Roshan Baig
-
కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ అరెస్ట్
బెంగళూరు : కర్ణాటకలో రాజకీయ సంక్షోభంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ నుంచి సస్పెండయిన ఎమ్మెల్యే రోషన్ బేగ్‌ను ఐఎమ్ఏ అవినీతి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్ ) అదుపులోకి తీసుకుంది. ముంబయి వెళ్లడానికి సిద్ధమైన రోషన్ బేగ్‌ను సిట్ అధికారులు బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి ట్విటర్ ద్వారా వెల్లడించారు. అవినీతి కేసులో ఉన్న ఓ వ్యక్తిని బీజేపీ కాపాడేందుకు ప్రయత్నిస్తోందని కుమారస్వామి ఆరోపించారు. దీన్ని సిగ్గుమాలిన చర్యగా కుమార స్వామి వర్ణించారు. సంకీర్ణ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనడానికి ఇదే నిదర్శనమన్నారు. గురువారం జరగబోయే బలపరీక్షలో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని కుమార స్వామి ఆరోపించారు.ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే యోగేశ్వర్ సైతం సంఘటనా స్థలంలో ఉండడం అనుమానాలు రేకెత్తిస్తోందన్నారు కుమారస్వామి. Today SIT probing the #IMA case detained @rroshanbaig for questioning at the BIAL airport while he was trying leave along with @BSYBJP's PA Santosh on a chartered flight to Mumbai. I was told that on seeing the SIT, Santhosh ran away while the team apprehended Mr. Baig. 1/2 pic.twitter.com/MmyH4CyVfP — H D Kumaraswamy (@hd_kumaraswamy) July 15, 2019 దీనిపై సిట్ అధికారులు స్పందిస్తూ.. ఐఎమ్ఏ కేసులో విచారణ నిమిత్తం ఈ నెల 19న హాజరు కావాల్సి ఉంటుందని బేగ్‌కు నోటీసులు జారీ చేశాం. కానీ ఈ లోపు ఆయన రాష్ట్రం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో ఆయనను అదుపులోకి తీసకోవాల్సి వచ్చింది. బేగ్‌ను అరెస్ట్ చేయాలా వద్దా అనే అంశాన్ని విచారణ పూర్తయిన తర్వాత నిర్ణయిస్తాం అన్నారు. -
‘అందుకే నన్ను సస్పెండ్ చేశారు’
బెంగళూరు : నిజాలు మాట్లాడినందుకే తనపై వేటు వేశారంటూ కాంగ్రెస్‌పార్టీ బహిష్కృత నేత రోషన్ బేగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర నాయకత్వం కారణంగానే తనకు ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ అధిష్టానం మైనార్టీ నేత అయిన రోషన్ బేగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘ రాష్ట్రస్థాయి నాయకులే నన్ను టార్గెట్ చేశారు. నిజం మాట్లాడటమే నేను చేసిన నేరమా.. కాదు కదా. కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయుడినైన సైనికుడిని నేను. ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సిద్ధు కాంగ్రెస్ కాదు’ అంటూ రోషన్ బేగ్..మాజీ సీఎం సిద్ధరామయ్యపై విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో వైఫల్యానికి స్థానిక నాయకులు ఎందుకు బాధ్యత వహించరని ఆయన ప్రశ్నించారు. నాపై చర్యలు తీసుకుంటున్నారు సరే.. సొంతపార్టీ అభ్యర్థిని, దళిత నాయకుడి ఓటమికి కారణమైన మునియప్పపై చర్యలేవీ అని ప్రశ్నించారు. ఈ విషయాలన్నింటినీ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని పేర్కొన్నారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవం అనంతరం కర్ణాటక కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) బుధవారం తన కర్ణాటక రాష్ట్ర విభాగాన్ని రద్దు చేసింది. అయితే, కేపీసీసీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిండెంట్లను