పొన్నాల.. చూడాల
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వర్గపోరుతో కునారిల్లుతున్న జిల్లా కాంగ్రెస్‌ను గాడిలో పెట్టేందుకు ఆ పార్టీ అధిష్టానం మరో ప్రయత్నం చేస్తోంది. కమ్యూనిస్టులను దీటుగా ఎదుర్కొని జిల్లాలో నిలదొక్కుకన్న ఆ పార్టీ పరిస్థితి ప్రస్తుతం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా కార్యకర్తల్లో ఉత్తేజం నింపడానికి పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. వర్గపోరుతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం ఒకింత ఇబ్బంది అయినా దీన్ని విజయవంతం చేసి పార్టీ కార్యక్రమాలకు కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. ఆశయం గొప్పదే అయినా వర్గవిభేదాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ పార్టీని ఒకతాటిపైకి తీసుకురావడానికి పొన్నాల ఏం మాయచేస్తారో అనేది చర్చనీయాంశంగా మారింది.
కొలిక్కిరాని అధ్యక్ష ఎన్నిక
డీసీసీ అధ్యక్ష పీఠం నుంచి వనమా వెంకటేశ్వరరావు వైదొలిగినప్పటి నుంచి నూతన అధ్యక్షుని ఎన్నిక విషయంలో పలుమార్లు చర్చలు జరిగాయి. ఖమ్మం నుంచి మొదలైన సమావేశాలు హైదరాబాద్, ఢిల్లీ స్థాయికి చేరినా ఇంత వరకు అధ్యక్షున్ని ఎన్నుకోలేకపోయారు. డీసీసీ కమిటీ ఎన్నిక నిమిత్తం సమావేశం ఏర్పాటు చేసిన ప్రతిసారీ తమ వర్గీయుడంటే తమ వర్గీయుడినే అధ్యక్షున్ని చేయాలని ఆయా వర్గాలు పట్టుబడుతున్నాయి. చివరికి ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలోనూ ఇదే తంతు కొనసాగడం గమనార్హం. ఈ సమావేశానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ హాజరయ్యారు. ఆయన సమక్షంలోనే పరస్పర దూషణలకు దిగడంతో అధ్యక్షుని వ్యవహారం ఓ కొలిక్కి రాకుండానే సమావేశాన్ని ముగించారు. ఆ సమావేశం ఆధిపత్య పోరులా సాగింది తప్ప అధ్యక్షున్ని నిర్ణయించేలా సాగకపోవడంపై పార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఏకాభిప్రాయం ఎప్పటికి సాధ్యమో...
ఢిల్లీలో సమావేశమై 15 రోజులకు పైగా అవుతున్నా ఇంత వరకు ఆ పార్టీ జిల్లా నేతలు ఒక అవగాహనకు రాకపోవడంపై కార్యకర్తలు మండిపడుతున్నారు. పార్టీకి, కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉండే వ్యక్తినే నాయకున్ని చేయాలని ఆ పార్టీ ద్వితీయశ్రేణి నాయకత్వం ఆకాంక్షిస్తోంది. ఢిల్లీ సమావేశంలో తగిన నాయకుని పేరు సూచించాలని దిగ్విజయ్ కోరారు. ఖమ్మం, మధిర ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్, మల్లు భట్టివిక్రమార్క ఒక పేరును, పాలేరు ఎమ్మెల్యే రామిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మరో పేరును, రాజ్యసభ ఎంపీ రేణుకాచౌదరి వేరొక పేరును సూచించారు. ఈ సమావేశంలో ఎవరికి వారు తమ వర్గానిదే పైచేయి కావాలని ప్రయత్నించారు తప్ప సమస్యను ఓ కొలిక్కి తేవాలనే ఉద్దేశం ఎవరిలో కనిపించలేదని ఆ సమావేశం తర్వాత వెలువడిన సమాచారం. ఇలా ఏ విషయంలోనూ ఒకతాటిపైకి రాలేని కాంగ్రెస్ పార్టీలో ఉండటం కంటే ప్రత్యామ్నాయం చూసుకోవటం మంచిదనే అభిప్రాయంలో ఆ పార్టీ కేడర్ ఉంది.
టీఆర్‌ఎస్ వైపు చూపు
కాంగ్రెస్ నేతల వ్యవహారశైలితో విసిగివేసారిన పలువురు పార్టీని వీడి వెళ్తున్నారు. వారంతా అధికార టీఆర్‌ఎస్ వైపు చూస్తున్నారు. వారిని నిలువరించే చొరవ తీసుకునే నాయకుడే కాంగ్రెస్‌కు కరువయ్యారనే అభిప్రాయం కార్యకర్తల్లో నెలకొంది. సభ్యత్వ నమోదు కోసం జిల్లాకు వస్తున్న పొన్నాల లక్ష్మయ్యకు తమ ఆవేదన తెలిపేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. వర్గపోరుతో సతమతమవుతున్న జిల్లా కాంగ్రెస్‌ను గాడిలో పెట్టడం, సభ్యత్వ నమోదును విజయవంతం చేయడం పొన్నాలకు సవాల్‌గా మారనుంది.