Kolar district
-
75 Weds 35.. సోషల్ మీడియాలో వైరల్ అయిన తాతయ్య పెళ్లి
సాక్షి, బెంగళూరు: ఆయన వయసు 75 ఏళ్లు.. ఆమె వయసు 35.. ఇద్దరూ సంప్రదాయబద్ధంగా వివాహ బంధంతో ఒక్కటైన ఘటన కర్ణాటకలో చిక్కబళ్లాపురం జిల్లా అప్పేగౌడనహళ్లిలోజరిగింది. వివరాల్లోకి వెళితే... అప్పేగౌడనహళ్లికి చెందిన ఈరన్న అనే మోతుబరి రైతు భార్య గతంలోనే మరణించింది. కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడంతో ఒంటరితనంతో బాధపడుతున్నాడు. అనుశ్రీ అనే మహిళ భర్త నుంచి విడిపోయి వేరుగా జీవిస్తోంది. ఆమెకు పిల్లలు ఉన్నారు. ఈరన్న ఆమెతో పెళ్లి ప్రస్తావన తేగా అంగీకరించింది. దీంతో స్వగ్రామంలో నిరాడంబరంగా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఫొటోషూట్ జరుపుకున్నారు. మనవళ్లతో కాలక్షేపం చేస్తూ కృష్ణా రామా అనుకునే వయస్సులో తాతయ్య రెండో పెళ్లి చేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చదవండి: 4 కళ్ల నల్లని చారల చేప... చూసేందుకు జనం పరుగులు! -
కేజీఎఫ్ 2లో రాఖీభాయ్ తల్లిగా నటించిన అర్చనకు ఘన సన్మానం
సాక్షి, కోలారు (కర్ణాటక): కేజీఎఫ్ సినిమాలో నటించిన కోలారుకు చెందిన నటి అర్చనా జోయిస్ను బుధవారం నగరంలోని సపలమ్మ దేవాలయ సమితి ఘనంగా సన్మానించింది. నగరసభ సభ్యుడు మురళీగౌడ మాట్లాడుతూ అర్చనా జోయిస్ తన నటన ద్వారా జిల్లా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో కార్తీక్, సత్యనారాయణ, నవీన్‌బాబు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న రిలీజైన కేజీఎఫ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాస్తోంది. 6 రోజుల్లో రూ. 645 కోట్లను వసూళ్లు చేసి కలెక్షన్ల సునామీ సృష్టించింది. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో రాఖీభాయ్ యశ్ కథానాయకుడిగా సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటించారు. శ్రీనిధి శెట్టి కథానాయిక. రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. చదవండి: 'కేజీఎఫ్ 2' మేనియా.. పెళ్లి శుభలేఖపై 'వయలెన్స్' డైలాగ్ రాకీభాయ్ ఊచకోత.. ‘కేజీయఫ్ 2’ కలెక్షన్స్ ఎంతంటే.. -
మామిడి తోట రక్షణ కంచెకు చిరుత బలి
కోలారు: ఇనుప కంచెకు చిక్కి చిరుత మరణించిన ఘటన తలగుంద గ్రామంలో చోటు చేసుకుంది. రైతు రామకృష్ణప్ప మామిడి తోటకు రక్షణగా ముళ్ల కంచె వేశాడు. బుధవారం రాత్రి అటుగా వచ్చిన చిరుత కంచెను దాటే ప్రయత్నంలో చిక్కుకుని మృత్యువాత పడింది. గురువారం అటవీశాఖ అధికారులు చేరుకుని పరిశీలించి కళేబరానికి పోస్టుమార్టంఅనంతరం అటవీ ప్రాంతంలో ఖననం చేశారు. -
కరోనాతో అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు కన్నుమూత
మాలూరు: కరోనా భూతం అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు టి.గోపాలప్ప (35)ని బలిగొంది. తాలూకాలోని కప్పూరు గ్రామానికి చెందిన గోపాలప్ప భారత జట్టు తరఫున జాతీయ, ప్రపంచ స్థాయి పోటీలలో పాల్గొన్నాడు. రెండేళ్ల నుంచి గ్రామంలోని యువకులకు కబడ్డీలో శిక్షణ నిస్తున్నాడు. ఆయన వారం రోజుల నుంచి కరోనాతో కోలారు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. -
కర్ణాటక: కోలార్ జిల్లా నర్సాపురాలో తీవ్ర ఉద్రిక్తత
-
నిమజ్జనంలో అపశ్రుతి.. 6గురు చిన్నారుల మృతి
కోలార్ : కర్ణాటక కోలార్ జిల్లాలో వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. క్యేశంబల్లా సమీపంలోని మరదాగట్టు గ్రామంలో వినాయక నిమజ్జనానికి వెళ్లిన ఆరుగురు చిన్నారులు మృతి చెందడం విషాదాన్ని నింపింది. నిమజ్జనం కోసం గణేష్ విగ్రహాన్ని నీటికుంట వద్దకు తీసుకెళ్లిన సమయంలో ముగ్గురు ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ముగ్గురు చిన్నారులు కూడా అందులోకి దిగారు. దీనిని గమనించిన గ్రామస్తులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే ముగ్గురు పిల్లలు ఘటన స్థలంలోనే మరణించగా, మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతులను చిన్నారులు తేజసి, రక్షిత, రోహిత్, వైష్ణవి, ధనుష్, వీణలుగా గుర్తించారు. -