మాత్రం కొనసాగిస్తున్నామని, వారి విషయంలో మార్పు ఉండబోదని ఏఐసీసీ స్పష్టం చేసింది. కర్ణాకటలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం తీవ్ర లుకలుకలు ఎదుర్కొంటున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కేపీసీసీ ధోరణితో విసుగు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారని, కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కమలం పార్టీ ప్రయత్నిస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఏకంగా కేపీసీసీని రద్దు చేయడం గమనార్హం. -
కాంగ్రెస్ సీనియర్ నాయకుడిపై సస్పెన్షన్ వేటు
బెంగళూరు : పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు గాను సీనియర్ నాయకుడు రోషన్ బేగ్‌ను సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) నాయకులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ.. ‘రోషన్ బేగ్ మీద చర్యలు తీసుకోవాలంటూ కేపీసీసీ పంపిన నిర్ణయాన్ని ఏఐసీసీ ఆమోదించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన రోషన్ బేగ్.. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఫలితంగా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు’ ఆయన వెల్లడించారు. గత కొన్ని రోజులుగా రోషన్ బేగ్ మీద ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కర్ణాకటలో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలుపొందడంతో రోనేష్ బేగ్ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షు డు దినేశ్ గుండూరావు అసమర్థుడని, మాజీ సీఎం సిద్దరామయ్య అహంకారి అని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ జోకర్ అని రోషన్ బేగ్ తిట్టిపోశారు. ఇదే కాక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐఎంఏ జ్యువెల్స్ స్కామ్‌లో రోషన్ బేగ్ భాగస్వామి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధిష్టానం నిర్ణయం తీసుకుంది. -
‘రూ.400 కోట్లు లంచమిచ్చా..ఆత్మహత్యే దిక్కు’
రెక్కలు ముక్కలు చేసుకుని కూడబెట్టిన డబ్బును ఐఎంఏలో డిపాజిట్ చేశాం, మా డబ్బులు మాకు ఇప్పించండి సార్.. అని బాధితుల విలాపం. ఎవరిని కదిపినా ఇదే ఆవేదన. బెంగళూరు శివాజీనగరలోని ఐఎంఏ గ్రూప్ సుమారు వేలాది కోట్ల రూపాయల డిపాజిట్లను ప్రజల నుంచి సేకరించి బోర్డు తిప్పేయడం సంచలనాత్మకమైంది. ఐటీ సిటీ ఆర్థిక నేరాల అడ్డాగా మారుతోందనే విమర్శలకు ఊతమిస్తోంది. బెంగళూరు : ఐ మానిటరీ అడ్వైజరీ(ఐఎంఏ) గ్రూప్ మన్సూర్ ఖాన్ విడుదల చేసిన ఆడియో క్లిప్‌తో కర్ణాటక అట్టుడికి పోతుంది. అధికారులు, నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రోషన్ బయాగ్ వంటి వారందరికి దాదాపు రూ. 400 కోట్ల వరకూ లంచాలు ఇచ్చానని.. ఫలితంగా తాను మోసపోయానని ఆత్మహత్యే శరణ్యమంటూ ఐఎంఏ గ్రూప్ అధినేత మన్సూర్ ఖాన్ ఓ ఆడియో క్లిప్‌ను విడుదల చేసి.. అదృశ్యమయిపోయారు. ఇప్పటి వరకూ ఆయన ఆచూకీని కనిపెట్టడంలో పోలీసులు విఫలమయ్యారు. దాంతో పెద్ద ఎత్తున జనాలు శివాజీనగరలోని ఆఫీసు వద్దకు చేరుకుని.. