సీఎం కుమారుడికి అస్వస్థత
బెంగళూరు: బెల్జియం పర్యటనలో ఉన్న సీఎం సిద్ధరామయ్య కుమారుడు రాకేష్ సిద్ధరామయ్య తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. రాకేష్ సిద్ధరామయ్య ప్యాంక్రియాసిస్‌కు సంబంధించిన వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్లు తెలుసుకున్న సీఎం సిద్ధరామయ్య.. విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌తో మాట్లాడారు. బెల్జియంలో ఉన్న తన కుమారుడికి ఉత్తమవైద్య సేవలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించి బెల్జియంలోని భారత రాయబార కార్యాలయ ఉద్యోగులను ఆదేశించాలని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ను కోరారు.
తక్షణమే స్పందిన సుష్మాస్వరాజ్ బెల్జియంలోని భారత రాయబార కార్యాలయ ఉద్యోగులతో మాట్లాడి రాకేష్ సిద్ధరామయ్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్లు సమాచారం. కాగా, రాకేష్ సిద్ధరామయ్య అస్వస్థత విషయం తెలుసుకున్న సీఎం తక్షణం తమ ఫ్యామిలీ డాక్టర్స్ ఇద్దరిని బెల్జియం పంపినట్లు తెలుస్తోంది. సీఎం సిద్దరామయ్య సైతం గురువారం తెల్లవారుజామున 4.30గంటలకు బెల్జియం బయల్దేరి వెళ్లారు. అంతకు ముందు ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాకేష్ ఆరోగ్యం బాగుందన్నారు. అతడు కోలుకుంటున్నాడని, చికిత్సకు స్పందిస్తున్నట్లు చెప్పారు. కాగా రాకేష్ తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు బెల్జియం వెళ్లారు.