సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై అందరిలోనూ టెన్షన్ నెలకొంది.
అనంతపురం కలెక్టరేట్,న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై అందరిలోనూ టెన్షన్ నెలకొంది. ఎక్కడ నలుగురు కలిసినా ప్రస్తుతం రాజకీయాలపైనే చర్చ సాగుతోంది. 16వ తేదీ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ కౌంటింగ్ రోజు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. శుక్రవారం 238 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. జిల్లాలో రెండు పార్లమెంట్, 14 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 7న ఎన్నికలు నిర్వహించారు.
పార్లమెంట్ స్థానాలకు 25 మంది అభ్యర్థులు, అసెంబ్లీ నియోజకవర్గాలకు 213 మంది బరిలో నిలిచారు. 7న పోలింగ్ ముగిసింది. ఫలితాల ప్రకటనకు 9 రోజుల పాటు గ్యాప్ రావడంతో ఆందోళన నెలకొంది. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు సోమ, మంగళవారాల్లో పూర్తయ్యాయి. ఈ ఫలితాలను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. సార్వత్రిక ఫలితాలవైపే ఆసక్తిగా గమనిస్తున్నారు.
బెట్టింగ్ రాయుళ్లలోనూ అదే టెన్షన్ అభ్యర్థులతో పాటు బెట్టింగ్ రాయుళ్లకూ ఫలితాలపై టెన్షన్ పట్టుకుంది. ప్రాదేశిక ఎన్నికల ఫలితాల కంటే సార్వత్రిక ఫలితాలపైనే అధిక మొత్తంలో బెట్టింగ్‌లు వేసుకున్నారు.
కొంత మంది బెట్టింగ్ రాయుళ్లు అభ్యర్థుల మెజార్టీపై బెట్టింగ్ వేసుకోగా.. మరికొంత మంది గెలుపు, ఓటములపై పందెం కాశారు. ఆయా నియోజకవర్గాల్లో లక్ష పైబడి ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతపురం, హిందూపురం పార్లమెంట్ స్థానాల్లో ఒక్కో పార్లమెంట్ పరిధిలో 75 శాతం దాదాపు 14లక్షల మంది ఓటర్లలో 9లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఎమ్మెల్యే, ఎంపీ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడం వ లన మున్సిపల్ ఎన్నికల తరహాలోనే అసెంబ్లీ ఫలితాలు మధ్యాహ్నంలోగానే వెల్లడికానున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. పార్లమెంట్ ఫలితాలు ఆలస్యమైనా అసెంబ్లీ అభ్యర్థుల ఫలితాలు తేలిపోనున్నాయి.