► ఏం జరిగింది: 2014లో కోలారు జిల్లా మాలూరు తాలూకాలో స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న టెన్త్ విద్యార్థినిపై నలుగురు మృగాళ్ల సామూహిక అత్యాచారం. 2018 ఆగస్టులో మాలూరు పట్టణంలో పట్టపగలే టెన్త్ బాలికపై మరో కామాంధుడు దాడి, బండరాయితో కొట్టి హత్య
► ఏం తీర్పు: దోషుల దురాగతాలను నిర్ధారించిన న్యాయస్థానాలు.. వారికి ఉరే సరి అని తీర్పునిచ్చాయి. రెండవ కేసులో రికార్డుస్థాయిలో 45 రోజుల్లో విచారణను పూర్తి చేయడం విశేషం.
కోలారు: మైనర్ బాలికపై సామూహికంగా అత్యాచారం చేసిన ఘటనలో నలుగురు నిందితులకు ఉరిశిక్షను విధిస్తూ కోలారు రెండవ అదనపు సెషన్స్ న్యాయస్థానం శనివారం సంచలన తీర్పును వెలువరించింది. 2014 వ సంవత్సరం మే నెల 28వ తేదీన మాలూరు తాలూకా నటోరహళ్లి క్రాస్ వద్ద పదవ తరగతి విద్యార్థిని పాఠశాల నుంచి ఒంటరిగా ఇంటికి తిరిగి వస్తుండగా అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులు చుట్టుముట్టారు. బలవంతంగా చెరువులోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.
ఈ ఘాతుకంతో బాలిక స్పృహ తప్పి పడిపోయింది. బాలిక చనిపోయిందని భావించిన కామాంధులు వెళ్లిపోయారు. విషయం తెలిసిన మాస్తి పోలీసులు బాలికను ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం పోలీసులు గాలించి నిందితులు మునికృష్ణ (23 ఏళ్లు, సెక్యూరిటిగార్డు), నారాయణస్వామి (22, కూలీపని) అనిల్‌కుమార్ (20, బెంగుళూరులో బికాం విద్యార్థి) కృష్ణమూర్తి (20, ట్రాక్టర్ డ్రైవర్)లను అరెస్టు చేశారు. కోర్టులో విచారణలో కామాంధుల దురాగతం రుజువు కావడంతో కోర్టు శనివారం నలుగురు నిందితులకు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. పోలీసులు దోషులను జిల్లా జైలుకు తరలించారు.
విద్యార్థిని హత్య కేసులో...
కొద్దిరోజుల క్రితం మాలూరు పట్టణంలో సంచలనం కలిగించిన పదవ తరగతి విద్యార్థిని రక్షిత అత్యాచార యత్నం, హత్య కేసులో కోలారు జిల్లా రెండవ అదనపు న్యాయస్థానం దోషికి ఉరిశిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈ ఏడాది ఆగస్టు నెల 1వ తేదీన మాలూరు పట్టణంలో పదవ తరగతి విద్యార్థిని టీకల్ గ్రామానికి చెందిన సురేష్‌కుమార్ అనే యువకుడు వెంబడించి అత్యాచారయత్నం చేసి కుదరక పోవడంతో బండరాయితో తలపై మోది హత్య చేశాడు. ఈ ఘోరం పట్టణంలో కలకలం రేపింది.
ప్రజాసంఘాలు భారీఎత్తున ఉద్యమాలు జరిపాయి. నిందితుడు సురేష్‌కుమార్ (23, తాపీ పని)ను మాలూరు పట్టణ పోలీసులు రెండురోజుల తరువాత అరెస్టు చేసి అత్యాచారం యత్నం, హత్య తదితర సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. చకచకా విచారణ జరిపి కోర్టుకు చార్జిషీట్ దాఖలు చేశారు. శరవేగంతో విచారణ జరిగింది. ఛార్టిషీట్ దాఖలు చేసిన 13 రోజులకే కోర్టు అతని నేరాన్ని నిర్ధారించి శనివారం మధ్యాహ్నం న్యాయమూర్తి బి ఎస్ రేఖ తీర్పును వెలువరించారు. రక్షితకు న్యాయం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళలను జరిగాయి. ఘటన జరిగిన 45 రోజులకే నిందితుడికి కోర్టు శిక్ష పడడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment