సాక్షి, ముంబై: నవీముంబైలోని వాషీలోగల ‘తెలుగు కళా సమితి’లో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. ముంబైలో తెలుగు సంస్థల మాతృసంస్థగా గుర్తింపు పొందిన ‘ది బొంబాయి ఆంధ్రమహాసభ’ తర్వాత అతిపెద్ద సంస్థగా తెలుగు కళా సమితి అవతరించింది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఈ ఎన్నికలపైనే కేంద్రీకృతమైంది. నవీముంబైలో ఉన్నప్పటికీ ఈ సంస్థ సభ్యులు ముంబైతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటున్నారు. దీంతో ఆదివారం జరగనున్న ఎన్నిక ల్లో ఎవరు గెలుపొందనున్నారనే విషయమై ఉత్కంఠ కనిపిస్తోంది.
ముఖాముఖి పోటీ...: తెలుగు కళా సమితి ఎన్నికల్లో రెండు ప్యానళ్ల మధ్య పోటీ జరుగుతోంది. బి. నారాయణ రెడ్డి, ఎం కొండారెడ్డి ప్యానల్, జి బి రామలింగయ్య, జి ప్రవీణ్ ప్యానల్‌లు ఈ ఎన్నికల బరిలో ఉన్నాయి. ఈ ప్యానళ్ల మధ్య పోటీ జరుగుతోంది. అయితే ఎవరిని విజయం వరించనుందనేది వేచిచూడాల్సిందే. అయితే ఎన్నికల నేపథ్యంలో తెలుగు కళాసమితికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.
1977లో ఆవిర్భావం
తెలుగు ప్రజల సమైక్యత, సంక్షేమంతోపాటు సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకుగా 1977లో తెలుగు కళా సమితిని స్ధాపించారు. కొందరు తెలుగు పెద్దలు కలసి తమకంటూ ఒక సంస్థ ఉండాలని, ముంబైలాంటి ప్రాంతంలో తమ భాషను, సాహిత్యాన్ని, కళాసంస్కృతులను పరిర క్షించుకోవాలనే లక్ష్యంతో స్ధాపించిన ఈ సంస్థ స్వల్పకాలంలోనే అందరి మనన్నలు అందుకుంది. దీంతో తమకంటూ ఓ భవనం ఉండాలని తెలుగు పెద్దలు భావించారు. సిడ్కో సంస్థసహకారంతో 1,000 చదరపు అడుగుల స్థలాన్ని నవీముంబై వాషీలోని ప్రధాన ప్రాంతంలో సంపాదించగలిగారు. తెలుగువారంతా సమావేశమయ్యేందుకు అక్కడ చిన్న భవనాన్ని నిర్మించుకున్నారు. కొంత కాలంగా నవీముంబైతోపాటు వాషీ ప్రాంతం అత్యంతవేగంగా అభివృద్ధి చెందింది.
అదే విధంగా తెలుగు కళా సమితి నిర్వహించిన అనేక కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇలా తెలుగువారి అభివృద్ధితోపాటు తమకంటూ ఓ గుర్తింపును తీసుకవచ్చేందుకు కృషి చేస్తున్న తెలుగు కళా సమితిలో సభ్యులుగా చేరేందుకు అనేక మంది ముందుకు రావడం ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ తెలుగు కళా సమితిలో 2100 మంది సభ్యులున్నారు. అయితే ఇప్పటికీ పాత కట్టడమే ఉండడంతో సభ్యులు సమావేశాలకు, ఇతర అవసరాలకు సరిపడకుండాపోయింది. దీంతో నూతన భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు.
ప్రధాన అంశంగా మారిన నూతన భవన నిర్మాణం...!
తెలుగు కళా సమితి ఎన్నికల్లో ఈ సారి నూతన భవన నిర్మాణం అంశం ప్రధాన అంశంగా మారింది. ప్రస్తుత కార్యవర్గం అవసరాలకు పాత నిర్మాణం సరిపోకపోవడంతో ఆ స్థానంలో నూతన భవన నిర్మాణాం చేపట్టాలని 2012లో నిర్ణయించారు. ఈ నిర్మాణానికి రూ. 2.5 కోట్ల మేర ఖర్చు అవుతుందని, అదే విధంగా కమెన్స్‌మెంట్ సర్టిఫికెట్ కోసం కూడా సుమారు రూ. 15 లక్షల ఫీజు చెల్లించాల్సిరానుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భవన నమూనాను తయారు చేసిన అనంతరం నిర్మాణానికి కావల్సిన నిధులను సమకూర్చుకునే విషయంలో సర్వసభ్య సమావేశంలో భిన్నభిప్రాయాలు ఏర్పడ్డాయి.
అయితే అదే సర్వసభ్య సమావేశంలో నూతన భవన నిర్మాణంపై ఏకాభిప్రాయం ఏర్పడింది. దీంతో అత్యాధునిక హంగులతో అందరికి అందుబాటులో ఉండేవిధంగారెండంతస్తుల భవనాన్ని నిర్మించాలని పాత కార్యవర్గ కమిటీ సంకల్పించింది. అయితే ఇది ప్రత్యక్షంగా అమల్లోకి తెచ్చేందుకు కొద్దిపాటి మార్పులతో అన్ని అనుమతులకోసం దరఖాస్తులు కూడా చేసింది. దాదాపు అన్ని అనుమతులు లభించినప్పటికీ కాని కొన్ని సాంకేతిక కారణాల వల్ల అనుమతులు లభించడంలో జాప్యమైంది. అయినప్పటికీ భవననిర్మాణం విషయంపై ధృఢసంకల్పంతో ఉన్నట్టు ప్రస్తుత కార్యవర్గం చెబుతోంది. దీంతో ఈ సారి ఎన్నికల్లో ఇదే అంశం ప్రధాన అంశంగా మారింది.
23న తెలుగు కళాసమితి ఎన్నికలు
Published Fri, Feb 21 2014 11:13 PM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM
Advertisement
Advertisement