
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, భార్య సైరా బాను విడిపోయిన తర్వాత సోషల్‌మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రెహమాన్‌ను తప్పుపడుతూ తమిళ మీడియా, యూట్యూబ్ ఛానెల్స్ వారు పలు కథనాలు ప్రసారం చేయడంతో తాజాగా సైరా బాను రియాక్ట్ అయ్యారు.
'రెహమాన్ చాలా మంచి వ్యక్తి. ఆయన గురించి తెలియకుండా తప్పుగా ప్రచారం చేయడం బాధగా ఉంది. పలు అనారోగ్య కారణాలతో నేను ఇప్పుడు ముంబైలో ఉన్నాను. కొన్ని నెలలుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాను. ఈ కారణం వల్లే ఆయనకు దూరంగా ఉండాలని నేనే కోరుకున్నా. పూర్తి విషయాలు తెలుసుకోకుండా కొందరు దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. మీడియాతో పాటు యూట్యూబ్ వారికి నా విన్నపం. దయచేసి ఆయన గురించి చెడుగా ప్రచారం చేయకండి.

ప్రపంచంలో ఆయనకు ఉన్న మంచి గుర్తింపును చెడగొట్టకండి. ఇప్పటికీ ఆయనంటే నాకు చాలా ఇష్టం. నాపై కూడా ఆయనకు ఎనలేని ప్రేమ ఉంది. ఇకనైనా తప్పుడు కథనాలకు ఫుల్‌స్టాప్ పెడుతారని అనుకుంటున్నాను. మేమిద్దరం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇలాంటి ఇబ్బందికరమైన సమయంలో మా గోప్యతను కాపాడండి. కొద్దిరోజుల్లో నేను చెన్నై వస్తాను.' అని ఆమె తెలిపారు.