కన్నకొడుకే కాలయముడు
► ఆస్తి తగాదాలో తల్లి హత్య
► కొడుకు, కోడలు అరెస్ట్
కేకేనగర్: ఆస్తి గొడవల్లో జరిగిన ఘర్షణలో కన్నతల్లిని కొడుకు, కోడలు హత్య చేశారు. ఈ సంఘటన కోయంబత్తూర్ జిల్లా నెగమం సమీపంలో జరిగింది. కోయంబత్తూర్ జిల్లా నెగమం సమీపంలోని మూట్టాంపాళయంకు చెందిన అరుకాని అమ్మాల్(70). ఈమె భర్త సుబ్రమణ్యం మృతి చెందాడు. ఈమె కుమారుడు మారిముత్తు(45) పాల వ్యాపారి. అరుకాని అమ్మాల్‌కు రెండెకరాల కొబ్బరితోట ఉంది. ఒక ఎకరా మారిముత్తు, మరో ఎకరాను అరుకాని అమ్మాల్ సంరక్షిస్తున్నారు.
మారిముత్తు తన భార్య జయచిత్రతో కొబ్బరితోటలో పాక వేసుకుని నివసిస్తున్నాడు. అరుకాని అమ్మాల్ తన ఎకరా తోటలో గుడిసెలో నివసిస్తోంది. అత్త, కోడళ్ల తగాదాల కారణంగా మారి ముత్తు రోజూ తల్లిని కలిసి వచ్చేవారు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం అరుకాని అమ్మాల్ తన గుడిసె ముందు కత్తిపోట్లకు గురై రక్తపు మడుగులో విగత జీవిగా కనిపిం చింది. దీనిపై సమాచారం అందుకున్న నెగమం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకు ని పరిశీలించారు.
పోలీసుల విచారణలో ఆమె కుమారుడు మారిముత్తు తల్లిని హత్య చేసినట్లు తెలిసింది. అతని వద్ద జరిపిన విచారణలో తల్లి , భార్యకు తరచూ గొడవ జరిగేదని, ఆమె పేరిట ఉన్న పొలం బంధువుకు రాసి ఇస్తానని బెదిరించడంతో భార్యతో కలిసి తల్లిని హత్య చేసినట్లు మారిముత్తు అంగీకరించాడు. మారి ముత్తు, జయచిత్రను బుధవారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేసి, గురువారం కోర్టులో హాజరుపరిచి కోవై జైలుకు తరలించారు.