాలున్నాయి? జ: టీఆర్ఎస్ సభ్యత్వం స్వీకరించిన వారికి పార్టీలో సముచితమైన గుర్తింపు లభిస్తుంది. పార్టీకి పునాదులైన కార్యకర్తలను టీఆర్ఎస్ గుండెల్లో పెట్టి చూసుకుంటుంది. సభ్యత్వం స్వీకరించిన ప్రతి ఒక్కరికి రూ.2 లక్షల బీమా వర్తిస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కూడా వారిదే. ప్ర: సభ్యత్వం పూర్తయిన తర్వాత ఏం చేస్తారు? జ: సభ్యత్వం నమోదు పూర్తి కాగానే గ్రామ, మండల కమిటీలను ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత జిల్లా కమిటీని ఎన్నుకుంటాం. ఏప్రిల్ 17 వరకు అన్ని కమిటీల ఏర్పాటును పూర్తి చేస్తాం. -
ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం
టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తోందని.. ప్రభుత్వం మెడలు వంచి సంక్షేమ పథకాలు అమలయ్యేలా చూ స్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం ఇంద్రవెల్లిలోని మార్కెట్ యార్డులో నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. - ఉట్నూర్/ఇంద్రవెల్లి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఉట్నూర్/ఇంద్రవెల్లి : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తోందని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఇంద్రవెల్లిలోని మార్కెట్ యార్డులో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు ఆదివాసీ అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రభుత్వం తప్పిదాలను కప్పి పుచ్చుకోవడానికి ప్రజలకు నమ్మశక్యం కాని హామీలిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. అధికారంలోకి రాగానే లక్ష రూపాయల రుణమాఫీ అన్న కేసీఆర్ ఏడాదికి 25 శాతం అనడంతో వడ్డీ రైతులకు అదనపు భార మైందన్నారు. ప్రభుత్వం చర్యలతో రైతాంగానికి బ్యాంకులు ఖరీఫ్, రబీ సీజన్లో రుణాలు ఇవ్వని పరిస్థితి దాపురించిందన్నారు. అప్పులు తీర్చలేక ఇప్పటికే రాష్ట్రంలో 400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం రద్దు చేసి ఫాస్ట్ పథకం తెచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు ఏ ఒక్క విద్యార్థికి లాభం చేకూర్చింది లేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఉత్త మాటేనని ఎద్దేవా చేశారు. డబ్బుల్ బెడ్రూంలు నిర్మించి ఇస్తామని చెప్పి గృహ నిర్మాణ శాఖకు బడ్జెట్లో కేటాయించింది వెయ్యి కోట్లేనని పేర్కొన్నారు. పాత బకాయిలే రాష్ట్రంలో 2400 కోట్లు ఉన్నాయన్నారు. కేంద్ర పథకాలు రా6ష్టంలో అమలయ్యేలా బీజేపీ చర్యలు తీసుకుంటుందన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు గిరిజనులు ప్రతిబింబాలని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. గిరిజన విద్యాభివృద్ధికి ఇక్కడే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటయ్యేలా కృషి చేస్తానన్నారు. గిరిజనం అంటేనే అమాయకులని వారిలో రాజకీయ, విద్య, చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత పార్టీలోని ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. గిరిజనుల అభివృద్ధికి బాటలు వేసే ఐటీడీఏలో పూర్తిస్థాయిలో అధికారులను నియమించకపోవడం ప్రభుత్వం తప్పిదమన్నారు. ప్రతి పోలింగ్ బూత్‌లో రెండు వందల మంది పార్టీ సభ్యత్వ నమోదు చేయించడం లక్ష్యమన్నారు. తద్వారా జిల్లాలో పార్టీ సభ్యత్వం రెండు లక్షలు చేరుతుంద న్నారు. కార్యక్రమంలో బీజేపీ గిరిజన మోర్చా జాతీయ కార్యదర్శి గుగ్లావత్ శ్రీ రాంనాయక్, స్వచ్ఛ భారత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావుల రాంనాథ్, జిల్లా అధ్యక్షుడు అయన్నగారి భూమన్న, ఉపాధ్యక్షుడు మాడవి రాజు, కిషాన్ మోర్చా అధ్యక్షుడు దీపక్ సింగ్ షెకావత్, యువ మోర్చా అధ్యక్షుడు పెందోర్ ప్రభకర్, మహిళ మోర్చా ఉపాధ్యాక్షురాలు గంగుబాయి, జిల్లా కార్యదర్శి కొమ్ము రాంచందర్, దళిత మోర్చా కార్యదర్శి కాటం రవీందర్, ఖానాపూర్ నియోజకవర్గం ఇన్చార్జి కొండెరి రమేష్, మండల అధ్యక్షుడు మరప రాజు, నాయకులు పాయల శంకర్, బాబులాల్, మిల్ సింగ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు. తదుపరి ఐటీడీఏ ఎదుట ఏడు రోజులుగా ఆందోళన చేస్తున్న సీఆర్టీల దీక్షను సందర్శించారు. ఈ సందర్భంగా సీఆర్టీలు కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. -
ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ
హన్మకొండ : తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యమ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే కాకుండా 2019లో అధికారమే లక్ష్యంగా బీజేపీ నాయకు లు, కార్యకర్తలు సభ్యత్వ నమోదు చేపట్టాలని ఆ పార్టీ శాసనసభా పక్ష నేత కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు. హన్మకొండ ఎన్జీవోస్ కాలనీలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ సభ్యత్వా న్ని నమోదు ఆయన ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పార్టీ సభ్యత్వ నమోదుపై శ్రేణులు దృష్టి సారించాలని సూచించారు. ముందుచూపు లేని రాష్ట్ర ప్రభుత్వం.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, వాగ్దానాల అమలుపై తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యం గా వ్యవహరిస్తోందని లక్ష్మణ్ దుయ్యబట్టారు. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోగా, సీఎం కేసీఆర్ ఉద్యమ నేతగానే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పూర్తిస్థాయి సీఎంగా పనిచేయడం లేదని, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కుటుంబాలకు భరోసా ఇవ్వడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. లక్ష ఉద్యోగా లు ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, కనీసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదన్నారు. అయితే, రాజకీయ ఉద్యోగాలు మాత్రం భర్తీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇక కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య మాట దేవుడెరుగు... ఉన్న పాఠశాలలను రేషనలైజేషన్ పేరిట మూసివేతకు కుట్ర పన్నారని విమర్శించారు. అలాగే, ఫాస్ట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థులకు, పింఛన్లు కుదించడం ద్వారా లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం లేదని.. రాష్ట్రీయ ఏక్తా దినోత్సవం సందర్భంగా కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హైదరాబాద్ వస్తే సీఎం కేసీఆర్ కానీ మంత్రులు కానీ కలవలేదని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం కేంద్రంతో సఖ్యతగా మెలుగుతూ నిధుల మంజూరు చేయించుకోవాలని లక్ష్మణ్ హితవు పలికారు. యథాతథ స్థితికి మేం వ్యతిరేకం.. రాష్ట్ర శాసనసభలో అధికార, ప్రతిపక్షాలు కుమ్మక్కై శంషాబాద్ విమానాశ్రయం టెర్మినల్ పేరు మార్చకుండా యథాతథ స్థితి కొనసాగించాలని తీర్మానం ప్రవేశపెట్టాయని లక్ష్మణ్ ఆరోపించారు. విమానాశ్రయం టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని బీజేపీ తెలంగాణ శా ఖ వ్యతిరేకిస్తోందని.. ఈ విషయం అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చినప్పుడు రాష్ట్రానికి చెందిన పీవీ.నర్సింహారావు, కొమురం భీం సహా ఐదు పేర్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాలని కోరినట్లు తెలిపారు. అయితే, దీన్ని పట్టిం చుకోకుండా యథాతథ స్థితిని కొనసాగించేలా తీర్మానం ప్రవేశపెడితే తాము అభ్యంతరం చెప్పామన్నారు. కానీ రాజీవ్‌గాంధీ పేరు కొనసాగించేలా తీర్మానించిన అధికార పక్షానికి ఆయనపై ఎందుకు అంత ప్రేమో అర్థం కావడం లేదని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు మార్తినేని ధర్మారావు, కార్యదర్శి రావు పద్మ, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎర్రబెల్లి రాంమోహన్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, మందాడి సత్యనారాయణరెడ్డి, నాయకులు నాగపురి రాజమౌళి, కాసర్ల రాంరెడ్డి, డాక్టర్ విజయ్‌చందర్‌రెడ్డి, గాదె రాంబాబు, మల్లాడి తిరుపతి రెడ్డి, చిలుక విజయారావు, దిలీప్, శ్రీరాముల మురళీమనోహర్, దుప్పటి భద్రయ్య, ఏదునూరి భవాని, రవళి పాల్గొన్నారు. -