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వీరిలో ఎక్కువమంది మహిళలు ఉన్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం రూపాయి రూపాయి దాచుకున్నామని, డబ్బులు పోతే ఆత్మహత్యలే శరణ్యమని రోదించారు. ఓ వైపు వేల సంఖ్యలో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చెందుతుండగా.. మరో వైపు కాంగ్రెస్, బీజేపీ ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. వెల్లువలా వస్తున్న బాధితులు బాధితుల రద్దీని తట్టుకోవడానికి శివాజీనగరలో సంస్థ కార్యాలయంలోనే పోలీసులు ఫిర్యాదుల స్వీకరణ కేంద్రాన్ని తెరవాల్సి వచ్చింది. పలువురు బాధితులు తమ సొమ్మును ఎలాగైనా ఇప్పించాలని గొడవకు దిగటంతో పోలీసులు వారిని ఒప్పించేందుకు తీవ్రంగా శ్రమించారు. పెద్దసంఖ్యలో బాధిత మహిళలు ఉదయం నుంచే తమ పసిబిడ్డలను ఎత్తుకొని వచ్చి సొమ్ము డిపాజిట్ చేసి మోసపోయామని, బ్యాంకులో పెట్టిన సొమ్మును తీసి వారి చేతిలో పెట్టామని వాపోయారు. కూడబెట్టుకున్న సొమ్మును కోల్పోయి తమ కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో పడిందని విలపించారు. బాధితుల ఫిర్యాదులను స్వీకరించామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విచారణ చేపట్టామని అధికారులు తెలిపారు. మీ సొమ్ము మీకు లభిస్తుందని బాధితులతో చెప్పసాగారు. ఈ క్రమంలో వైద్యుడొకరు ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చినపుడు అస్వస్థతకు గురై మూర్ఛపోగా, తక్షణమే ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఐఎంఏలో డిపాజిట్ చేసిన వందలాది మంది ఫిర్యాదులు చేయటానికి గ్రూపులు గ్రూపులుగా వస్తునే ఉన్నారు. సుమారు 3, 4 వేల మంది ఫిర్యాదులు చేశారని, ఈ సంఖ్య మరింత పెరగవచ్చని తెలుస్తోంది. ఖాతాల్లోకి కోట్లాది నగదు ప్రవాహం మన్సూర్ఖాన్ అదృశ్యం, డిపాజిటర్ల ఫిర్యాదుల నమోదు అయిన తరువాత కూడా సోమవారం రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు నగదు ఐఎంఏ బ్యాంకు ఖాతాల్లోకి చేరినట్లు కమర్షియల్ స్ట్రీట్ పోలీసుల తనిఖీల్లో తెలిసింది. ఈ కేసులో సుమారు 10 మందికి పైగా బ్యాంకు ఖాతాలను పోలీసులు సీజ్ చేశారు. సీజ్ చేసిన బ్యాంకు లావాదేవీల పరిశీలన సందర్భంలో మన్సూర్, డైరెక్టర్లు, ఐఎంఏ ఖాతాకు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కోట్లాది రూపాయాలు వినియోగదారులు డిపాజిట్ చేసినట్లు వెల్లడైంది. స్కాం నేపథ్యంలో మేల్కొన్న పోలీసులు ఐఎంఏ ఖాతాలను సీజ్ చేసి, ఎవరూ డిపాజిట్ చేయరాదని ప్రజలకు విన్నవించారు. ఆన్లైన్లో సొమ్ము సేకరించేవారి గురించి పోలీసులు సమాచారాన్ని ఆరా తీస్తున్నారు. వెనుక ఎవరున్నా విచారణ జరపాలి ఐఎంఏ జ్యువెల్స్ యజమాని అదృశ్య కేసుకు సంబంధించి దీని వెనుక ఎవరున్నా తగిన తనిఖీ జరుపాలని, ప్రభావం కలిగిన రాజకీయ నాయకులున్నా కూడా క్షమించరాదని వక్ఫ్ మంత్రి జమీర్ అహ్మద్ అన్నారు. ఈ విషయమై హోమ్ మంత్రి ఎంబీ పాటిల్‌ను కలుసుకున్న తరువాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇదొక అతిపెద్ద వంచన కేసని అన్నారు. దీనిపై సిట్ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. సీబీఐ దర్యాప్తు జరుపాలని విన్నవించినట్లు తెలిపారు. ఐఎంఏ జ్యూవెల్స్ యజమాని మహమ్మద్ మన్సూర్ ఖాన్‌కు చెందిన నగలను, ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని డిపాజిటర్లకు సొమ్మును ఇప్పించాలని హోంమంత్రిని కోరానని తెలిపారు. – మంత్రి జమీర్ అహ్మద్ డైరెక్టర్ల కోసం గాలింపు ఐఎంఏ కంపెనీకి చెందిన నలుగురు డైరెక్టర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మన్సూర్ ఖాన్ గత గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో నలుగురు డైరెక్టర్లు పాల్గొన్న విషయాన్ని పోలీసులు సేకరించారు. సుమారు 2 గంటల పాటు జరిగిన సమావేశంలో ఏయే సంగతులను చర్చించారనేది ఆరా తీస్తున్నారు. సమావేశం