రెట్టింపు దిశగా సాగుతున్న నమోదు
లక్ష్యాన్ని ఎప్పుడో దాటేశాం
కేసీఆర్ పథకాలకు ఆకర్శితులవుతున్న జనం
‘సాక్షి’తో టీఆర్‌ఎస్ జిల్లా పరిశీలకుడు సామ్యుల్
సంగారెడ్డి : ఉద్యమగడ్డ అయిన మెతుకుసీమలో టీఆర్‌ఎస్‌కే ప్రజలు పట్టం కట్టారు.. అదే స్ఫూర్తితో జిల్లాలో ప్రభంజనంలా టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు సాగుతోంది..రాష్ట్రంలోనే మెదక్ జిల్లాను అగ్రస్థానంలో నిలుపుతాం’.. అని చెబుతున్నారు టీఆర్‌ఎస్ జిల్లా పరిశీలకులు మందుల సామ్యుల్. నేటితో సభ్యత్వ నమోదుకు తెరపడనున్న నేపథ్యంలో సభ్యత్వ నమోదు,పార్టీ తీరుతెన్నులపై గురువారం సామ్యుల్‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
ప్రశ్న: జిల్లాలో టీఆర్‌ఎస్ పరిస్థితి ఎలా ఉంది?
జ : మెదక్ జిల్లా ఉద్యమానికి దిక్సూచి. ఈ జిల్లానే తెలంగాణ ప్రజలకు యుద్ధం నేర్పింది. ఉద్యమనేత, సీఎం కేసీఆర్ సొంత జిల్లా ఇది. టీఆర్‌ఎస్ ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది. అందుకే ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు మా పార్టీకే పట్టం కడుతున్నారు. మంత్రి హరీష్‌రావు సారథ్యంలో జిల్లాలో టీఆర్‌ఎస్ ఎంతో బలంగా ఉంది.
ప్ర: సీఎం సొంత జిల్లాకు పరిశీలకునిగా రావడాన్ని ఎలా భావిస్తున్నారు?
జ : అదృష్టంగా భావిస్తున్నా. నాది నల్గొండ జిల్లా మోత్కూరు మండలం ధర్మారం గ్రామం. ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి నేను కేసీఆర్ వెన్నంటే ఉన్నా. పదేళ్లుగా ఎస్సీ సెల్ విభాగానికి అధ్యక్షునిగా పనిచేస్తున్నా. కేసీఆర్ నాపై నమ్మకం ఉంచి మెదక్ జిల్లాకు సభ్యత్వ నమోదు బాధ్యతలు అప్పగించడం గర్వంగా ఉంది.
ప్ర: జిల్లాలో పార్టీ నాయకత్వం పనితీరు ఎలా ఉంది?
జ: చాలా బాగుంది. పార్టీ నేతలు, కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులతో సహా ముఖ్యనేతలంతా సమన్వయంతో ముందుకు సాగుతున్నారు.
ప్ర: జిల్లాలో సభ్యత్వ నమోదుకు స్పందన ఎలా ఉంది?
జ: అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ కార్యక్రమం ప్రభంజనంలా సాగుతోంది. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌తో కలిసి న్యాల్‌కల్ వంటి మారుమూల మండలంలోని పల్లెల్లో తిరిగి చూశా. ప్రజల నుంచి ఊహించని రీతిలో స్పందన వస్తోంది. పది నియోజకవర్గాల్లో ప్రజలు స్వచ్ఛందంగా సభ్యత్వం స్వీకరిస్తున్నారు. విదేశాల్లో ఉన్న వారు సైతం ఆన్‌లైన్ ద్వారా తీసుకుంటున్నారు.
ప్ర: లక్ష్యాన్ని చేరుకుంటారా?
జ: లక్ష్యాన్ని ఎప్పుడో దాటాం. రెట్టింపు దిశగా అడుగులు వేస్తున్నాం. జిల్లాలో మూడు లక్షలపైచిలుకు సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటివరకు 4,22,230 సభ్యత్వ నమోదు పూర్తయింది. ఇందులో 88 వేల పైచిలుకు మంది క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. శుక్రవారంతో సభ్యత్వ నమోదు పూర్తవుతుంది. సభ్యత్వ నమోదు ఆరు లక్షలు దాటుతుందని భావిస్తున్నాం.
ప్ర: ఎందుకు ఇంత స్పందన వస్తుందంటారు?
జ: సీఎం కేసీఆర్ సర్కార్ చేపడుతోన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు టీఆర్‌ఎస్ వైపు ఆకర్శితులవుతున్నారు. పింఛన్లు, భూ పంపిణీ, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలను చూసి ప్రజలు టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీలను ఎవరూ విశ్వసించడంలేదు. కేసీఆర్ సారథ్యంలోనే బంగారు తెలంగాణ సాధ్యమని ప్రజలు బలంగా నమ్ముతున్నారు.
ప్ర: మంత్రి హరీష్‌రావు ఏమైనా సూచనలు చేశారా?
జ: కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ‘హరీష్‌రావు ముఖ్యమైన మంత్రి’. హరీష్‌రావు రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు అద్భుతం. కేసీఆర్ నాయకత్వ లక్షణాలను హరీష్‌రావు అచ్చంగా పుణికి పుచ్చుకున్నారు. సభ్యత్వ నమోదు విజయవంతమయ్యేందుకు ఆయన సలహాలు ఎంతో ఉపకరించాయి. ఎంపీ, ఎమ్మెల్యేలు సైతం సంపూర్ణ సహకారాన్ని అందించారు.
ప్ర: సభ్యత్వం తీసుకున్న వారికి ఎలాంటి ప్రయోజనాలున్నాయి?
జ: టీఆర్‌ఎస్ సభ్యత్వం స్వీకరించిన వారికి పార్టీలో సముచితమైన గుర్తింపు లభిస్తుంది. పార్టీకి పునాదులైన కార్యకర్తలను టీఆర్‌ఎస్ గుండెల్లో పెట్టి చూసుకుంటుంది. సభ్యత్వం స్వీకరించిన ప్రతి ఒక్కరికి రూ.2 లక్షల బీమా వర్తిస్తుంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కూడా వారిదే.
ప్ర: సభ్యత్వం పూర్తయిన తర్వాత ఏం చేస్తారు?
జ: సభ్యత్వం నమోదు పూర్తి కాగానే గ్రామ, మండల కమిటీలను ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత జిల్లా కమిటీని ఎన్నుకుంటాం. ఏప్రిల్ 17 వరకు అన్ని కమిటీల ఏర్పాటును పూర్తి చేస్తాం.
‘సభ్యత్వ’ ప్రభంజనం
Published Fri, Feb 20 2015 12:32 AM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM
Advertisement
Advertisement