పొన్నాల.. చూడాల
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వర్గపోరుతో కునారిల్లుతున్న జిల్లా కాంగ్రెస్‌ను గాడిలో పెట్టేందుకు ఆ పార్టీ అధిష్టానం మరో ప్రయత్నం చేస్తోంది. కమ్యూనిస్టులను దీటుగా ఎదుర్కొని జిల్లాలో నిలదొక్కుకన్న ఆ పార్టీ పరిస్థితి ప్రస్తుతం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా కార్యకర్తల్లో ఉత్తేజం నింపడానికి పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. వర్గపోరుతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం ఒకింత ఇబ్బంది అయినా దీన్ని విజయవంతం చేసి పార్టీ కార్యక్రమాలకు కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. ఆశయం గొప్పదే అయినా వర్గవిభేదాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ పార్టీని ఒకతాటిపైకి తీసుకురావడానికి పొన్నాల ఏం మాయచేస్తారో అనేది చర్చనీయాంశంగా మారింది. కొలిక్కిరాని అధ్యక్ష ఎన్నిక డీసీసీ అధ్యక్ష పీఠం నుంచి వనమా వెంకటేశ్వరరావు వైదొలిగినప్పటి నుంచి నూతన అధ్యక్షుని ఎన్నిక విషయంలో పలుమార్లు చర్చలు జరిగాయి. ఖమ్మం నుంచి మొదలైన సమావేశాలు హైదరాబాద్, ఢిల్లీ స్థాయికి చేరినా ఇంత వరకు అధ్యక్షున్ని ఎన్నుకోలేకపోయారు. డీసీసీ కమిటీ ఎన్నిక నిమిత్తం సమావేశం ఏర్పాటు చేసిన ప్రతిసారీ తమ వర్గీయుడంటే తమ వర్గీయుడినే అధ్యక్షున్ని చేయాలని ఆయా వర్గాలు పట్టుబడుతున్నాయి. చివరికి ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలోనూ ఇదే తంతు కొనసాగడం గమనార్హం. ఈ సమావేశానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ హాజరయ్యారు. ఆయన సమక్షంలోనే పరస్పర దూషణలకు దిగడంతో అధ్యక్షుని వ్యవహారం ఓ కొలిక్కి రాకుండానే సమావేశాన్ని ముగించారు. ఆ సమావేశం ఆధిపత్య పోరులా సాగింది తప్ప అధ్యక్షున్ని నిర్ణయించేలా సాగకపోవడంపై పార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఏకాభిప్రాయం ఎప్పటికి సాధ్యమో... ఢిల్లీలో సమావేశమై 15 రోజులకు పైగా అవుతున్నా ఇంత వరకు ఆ పార్టీ జిల్లా నేతలు ఒక అవగాహనకు రాకపోవడంపై కార్యకర్తలు మండిపడుతున్నారు. పార్టీకి, కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉండే వ్యక్తినే నాయకున్ని చేయాలని ఆ పార్టీ ద్వితీయశ్రేణి నాయకత్వం ఆకాంక్షిస్తోంది. ఢిల్లీ సమావేశంలో తగిన నాయకుని పేరు సూచించాలని దిగ్విజయ్ కోరారు. ఖమ్మం, మధిర ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్, మల్లు భట్టివిక్రమార్క ఒక పేరును, పాలేరు ఎమ్మెల్యే రామిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మరో పేరును, రాజ్యసభ ఎంపీ రేణుకాచౌదరి వేరొక పేరును సూచించారు. ఈ సమావేశంలో ఎవరికి వారు తమ వర్గానిదే పైచేయి కావాలని ప్రయత్నించారు తప్ప సమస్యను ఓ కొలిక్కి తేవాలనే ఉద్దేశం ఎవరిలో కనిపించలేదని ఆ సమావేశం తర్వాత వెలువడిన సమాచారం. ఇలా ఏ విషయంలోనూ ఒకతాటిపైకి రాలేని కాంగ్రెస్ పార్టీలో ఉండటం కంటే ప్రత్యామ్నాయం చూసుకోవటం మంచిదనే అభిప్రాయంలో ఆ పార్టీ కేడర్ ఉంది. టీఆర్ఎస్ వైపు చూపు కాంగ్రెస్ నేతల వ్యవహారశైలితో విసిగివేసారిన పలువురు పార్టీని వీడి వెళ్తున్నారు. వారంతా అధికార టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. వారిని నిలువరించే చొరవ తీసుకునే నాయకుడే కాంగ్రెస్‌కు కరువయ్యారనే అభిప్రాయం కార్యకర్తల్లో నెలకొంది. సభ్యత్వ నమోదు కోసం జిల్లాకు వస్తున్న పొన్నాల లక్ష్మయ్యకు తమ ఆవేదన తెలిపేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. వర్గపోరుతో సతమతమవుతున్న జిల్లా కాంగ్రెస్‌ను గాడిలో పెట్టడం, సభ్యత్వ నమోదును విజయవంతం చేయడం పొన్నాలకు సవాల్‌గా మారనుంది.