అత్యాచారం కేసులో నలుగురికి ఉరిశిక్ష
► ఏం జరిగింది: 2014లో కోలారు జిల్లా మాలూరు తాలూకాలో స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న టెన్త్ విద్యార్థినిపై నలుగురు మృగాళ్ల సామూహిక అత్యాచారం. 2018 ఆగస్టులో మాలూరు పట్టణంలో పట్టపగలే టెన్త్ బాలికపై మరో కామాంధుడు దాడి, బండరాయితో కొట్టి హత్య ► ఏం తీర్పు: దోషుల దురాగతాలను నిర్ధారించిన న్యాయస్థానాలు.. వారికి ఉరే సరి అని తీర్పునిచ్చాయి. రెండవ కేసులో రికార్డుస్థాయిలో 45 రోజుల్లో విచారణను పూర్తి చేయడం విశేషం. కోలారు: మైనర్ బాలికపై సామూహికంగా అత్యాచారం చేసిన ఘటనలో నలుగురు నిందితులకు ఉరిశిక్షను విధిస్తూ కోలారు రెండవ అదనపు సెషన్స్ న్యాయస్థానం శనివారం సంచలన తీర్పును వెలువరించింది. 2014 వ సంవత్సరం మే నెల 28వ తేదీన మాలూరు తాలూకా నటోరహళ్లి క్రాస్ వద్ద పదవ తరగతి విద్యార్థిని పాఠశాల నుంచి ఒంటరిగా ఇంటికి తిరిగి వస్తుండగా అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులు చుట్టుముట్టారు. బలవంతంగా చెరువులోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘాతుకంతో బాలిక స్పృహ తప్పి పడిపోయింది. బాలిక చనిపోయిందని భావించిన కామాంధులు వెళ్లిపోయారు. విషయం తెలిసిన మాస్తి పోలీసులు బాలికను ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం పోలీసులు గాలించి నిందితులు మునికృష్ణ (23 ఏళ్లు, సెక్యూరిటిగార్డు), నారాయణస్వామి (22, కూలీపని) అనిల్‌కుమార్ (20, బెంగుళూరులో బికాం విద్యార్థి) కృష్ణమూర్తి (20, ట్రాక్టర్ డ్రైవర్)లను అరెస్టు చేశారు. కోర్టులో విచారణలో కామాంధుల దురాగతం రుజువు కావడంతో కోర్టు శనివారం నలుగురు నిందితులకు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. పోలీసులు దోషులను జిల్లా జైలుకు తరలించారు. విద్యార్థిని హత్య కేసులో... కొద్దిరోజుల క్రితం మాలూరు పట్టణంలో సంచలనం కలిగించిన పదవ తరగతి విద్యార్థిని రక్షిత అత్యాచార యత్నం, హత్య కేసులో కోలారు జిల్లా రెండవ అదనపు న్యాయస్థానం దోషికి ఉరిశిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈ ఏడాది ఆగస్టు నెల 1వ తేదీన మాలూరు పట్టణంలో పదవ తరగతి విద్యార్థిని టీకల్ గ్రామానికి చెందిన సురేష్‌కుమార్ అనే యువకుడు వెంబడించి అత్యాచారయత్నం చేసి కుదరక పోవడంతో బండరాయితో తలపై మోది హత్య చేశాడు. ఈ ఘోరం పట్టణంలో కలకలం రేపింది. ప్రజాసంఘాలు భారీఎత్తున ఉద్యమాలు జరిపాయి. నిందితుడు సురేష్‌కుమార్ (23, తాపీ పని)ను మాలూరు పట్టణ పోలీసులు రెండురోజుల తరువాత అరెస్టు చేసి అత్యాచారం యత్నం, హత్య తదితర సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. చకచకా విచారణ జరిపి కోర్టుకు చార్జిషీట్ దాఖలు చేశారు. శరవేగంతో విచారణ జరిగింది. ఛార్టిషీట్ దాఖలు చేసిన 13 రోజులకే కోర్టు అతని నేరాన్ని నిర్ధారించి శనివారం మధ్యాహ్నం న్యాయమూర్తి బి ఎస్ రేఖ తీర్పును వెలువరించారు. రక్షితకు న్యాయం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళలను జరిగాయి. ఘటన జరిగిన 45 రోజులకే నిందితుడికి కోర్టు శిక్ష పడడం విశేషం. -
అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి పదేళ్ల జైలు
సాక్షి, కోలారు : బాలికపై అత్యాచారం జరిపి హత్య చేసిన కేసులో నిందితుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కర్ణాటకలోని కోలారు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి శనివారం తీర్పు చెప్పారు. కోలారు నగరంలోని కేజీ మోహల్లా వాసి వాజిద్‌ఖాన్ 2015 జనవరి 31న అదే ప్రాంతానికే చెందిన ఓ బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేయగా కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో సెషన్స్ న్యాయమూర్తి బి.ఎస్.రేఖ నిందితుడికి పైవిధంగా జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. -
థియేటర్లో దెయ్యం!
బెంగళూరు(కర్ణాటక): విచిత్ర శబ్ధాలు, వింత ఆకారాల సంచారం, దెయ్యం తిరుగుతోందనే వదంతులు అక్కడి వారిని తీవ్ర భయాందోళనలకు గురి చేశాయి. కోలార్ జిల్లా ముళబాగిలు పట్టణంలోని సంగం థియేటర్ కొంతకాలంగా మూతబడి ఉంటోంది. అయితే, గత కొంతకాలంగా ఈ థియేటర్ నుంచి విచిత్రమైన శబ్ధాలు వస్తున్నాయని, దెయ్యం మాదిరి ఆకారాలు ఆ చుట్టుపక్కల సంచరిస్తున్నాయని స్థానికంగా వదంతులు వ్యాపించాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి వందల సంఖ్యలో గ్రామస్తులు ఆ నిర్మాణం వద్ద గుమికూడారు. దెయ్యం ఎలా తిరుగుతోంది..ఎప్పుడు బయటకు వస్తోందంటూ ఆరా తీశారు. విషయం తెలుసుకున్న టౌన్ ఎస్ఐ భైరా అక్కడకు చేరుకొని ప్రజలతో మాట్లాడారు. ఇది కేవలం వదంతి మాత్రమేనని, దెయ్యం సంచారం అనేది వట్టి పచారమేనని ఎవరూ నమ్మవద్దని చెప్పి అందరినీ అక్కడి నుంచి పంపించి వేశారు. -
కలత చెందా !
కోలారు: అంటరానితనం అంటే తెలియని పసి మొగ్గలు వారు... ప్రొద్భలమో, లేక చెప్పుడు మాటలో కాని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న కొందరు విద్యార్థులు దళిత మహిళ వంట చేస్తోందని చెప్పి వారు మధ్యాహ్న భోజనం తినకపోవడంతో తీవ్ర మనస్థాపం చెందిన వంట మనిషి రాధమ్మ ఏకంగా రాష్ట్ర గవర్నర్‌కు ‘దయా మరణం’ (మెర్సి కిల్లింగ్) కోరుతూ లేఖ రాయడం సంచలనం సృష్టించింది. దీంతో ఆగమేఘాలపై అధికార యంత్రాంగం అక్కడికి చేరుకుని పరిస్థితి సరిదిద్దారు. వివరాలు... జిల్లాలోని ముళబాగిలు తాలూకా నంగలి ఫిర్కా కగ్గనహళ్లి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో దళిత మహిళ రాధమ్మ కొంతకాలంగా వంట మనిషిగా పనిచేస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా దళిత మహిళ అనే నెపంతో పాఠశాలలో చదువుతున్న 18 మంది విద్యార్థులు ఆమె వండిన భోజనం చేయడానికి నిరాకరించారు. దాంతో మనస్థాపానికి గురైన దళిత మహిళ రాధమ్మ తనకు దయా మరణం కోరుతూ గవర్నర్‌కు లేఖ రాసింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం సోమవారం హుటాహుటిన కగ్గనహళ్లి గ్రామానికి చేరుకుంది. బెంగుళూరు సీఆర్ఓ సెల్ అదనపు పోలీస్ ఏడీజీపీ భాస్కర్‌రావ్ గ్రామానికి వెళ్లి స్వయంగా పరిశీలన జరిపారు. మధ్యాహ్నం వేళకు గ్రామానికి చేరుకున్న ఏడీజీపీ భాస్కర్ రావ్ తొలుత పాఠశాల సిబ్బంది. గ్రామస్తుల కలిసి సమావేశమై చర్చలు జరిపారు. గ్రామంలో ఇలాంటి అంటరానితనం పద్దతి పోవాలని