
ఫలితాలపై జోరుగా బెట్టింగ్
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో రోజులో తేలనున్న నేపథ్యంలో.. దేశవ్యాప్తంగానే కాదు.. పాకిస్థాన్, దుబాయ్‌లాంటి దేశాల్లోనూ బెట్టింగ్‌లు జోరందుకున్నాయి.
రూ. 12 వేల కోట్ల బిజినెస్
ముంబై: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో రోజులో తేలనున్న నేపథ్యంలో.. దేశవ్యాప్తంగానే కాదు.. పాకిస్థాన్, దుబాయ్‌లాంటి దేశాల్లోనూ బెట్టింగ్‌లు జోరందుకున్నాయి. దేశంలో ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్ తదితర నగరాల్లో భారీఎత్తున బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ఫలితాల అనంతరం రూ. 12 వేల కోట్ల మేర చేతులు మారే పరిస్థితి ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భావి ప్రధానిగా బెట్టింగ్‌రాయుళ్లు నమ్ముతున్న వారిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీనే ప్రథమస్థానంలో ఉన్నారు. ఆయనపై పెడుతున్న బెట్టింగ్ రేటు రూపాయికి 2 పైసలు మాత్రమే కాగా.. ఆయన రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై అది రూ. 35గా ఉంది.
ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ కూడా బెట్టింగ్ వర్గాల్లో పాపులరే. ఆమెపై ఉన్న బెట్టింగ్ రేటు ఒక రూపాయినే కావడం విశేషం. ఆమ్ ఆద్మీపార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌పై అది రూ. 60గా ఉంది. జాతీయ స్థాయిలో పేరున్న ములాయంసింగ్ యాదవ్, మమతా బెనర్జీ, మాయావతిలపై బెట్టింగ్ వ్యత్యాసం రూ. 45 - 55ల మధ్య ఉంది. ఎగ్జిట్ పోల్స్‌లో కూడా ఎన్డీయేనే అత్యధిక స్థానాలు గెలుచుకోనున్నదని తేలడంతో.. అది గెలుచుకునే స్థానాల సంఖ్యపై కూడా బెట్టింగ్ భారీగా జరుగుతోంది. 220 స్థానాలు గెలుచుకుంటే 30 పైసలుగా, 230 స్థానాలు గెలుచుకుంటే 40 పైసలుగా, అధికారం చేపట్టగలిగే మేజిక్ ఫిగర్ 272 స్థానాలపై రూ. 1గా బెట్టింగ్ రేటు నడుస్తోంది.