'రాముపని రాముకే.. నాపని నాకే'
హైదారాబాద్: 'రాముకు(కేటీఆర్) నాకు ఆధిపత్య పోరని, గ్రేటర్ ఎన్నికల్లో నన్ను దూరం పెట్టారనేది ఓ న్యూసెన్స్' అని టీఆర్ఎస్ పార్టీ నేత మంత్రి హరీశ్ రావు అన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక ఇలా చౌకబారు ప్రచారం చేస్తున్నారని అన్నారు. 'మేమంతా ఒక్కటిగా ముందుకు సాగుతున్నాం. మెదక్ జిల్లా నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు ఒకేసారి వచ్చాయి. రెండు ఎన్నికలూ మాకు ముఖ్యమే. జిల్లా మంత్రిగా నారాయణఖేడ్ ఉప ఎన్నికల బాధ్యతలను సీఎం నాకు అప్పగించారు. గ్రేటర్ ఎన్నికల బాధ్యతలను రాముకు, ఇతర మంత్రులకు ఇచ్చారు' అని హరీష్ రావు అన్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ కనీసం 90 నుంచి 100 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. నారాయణఖేడ్‌లో 25 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తామని తాను ముఖ్యమంత్రికి మాటిచ్చానని, కానీ, ప్రజా స్పందన చూస్తుంటే మాత్రం మిగిలిన రెండు పార్టీలకు డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని హరీష్ రావు చెప్పారు. తాము 50 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుస్తామని, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.