తరువాత డైరెక్టర్ల మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. మన్సూర్ ఎక్కడ దాక్కున్నాడనేది డైరెక్టర్లకు తెలిసి ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి స్పందించారు. కేసును సెంట్రల్ క్రైం బ్రాంచ్‌కు అప్పగించినట్లు తెలిపారు. నిందితులు ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ క్రమంలో బీజేపీ.. కుమారస్వామి, ఐఎంఏ కంపెనీ అధినేత మన్సూర్ ఖాన్ కలిసి ఉన్న ఫోటోలను ట్విట్ర్లో షేర్ చేసింది. దాంతో పాటు ఈ మోసగాడు మీకు చాలా కాలం నుంచి తెలుసు. ఇప్పుడతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇలా బాధితుల మాదిరి విలపిస్తే ఫలితం ఉండదంటూ విమర్శించింది. -
అసమర్థుడు.. అహంకారి.. జోకర్!
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో రెండు పార్టీల నేతలకు పొసగని పరిస్థితులు ఒక వైపు కొనసాగుతుండగానే కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. రాష్ట్ర పార్టీ అధ్యక్షు డు దినేశ్ గుండూరావు అసమర్థుడని, మాజీ సీఎం సిద్దరామయ్య అహంకారి అని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ జోకర్ అని కాంగ్రెస్ సీనియర్ నేత రోషన్ బేగ్ తిట్టిపోశారు. రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ ఎన్ని కల్లో బీజేపీకే అత్యధిక సీట్లు దక్కుతాయంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో రోషన్ బేగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సీరియస్‌గా స్పం దించి ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ పరిణామాలపై బీజేపీ స్పందిస్తూ తమ పార్టీ సిద్ధాంతాలను ఆమోదించేవారిని స్వాగతిస్తామని పేర్కొంది. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే రోషన్ బేగ్ మంగళవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ ‘మాజీ సీఎం సిద్ధరామయ్య హిందూ సమాజాన్ని విడదీసేందుకే లింగాయత్‌లను మరో మతంగా గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నించారు. అధికారంలో ఉండగా వక్కలిగ కులస్తులను తక్కువ చూపు చూశారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీకి 79 సీట్లు వచ్చినప్పుడే పార్టీ వ్యవహారాల ఇన్చార్జి వేణుగోపాల్ రాజీనామా చేయాల్సి ఉంది. రాహుల్జీని చూస్తే బాధేస్తోంది. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు సర్దుకుపోవాలని, పశువుల మాదిరిగా ఉంటూ ఓటు బ్యాంకు కారాదంటూ ముస్లింలను కోరారు. రోషన్ బేగ్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పరిణామాలకు దారి తీస్తుందని బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి డీవీ సదానంద గౌడ అన్నారు. -
సొంత పార్టీపై కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు
బెంగళూరు : కర్ణాటకలో బీజేపీ 20 లోక్‌సభ స్థానాలు గెలుస్తుందంటూ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రోషన్ బేగ్ రాష్ట్ర నాయకత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. సీట్ల కేటాయింపు విషయంలో మైనార్టీలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. పోర్టుఫోలియోలను అమ్ముకున్నారని సొంతపార్టీ నేతలపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర పార్టీ ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ బఫూన్ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం రోషన్ బేగ్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘ సిద్ధరామయ్య