ఉత్తమ్‌కు టీపీసీసీ పగ్గాలు?
తొలిసారి జిల్లాకు దక్కే అవకాశం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ (టీపీసీసీ) అధ్యక్ష పదవి జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. హుజూర్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆయనను టీపీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తారని శనివారం పార్టీ వర్గా ల్లో జోరుగా ప్రచారం సాగింది. ఇప్పటివరకు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను మార్చి ఉత్తమ్‌ను ఎంపిక చేస్తారని ఢిల్లీ స్థాయిలో ఊహాగానాలు వినిపించాయి. దీంతో ఆయన మద్దతుదారులు జిల్లాలో సంబరాలు చేసుకున్నారు. నల్లగొండతో పాటు హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో పార్టీ నేతలు బాణసంచాకాల్చి, ర్యాలీలు నిర్వహించారు. కానీ శనివారం పొద్దుపోయేంత వరకు కూడా ఏఐసీసీ వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు.
అయితే పొన్నాల లక్ష్మయ్యను మార్చి ఉత్తమ్‌ను నియమించడం ఖాయమని , ఈ మేరకు అధిష్టానం నిర్ణయం తీసుకుందని కాంగ్రె స్ శ్రేణులు అంటున్నాయి. ఉత్తమ్‌కు టీపీసీసీ పగ్గాలు అప్పగిస్తే రాష్ట్ర కాంగ్రెస్‌లోని రెండు కీలక పదవులూ (పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత) జిల్లాకే దక్కినట్టవుతుంది. ఇప్పటికే జిల్లాకు చెందిన జానారెడ్డి సీఎల్పీనేతగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే తొలిసారి జిల్లాకు చెందిన నాయకుడికి టీపీసీసీ పగ్గాలు అప్పగించడంతో పాటు అదే సమయంలో సీఎల్పీ నేతగా కూడా జిల్లా నాయకుడే ఉండే అవకాశం కనిపిస్తుండడంతో జిల్లా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.