సాక్షి, బళ్లారి : రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో ఎయిర్ పోర్టు నిర్మాణాలు చేపడతామని రాష్ట్ర సమాచార ప్రసార, మౌళిక సదుపాయాల శాఖ మంత్రి రోషన్ బేగ్ తెలిపారు. ఆయన ఆదివారం నగరంలోని ముస్లీం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా నగరంలోని బాలా రెసిడెన్సీలో విలేకరులతో మాట్లాడారు. గుల్బర్గా, బీదర్‌లో ఇప్పటికే ఎయిర్‌పోర్ట్ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైందని గుర్తు చేశారు. బీదర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై జీఎంఆర్ సంస్థతో చర్చలు సాగిస్తున్నట్లు తెలిపారు.
ఎయిర్ పోర్టు నిర్మాణాల కోసం బళ్లారితో సహా ఎక్కడా రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోబోమన్నారు. రైతులు ఇష్టపూర్వకంగా భూములు ఇస్తేనే ఎయిర్‌పోర్టుల నిర్మాణం చేపడతామన్నారు. మారుతున్న కాలానుగుణంగా పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నప్పుడు ఎయిర్ పోర్టులు అవసరం ఉన్న చోట తప్పకుండా ఏర్పాటు చేస్తామన్నారు. గుల్బర్గాలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి సమస్య ఏర్పడటంతో కేంద్ర మంత్రి మల్లికార్జున ఖర్గే ప్రత్యేక చొరవ తీసుకుని ముందుకు తీసుకెళుతున్నారని గుర్తు చేశారు.
హాసన్, శివమొగ్గలలో ఎయిర్‌పోర్టు నిర్మాణాలకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయిందన్నారు. ఇందుకు సంబంధించి కంపెనీలతో చర్చించి ఎయిర్‌పోర్టు నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామన్నారు. బళ్లారి జిల్లాలో ఎయిర్‌పోర్టు నిర్మాణంపై కొందరు కోర్టుకు వెళ్లారని, తాము బలవంతంగా భూములు తీసుకోబోమన్నారు. గతంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిని ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కాకుండా మరేదానికో ఉపయోగిస్తున్నారనే విషయం తనకు తెలియదన్నారు.
అలాంటి ఉద్దేశం ప్రభుత్వానికి కూడా లేదన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేయబోనని చెప్పారు. మంత్రిగానే కొనసాగుతానని, ఎంపీగా పోటీ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో హుమయూన్‌ఖాన్, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖ నగరాల్లో ఎయిర్‌పోర్టులు నిర్మిస్తాం
Published Mon, Feb 24 2014 2:52 AM | Last Updated on Fri, Oct 19 2018 6:51 PM
Advertisement
Advertisement