అహంభావి. కేసీ వేణుగోపాల్ బఫూన్. వీరితో పాటు గుండు రావు ఫ్లాప్ షో కారణంగా ఫలితాలు ఇలా వచ్చాయి. ఈ విషయంలో రాహుల్ గాంధీని క్షమాపణలు కోరుతున్నా. క్రిస్టియన్లకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. ముస్లింలకు ఒకే ఒక్క సీటు కేటాయించారు. ఈ విషయం గురించి సీఎం కుమారస్వామిని ఎలా నిందించగలం. ప్రభుత్వాన్ని నడిపే అధికారం కోల్పోవాల్సి వస్తుందని ఆయన భయం. ఇక అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి తాను ముఖ్యమంత్రిని కాబోతున్నానంటూ సిద్ధరామయ్య చెప్పుకుంటూనే ఉన్నారు. పోర్టుఫోలియోలను అమ్ముకున్నారు’ అని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. కాగా బేగ్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత జి. పరమేశ్వర స్పందించారు. ఇది పూర్తిగా బేగ్ వ్యక్తిగత అభిప్రాయమని, ఆయన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని పేర్కొన్నారు. ఆయన ఆశించిన బెంగళూరు టికెట్ దక్కకపోవడంతో ఈవిధంగా మాట్లాడుతున్నారన్నారు. సీనియర్ నేత అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని వెల్లడించారు. సంకీర్ణ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీలేదని, ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారని పేర్కొన్నారు. ఇక ఆదివారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో భాగంగా కర్ణాటకలో 28 స్ధానాలకు గాను బీజేపీ 20 స్ధానాలు గెలుచుకుంటుందని టైమ్స్ నౌ-వీఎంఆర్ వెల్లడించింది. ఇక్కడ బీజేపీ ఓటింగ్ శాతం 43 నుంచి 48.5 శాతానికి పెరగనుందని అంచనా వేసింది. పాలక జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి గట్టి షాక్ తగలనుందని.. ఈ కూటమికి 2014లో 11 స్ధానాలు దక్కగా ఇప్పుడు ఏడు స్ధానాలు మాత్రమే లభించనున్నాయని అభిప్రాయపడింది. -
ఈడీ ఉచ్చులో మంత్రి, కుటుంబం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న తరుణంలో కాంగ్రెస్ నేత, మంత్రి రోషన్ బేగ్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. విదేశీ ద్రవ్య వినిమయ చట్టం ఉల్లంఘన ఆరోపణలపై రోషన్ బేగ్, ఆయన కుమారుడు, కుమార్తెకు ఈడీ నోటీస్‌లు జారీ చేసింది. రోషన్ బేగ్ కుటుంబానికి చెందిన రుమన్ ఎంటర్ప్రైజెస్ కంపెనీకి గత 8 సంవత్సరాల నుంచి అరబ్ దేశాల నుంచి కోట్లాది రూపాయలు డబ్బు బదిలీ అయింది. ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వివరాలు వెల్లడించకపోవడంతో ఈడీ అధికారులు రోషన్ బేగ్, ఆయన కుమారుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే రోషన్ బేగ్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. ప్రతిపక్షాలకు ఇది ప్రచారాస్త్రంగా మారుతుంది. ఏమిటీ వ్యవహారం రుమాన్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీ 2007లో ప్రారంభమైంది.ఈ కంపెనీని బేగ్ కుమార్తె సబీహా ఫాతిమా, కుమారుడు రుమన్ బేగ్ పర్యవేక్షిస్తున్నారు. కంపెనీకి 2008 మేలో సౌదీ అరేబియాలోని ఫెజూరియా స్టీల్ బ్యారల్స్ కంపెనీ నుంచి రూ.1.14 కోట్లు చొప్పున రెండుసార్లు కలిపి రూ.2.28 కోట్లు జమయ్యాయి. ఇందులోనే ఫెమా నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఈడీ ఆరోపిస్తోంది. సీఎంను కలిసిన రోషన్ ఈడీ నోటీస్ జారీ కావటంతో నగరాభివృద్ధి శాఖ మంత్రి రోషన్ బేగ్ ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసు కృష్ణలో సీఎం సిద్ధరామయ్యను కలిశారు. ఈడీ నోటీస్‌లు ఇచ్చినట్లు వివరణ ఇచ్చి పది నిమిషాల్లోనే వెళ్లిపోయినట్లు సమాచారం. కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. -