గ్రామస్తులు, విద్యార్థులకు నచ్చచెప్పారు. అంతే కాకుండా మధ్యాహ్న భోజనాన్ని అధికారులు, విద్యార్థులతో కలిసి వంటమనిషి రాధమ్మ వండిన వంటకాలతో భోజనం చేశారు. అనంతరం మాట్లాడుతూ... చట్టం ముందు ఎవరూ పెద్దవారు కాదనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. పిల్లల లేత హృదయాలలో ఇలాంటి భావాలు రాకుండా ఉపాధ్యాయులు జాగ్రత్త పడాలని సూచించా రు. పాఠశాల అధ్యక్షుడు సురేష్, ప్రధానోపాధ్యాయుడు వెంకటా చలపతితో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసి మరోమారు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరస్పర వైషమ్యాల వల్ల దేనిని సాధించడానికి సాధ్యం కాదన్నారు గతంలోనే వివాదం : గ్రామంలోని పాఠశాలలో గతంలో దళిత మహిళ వంట చేయడానికి నియమించడంపై వివాదం చెలరేగింది. అపట్లో దళితులను బహిష్కరించారనే ఆరోపణలపై గ్రామానికి చెంది కొంతమంది అరెస్టయ్యారు. దళిత మహిళ రాధమ్మ పాఠశాలలో వంట చేయడానికి అర్జీ వేయడానికి కూడా నిరాకరించారనే ఆరోపణలు వినిపించాయి. అప్పటి కలెక్టర్ డీకే రవి స్వయం గా గ్రామానికి వెళ్లి పరిస్థితిని చక్కదిద్ది వచ్చారు. దళిత మహిళ రాధమ్మను వంట మనిషిగా నియమించడానికి అనుమతించారు. పాత కక్షల నేపథ్యంలో మళ్లీ ఇలా జరుగుతోందని గ్రామంలోని పలువరు దళితులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 126 మంది పిల్లలకు 108 మంది పిల్లలు టీసీలు తీసుకుని వేరే పాఠశాలల్లో చేరారు. ప్రస్తుతం 18 మంది పిల్లలు మాత్రమే ఉండి వీరు కూడా రాధమ్మ చేస్తున్న వంటలు తినడం లేదని ఆరోపణ. 18 మంది పిల్లలలో ఓబీసీ వారు 3, ఎస్టీ 1 మిగిలిన వారందరూ ఎస్సీ సముదాయానికి చెందిన వారే కావడం విశేషం. గ్రామాన్ని సందర్శించిన వారిలో కోలారు ఎస్పీ అజయ్హిలోరి, బీఈఓ దేవరాజ్, అధికారులు కణ్ణయ్య, వి లక్ష్మయ్య, ఆర్డీవో మంజునాథ్, డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ తదితరులు ఉన్నారు. -
బస్సును ఢీకొన్న లారీ: ఆరుగురి మృతి
కల్పలమడుగు:మరో రోడ్డు ప్రమాదం ఆరుగురిని పొట్టన పెట్టుకుంది. కోలార్ జిల్లాలోని కల్పలమడుగు వద్ద సోమవారం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం సృష్టించింది. ఒక బస్సును అతి వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మరో 20 మందికి తీవ్ర గాయాలైయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
క్రికెట్ కిట్ కొనివ్వలేదని ...
