ఘాటికి తరలివస్తున్న వేలాది ఎద్దులు
పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న వైనం
దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధ జాతర
దొడ్డబళ్లాపురం : దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీసుబ్రమణ్య ఘాటి పుణ్యక్షేత్రంలో ఎద్దుల పరస శనివారం ప్రారంభమైంది. స్వామి బ్యహ్మ రథోత్సవాలకు 15-20 రోజుల ముందు జరిగే ఎద్దుల పరస ఎంతో ప్రసిద్ధి చెందింది. ఘాటి పుణ్యక్షేత్రంలో గత నాలుగు రోజుల నుంచి రాష్ట్రం నలు మూలల నుండే కాక, పక్క రాష్ట్రాల నుంచి కూడా రైతులు ఎద్దులతో తరలి వస్తున్నారు. వ్యాపారులు కూడా అంతకు రెట్టింపు సంఖ్యలో వస్తున్నారు. ప్రతి ఏటా జరిగే విధంగానే భారీ పెండాళ్లు, సెట్టింగులు వేసి బ్యాండు మేళాలతో ఎద్దులను అలంకరించి ఊరేగింపుగా తీసుకువస్తున్నారు. బంధువులను ఆహ్వానించి భోజనాలు వేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. స్థానిక పంచాయతీ నుంచి ఆనవాయితీగా రైతులకు నీరు, విద్యుత్ లాంటి సౌకర్యాలు కల్పించారు. ఈ ఎద్దుల జాతను సుమారు 600 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నట్లు చరిత్ర చెబుతోంది. ప్రతి సంవత్సరానికీ ఎద్దుల పరసలో వ్యాపారం జోరందుకుంటోంది .ఎద్దుల పరసలో సుమారు రూ 10 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా.
అనేక మంది రైతులు తమ తాత ముత్తాతల నుంచి ఆచరిస్తూవస్తున్న సంప్రదాయంగా భావించి సంవత్సరమంతా ఎద్దులను అల్లారుముద్దుగా పోషించి పరసలో ప్రదర్శనకు ఉంచుతారు. ఇందులో మరో విశేషం ఏమిటంటే ఈ పరసలో కనిపించేవి అన్నీ భారతీయ జాతి ఎద్దులే. బ్రహ్మోత్సవాలకు చేరినట్టు గానే భక్తులు స్వామి కార్యం, స్వకార్యం అన్న చందాన దేవాలయాన్ని దర్శించి ఎద్దుల పరసను వీక్షించి వెళ్తుంటారు. ఘాటిలో ఇంకా ఎద్దులపరస వారం పది రోజుల పాటు జరుగుతుంది. జత ఎద్దులు ఇక్కడ లక్ష పైగా ధర పలుకుతా యంటే నమ్మక తప్పదు. పరస జరిగినన్ని రోజులూ ఇక్కడ తాత్కాలిక హోటళ్లు, దుకాణాలు రైతులకు ఎంటర్ టైన్‌మెంట్ కోసం నాటక ప్రదర్శనలు అన్నీ ఉంటాయి.
ఎద్దుల జాతర ప్రారంభం
Published Sun, Dec 7 2014 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM
Advertisement