రూ. 5కే కళాశాల
విద్యార్థులకు భోజనం : మంత్రి సాక్షి, బెంగళూరు : నగరంలోని మహారాణి కళాశాలతో సహా ఆరు కాలేజీల్లో రూ. 5లకే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి రోషన్‌బేగ్ తెలిపారు. ‘ఆధునిక కాలంలో గాంధేయవాదం ఆవస్యకత’ అనే విషయమై మహారాణి కళాశాలలో రెండు రోజుల జాతీయ స్థాయి సమావేశాలను గురువారం ఆయన ప్రారంభించి, మాట్లాడారు. తక్కువ ధరతో కళాశాల విద్యార్థులకు భోజనం అందించే విషయమై ఇప్పటికే ఇస్కాన్‌తో చర్చలు జరిపినట్లు తెలిపారు.త్వరలో ఉన్నత విద్య, సంక్షేమ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చించి పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే విషయమై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. బోధనేతర సిబ్బందికి రూ. 10, ఉపాధ్యాయులకు రూ. 20కే మధ్యాహ్న భోజనం ఇప్పించే ఆలోచన కూడా ఉందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేత ఎం.వి.రాజశేఖరన్ పాల్గొన్నారు. -
ప్రముఖ నగరాల్లో ఎయిర్‌పోర్టులు నిర్మిస్తాం
సాక్షి, బళ్లారి : రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో ఎయిర్ పోర్టు నిర్మాణాలు చేపడతామని రాష్ట్ర సమాచార ప్రసార, మౌళిక సదుపాయాల శాఖ మంత్రి రోషన్ బేగ్ తెలిపారు. ఆయన ఆదివారం నగరంలోని ముస్లీం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా నగరంలోని బాలా రెసిడెన్సీలో విలేకరులతో మాట్లాడారు. గుల్బర్గా, బీదర్‌లో ఇప్పటికే ఎయిర్పోర్ట్ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైందని గుర్తు చేశారు. బీదర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై జీఎంఆర్ సంస్థతో చర్చలు సాగిస్తున్నట్లు తెలిపారు. ఎయిర్ పోర్టు నిర్మాణాల కోసం బళ్లారితో సహా ఎక్కడా రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోబోమన్నారు. రైతులు ఇష్టపూర్వకంగా భూములు ఇస్తేనే ఎయిర్‌పోర్టుల నిర్మాణం చేపడతామన్నారు. మారుతున్న కాలానుగుణంగా పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నప్పుడు ఎయిర్ పోర్టులు అవసరం ఉన్న చోట తప్పకుండా ఏర్పాటు చేస్తామన్నారు. గుల్బర్గాలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి సమస్య ఏర్పడటంతో కేంద్ర మంత్రి మల్లికార్జున ఖర్గే ప్రత్యేక చొరవ తీసుకుని ముందుకు తీసుకెళుతున్నారని గుర్తు చేశారు. హాసన్, శివమొగ్గలలో ఎయిర్‌పోర్టు నిర్మాణాలకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయిందన్నారు. ఇందుకు సంబంధించి కంపెనీలతో చర్చించి ఎయిర్‌పోర్టు నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామన్నారు. బళ్లారి జిల్లాలో ఎయిర్‌పోర్టు నిర్మాణంపై కొందరు కోర్టుకు వెళ్లారని, తాము బలవంతంగా భూములు తీసుకోబోమన్నారు. గతంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిని ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కాకుండా మరేదానికో ఉపయోగిస్తున్నారనే విషయం తనకు తెలియదన్నారు. అలాంటి ఉద్దేశం ప్రభుత్వానికి కూడా లేదన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేయబోనని చెప్పారు. మంత్రిగానే కొనసాగుతానని, ఎంపీగా పోటీ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో హుమయూన్‌ఖాన్, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.