క్రికెట్ ఆటపై ఉన్న మమకారం ఓ బాలుడిని హంతకుడిని చేసింది. క్రికెట్ కిట్ కొనివ్వలేదని మహిళను హత్య చేసిన బాలుడు (15)ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం మహాలక్ష్మి కాలనీలో మహిళ హత్యకు గురైన విషయం తెల్సిందే. గనులు, భూ విజ్ఞాన శాఖలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న మంజుల (42) హత్యకు గురైంది. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితుడిని రెండు రోజుల్లోనే అదుపులోకి తీసుకున్నారు. వివరాలు... అవివాహితురాలైన మంజుల కొద్ది రోజుల క్రితమే గౌరిపేట నుంచి మహాలక్ష్మి కాలనీలోని ఓ ఇంటిలో అద్దెకు దిగింది. అద్దె డబ్బుల కోసం సదరు ఇంటి యజమానురాలు ప్రతి నెల తన కుమారుడిని మంజుల వద్దకు పంపించేంది. ఓ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న ఈ బాలుడికి క్రికెట్ ఆటపై ఆసక్తి ఉంది. దీంతో బాలుడు మంజులను అద్దె డబ్బుల కోసం వచ్చినప్పుడల్లా క్రికెట్ కిట్ కోసం డబ్బులు డిమాండ్ చేసేవాడు. ఆదివారం రాత్రి కూడా డబ్బు ఇవ్వాలని బాలుడు మంజులపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. ఆమె ససేమిరా అనడంతో తీవ్ర ఆవేశానికి లోనైన బాలుడు కత్తిపీట తీసుకుని గొంతు కోశాడు. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే మంజుల ప్రాణాలు విడిచింది. ఇంత జరిగినా ఏమి తెలియని అమాయకుడిలా, ఎటువంటి భయం కనిపించకుండా ఇంటికి వచ్చేశాడు. మరుసటి రోజు ఈ హత్య నగరంలో తీవ్ర సంచలనం సృష్టించింది. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు కొన్ని గంటల్లో చేధించారు. సంఘటన స్థలంలో చేతి గుర్తుల ఆధారంగా నిందితుడిని మైనర్ బాలుడిగా తేల్చారు. ఆదివారం మంజుల ఇంటికి ఎవరెవరు వెళ్లారో విచారణ చేసిన పోలీసులు బాలుడిని ట్రేస్ చేశారు. హంతకుడు మైనర్ కావడంతో బుధవారం జిల్లా కోర్టులో హాజరు పరిచిన అనంతరం బాలుడిని ఎక్కడ ఉంచాలనే విషయంపై జడ్జి ఆదేశాల జారీ చేస్తారు. -
ఫీజుల పెంపుపై విద్యార్థుల ఆగ్రహం
కోలారు, న్యూస్‌లైన్ : ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలల్లో ఫీజులను 20 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక బస్టాండ్ సర్కిల్లో మానవహారంగా ఏర్పడి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. డబ్బుపై ఆశతో ప్రైవేట్ కళాశాలలతో రాష్ట్ర ప్రభుత్వం కుమ్మకైందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయం గ్రామీణ పేద విద్యార్థుల పాటిల శాపంగా మారనుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ధరల పెరుగుదలతో కుదేలైన గ్రామీణ ప్రాంత ప్రజలు ఇప్పుడు విద్యార్థుల ఫీజుల పెంపు వల్ల తమ పిల్లలకు ఉన్నత విద్యాభ్యాసాన్ని అందించలేని దుస్థితిలో నెట్టివేయబడ్డారని అన్నారు. పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అంబరీష్, మార్కండేయ, అమరేష్, అజగర్, మహేష్ పాల్గొన్నారు. -
కోలార్ జిల్లాలో త్వరలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
కోలారు, న్యూస్‌లైన్ : కేంద్ర, రాష్ట్ర సంయుక్త భాగస్వామ్యంతో జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని జిల్లా ఇంఛార్జి మంత్రి యూటీ ఖాదర్ అన్నారు. గురువారం ఆయన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం ఖాదర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ... కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే దాదాపు ఐదు వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. వైట్ ఫీల్డ్ నుంచి కోలారు మీదుగా ముళబాగిలు వరకు 83 కిమీ రైల్వే లైన్‌ను రూ. 658 కోట్ల వ్యయంతో, అదే విధంగా మారికుప్పం - కుప్పం నూతన రైలు మార్గాన్ని త్వరలో ప్రారంభానికి చర్యలు తీసుకుంటామన్నారు. వేమగల్ సమీపంలో టోల్‌రూం స్థాపన వల్ల నిరుద్యోగ సమస్య కొంత వరకు తీరనుందన్నారు. జిల్లా అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. శాశ్వత నీటి సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. స్వాతంత్య్ర వేడుకల కోసం ఎస్సీ, ఎస్టీ సెల్‌కు నగర సభ కమిషనర్ రూ. 10 లక్షలు ఇచ్చిన విషయాన్ని పాత్రికేయులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మంత్రి, కమిషనర్ మహేంద్రకుమార్‌ను తీవ్రంగా మందలించారు. విలేకరుల సమావేశంలో సీఈఓ జుల్ఫికరుల్లా, డిప్యూటీ కలెక్టర్ వెంకటేషమూర్తి, ఎస్పీ రాంనివాస్ సెపాట్ తదితరులు పాల్గొన్నారు.