బెంగళూరు : నిజాలు మాట్లాడినందుకే తనపై వేటు వేశారంటూ కాంగ్రెస్‌పార్టీ బహిష్కృత నేత రోషన్ బేగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర నాయకత్వం కారణంగానే తనకు ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ అధిష్టానం మైనార్టీ నేత అయిన రోషన్ బేగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘ రాష్ట్రస్థాయి నాయకులే నన్ను టార్గెట్ చేశారు. నిజం మాట్లాడటమే నేను చేసిన నేరమా.. కాదు కదా. కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయుడినైన సైనికుడిని నేను. ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సిద్ధు కాంగ్రెస్ కాదు’ అంటూ రోషన్ బేగ్..మాజీ సీఎం సిద్ధరామయ్యపై విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో వైఫల్యానికి స్థానిక నాయకులు ఎందుకు బాధ్యత వహించరని ఆయన ప్రశ్నించారు. నాపై చర్యలు తీసుకుంటున్నారు సరే.. సొంతపార్టీ అభ్యర్థిని, దళిత నాయకుడి ఓటమికి కారణమైన మునియప్పపై చర్యలేవీ అని ప్రశ్నించారు. ఈ విషయాలన్నింటినీ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని పేర్కొన్నారు.
కాగా లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవం అనంతరం కర్ణాటక కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) బుధవారం తన కర్ణాటక రాష్ట్ర విభాగాన్ని రద్దు చేసింది. అయితే, కేపీసీసీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిండెంట్‌లను మాత్రం కొనసాగిస్తున్నామని, వారి విషయంలో మార్పు ఉండబోదని ఏఐసీసీ స్పష్టం చేసింది. కర్ణాకటలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం తీవ్ర లుకలుకలు ఎదుర్కొంటున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కేపీసీసీ ధోరణితో విసుగు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారని, కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కమలం పార్టీ ప్రయత్నిస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఏకంగా కేపీసీసీని రద్దు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment