క్రికెట్ కిట్ కొనివ్వలేదని ...
క్రికెట్ ఆటపై ఉన్న మమకారం ఓ బాలుడిని హంతకుడిని చేసింది. క్రికెట్ కిట్ కొనివ్వలేదని మహిళను హత్య చేసిన బాలుడు (15)ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం మహాలక్ష్మి కాలనీలో మహిళ హత్యకు గురైన విషయం తెల్సిందే. గనులు, భూ విజ్ఞాన శాఖలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న మంజుల (42) హత్యకు గురైంది. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితుడిని రెండు రోజుల్లోనే అదుపులోకి తీసుకున్నారు.
వివరాలు... అవివాహితురాలైన మంజుల కొద్ది రోజుల క్రితమే గౌరిపేట నుంచి మహాలక్ష్మి కాలనీలోని ఓ ఇంటిలో అద్దెకు దిగింది. అద్దె డబ్బుల కోసం సదరు ఇంటి యజమానురాలు ప్రతి నెల తన కుమారుడిని మంజుల వద్దకు పంపించేంది. ఓ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న ఈ బాలుడికి క్రికెట్ ఆటపై ఆసక్తి ఉంది. దీంతో బాలుడు మంజులను అద్దె డబ్బుల కోసం వచ్చినప్పుడల్లా క్రికెట్ కిట్ కోసం డబ్బులు డిమాండ్ చేసేవాడు. ఆదివారం రాత్రి కూడా డబ్బు ఇవ్వాలని బాలుడు మంజులపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు.
ఆమె ససేమిరా అనడంతో తీవ్ర ఆవేశానికి లోనైన బాలుడు కత్తిపీట తీసుకుని గొంతు కోశాడు. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే మంజుల ప్రాణాలు విడిచింది. ఇంత జరిగినా ఏమి తెలియని అమాయకుడిలా, ఎటువంటి భయం కనిపించకుండా ఇంటికి వచ్చేశాడు.
మరుసటి రోజు ఈ హత్య నగరంలో తీవ్ర సంచలనం సృష్టించింది. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు కొన్ని గంటల్లో చేధించారు. సంఘటన స్థలంలో చేతి గుర్తుల ఆధారంగా నిందితుడిని మైనర్ బాలుడిగా తేల్చారు. ఆదివారం మంజుల ఇంటికి ఎవరెవరు వెళ్లారో విచారణ చేసిన పోలీసులు బాలుడిని ట్రేస్ చేశారు. హంతకుడు మైనర్ కావడంతో బుధవారం జిల్లా కోర్టులో హాజరు పరిచిన అనంతరం బాలుడిని ఎక్కడ ఉంచాలనే విషయంపై జడ్జి ఆదేశాల జారీ చేస్తారు.