నారి.. ప్రచారభేరి! | thamil nadu elections Campaign | Sakshi
Sakshi News home page

నారి.. ప్రచారభేరి!

Published Mon, Apr 25 2016 4:41 AM | Last Updated on Wed, Apr 3 2019 9:12 PM

నారి.. ప్రచారభేరి! - Sakshi

నారి.. ప్రచారభేరి!

 సాక్షి, చెన్నై : ఎన్నికల సమరం రసవత్తరంగా  మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇంటింటా అభ్యర్థులు పరుగులు తీశారు. డీఎంకే అధినేత కరుణానిధి, దళపతి స్టాలిన్, ఎంపీ కనిమొళి తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో దూసుకెళ్లారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా నటి కుష్బు ప్రచారానికి సిద్ధం అయ్యారు. స్టాలిన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో ఉంటే, ఆయనకు మద్దతుగా సతీమణి దుర్గా స్టాలిన్ కొళత్తూరులో పర్యటించేందుకు నిర్ణయించారు.

అన్ని పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించేయడంతో గెలుపు లక్ష్యంగా ఆయా నియోజకవర్గాల్లో ప్రచార వేగం పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో ప్రజలు ఎక్కువ శాతం మంది ఇళ్లల్లోనే ఉంటారన్న విషయాన్ని పరిగణించిన రాజకీయ పక్షాల అభ్యర్థులు ఎండ వేడిని సైతం లెక్క చేయకుండా ఓట్ల వేటలో మునిగారు. వీధివీధిన పాదయాత్రగా పయనిస్తూ ఇంటింటా చేతులు జోడించి నమస్కరిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రచారం హోరెత్తడంతో ఎన్నికల సమరం రసవత్తర వాతావరణంలోకి చేరింది. డీఎంకే అధినేత ఎం కరుణానిధి నాలుగు గం టల నుంచి నిర్విరామంగా ప్రచారంలో దూసుకెళ్లారు.


 కడలూరులో ప్రచార సభలో ఓట ర్లను ఆకర్షించే ప్రసంగం సాగించినానంతరం చిదంబరం, శీర్గాలిల్లో సాగిన ప్రచార సభల్లో ప్రజల్ని ప్రసన్నం చేసుకుని మద్దతు కోరారు. డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ మూడున్నర గంటలకు కన్యాకుమారి జిల్లా విలవన్ కోడులో కాంగ్రెస్ అభ్యర్థి విజయధరణికి మద్దతుగా ప్రచారం చేపట్టి, నిర్విరామంగా రోడ్ షో రూపంలో దూసుకెళ్లారు. కిళ్లియూరు, పద్మనాభపురం, కన్యాకుమారి, నాగుర్ కోయిల్, రాధాపురం వరకు రోడ్ షో సాగించడమే కాకుండా, ఆయా నియోజకవర్గాల పరిధిలోని ప్రధాన కూడళ్లల్లో అరగంట పాటు ప్రసంగంతో ఓటర్లను కాంగ్రెస్ , డీఎంకే అభ్యర్థులకు అండగా నిలవాలని విన్నవించారు.

డీఎంకే ఎంపీ కనిమొళి తిరుప్పోరులో ప్రచారానికి శ్రీకారం చుట్టి రోడ్ షో రూపంలో చెంగల్పట్టు, ముధురాంతకం, సెయ్యారుల్లో పర్యటించి ఓటర్లను ఆకర్షించే యత్నం చేశారు. ఎండీఎంకే నేత వైగో తాను పోటీ చేస్తున్న కోవిల్ పట్టి ఓటర్ల ముందుకు వచ్చారు. తనను ఆదరించాలని విన్నవిస్తూ, విలాత్తికుళం, ఎట్టయాపురం, అరుప్పుకోైటె  వరకు రోడ్ షో సాగించారు. పీఎంకే అధినేత రాందాసు తమ అభ్యర్థులకు మద్దతుగా వందవాసి, సెయ్యారుల్లో జరిగిన సభల్లో ఓట్ల వేట సాగించారు. కోయంబత్తూరు నగరంలో తమ అభ్యర్థులను ఆదరించాలని, తన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు అండగా నిలవాలని ఓటర్లను వేడుకుంటూ పీఎంకే సీఎం అభ్యర్థి అనుమణి ప్రచారంలో పరుగులు తీశారు. వేడచందూరులో జరిగిన ప్రచార సభలో డీఎండీకే అధినేత విజయకాంత్ ప్రజా సంక్షేమ కూటమి అభ్యర్థులకు మద్దతుగా తన దైన శైలిలో ప్రసంగంతో ముందుకు సాగారు. ఆ కూటమిలోని తమిళ మానిల కాంగ్రెస్ నేత వాసన్ తెన్‌కాశి, కడయనల్లూరు, శంకరన్ కోవిల్‌లలో రోడ్ షో సాగించగా, వీసీకే నేత తిరుమావళవన్ కాట్టుమాన్నార్ కుడిలో ఇంటింటా తిరుగుతూ మద్దతు సేకరించారు. అన్నాడీఎంకే అభ్యర్థులకు మద్దతుగా సినీ నటుడు, ఎస్‌ఎంకే నేత శరత్‌కుమార్ దిండుగల్, ఆత్తూరు, ఒట్టన్ చత్రంలలో రోడ్‌షోతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.


 చెన్నైలో: చెన్నై జిల్లాలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు తాంబరం, మధురవాయిల్, ఆవడి, అంబత్తూరు నియోజకవర్గాల ఆయా పార్టీల అభ్యర్థుల ఇంటింటా తిరుగుతూ మద్దతు కూడగట్టుకునే పనిలో పడ్డారు. సైదాపేటలో అన్నాడీఎంకే అభ్యర్థి పొన్నయ్యన్ పాదయాత్ర సాగించారు. హార్బర్ అన్నాడీఎంకే అభ్యర్థి శ్రీనివాసన్ రోడ్డు మీద కన్పించిన వృద్ధుల కాళ్ల మీద పడి మరీ ఓట్ల వేట సాగించారు. మైలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి కరాటే త్యాగరాజన్ ఇంటింటా తిరుగుతూ ఒక్క చాన్స్ అని వేడుకునే పనిలో పడ్డారు. మంత్రి వలర్మతి, గోకుల ఇందిర  తమ తమ ప్రాంతాల్లో నడక పయనంతో ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు.

ఇక, డీఎంకే, కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో దూసుకెళ్లేందుకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్భు సిద్ధమయ్యారు. సోమవారం రాయపురం ఎన్నికల రేసులో ఉన్న రాయపురం మనోకు మద్దతుగా ఇంటింటా ఓట్ల సేకరణ సాగించడంతో పాటుగా ఎనిమిది చోట్ల ప్రసంగించబోతున్నారు. ఇక, రాష్ట్ర వ్యాప్త పర్యటనలో డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ నిమగ్నమైన విషయం తెలిసిందే. దీంతో ఆయన పోటీచేస్తున్న కొళత్తూరులో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సతీమణి దుర్గా స్టాలిన్ సిద్ధమయ్యారు. ఇంటింటా తిరుగుతూ మద్దతు కోరనున్నారు. స్టాలిన్ తనయుడు, సినీ నటుడు ఉదయనిధి ఒకటి రెండు రోజుల్లో కొళత్తూరులో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. ఇక, కరుణానిధి రాష్ర్ట పర్యటనలో ఉండడంతో ఆయనకు మద్దతుగా తిరువారూర్‌లో ఓట్ల వేటకు తనయుడు ముక్కా తమిళరసు నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement