
ఎయిర్‌పోర్టులో స్థానికులకు ఉద్యోగాలు
= జీవీకేకు సీఎం సిద్ధరామయ్య సూచన
= విమానాశ్రయం ఏర్పాటుకు 4,300 ఎకరాలిచ్చిన రైతులకు కృతజ్ఞతలు
= బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి ‘కెంపేగౌడ’గా నామకరణం
సాక్షి, బెంగళూరు : ఇక్కడి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్థానికులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విమానాశ్రయం నిర్వాహక సంస్థ జీవీకేకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచించారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
విమానాశ్రయం నిర్మాణానికి దాదాపు 4,300 ఎకరాలను ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. విమానాశ్రయం ఎదురుగా బెంగళూరు నగర నిర్మాత కెంపేగౌడ విగ్రహాన్ని ప్రతిష్టించాల్సిందిగా సూచించారు. విమానయాన సర్వీసులపై ప్రస్తుతం ప్రభుత్వం విధిస్తున్న 25 శాతం విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను తగ్గించే విషయం పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసినందున పలువురు పెట్టుబడిదారులు రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించడానికి ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో అపారంగా ఉన్న నైపుణ్య మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలని వివిధ దేశాల ప్రతినిధులకు ఆయన సూచించారు. అంతకు ముందు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ మాట్లాడుతూ... విస్తరించిన వివ ూనాశ్రయం వల్ల బెంగళూరు ఆర్థిక రాజధానిగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగా నిర్మించిన టెర్మినల్‌ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ ప్రారంభించారు.