బెంగళూరు: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన అవినీతి నిరోధక దళం (ఏసీబీ) కార్యాచరణకు సంబంధించి చర్చించేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం మరోమారు ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఏసీబీ ఏర్పాటుకు ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలు, రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ ఏర్పాటుపై వెల్లువెత్తుతున్న విమర్శలు తదితర అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర హోం శాఖ మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్, న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అరవింద్ జాదవ్, డీజీపీ ఓం ప్రకాష్‌లతో ప్రత్యేకంగా చర్చించారు. ఏసీబీలో ఎఫ్‌ఐఆర్ నమోదు, అధికారుల కార్యనిర్వహణ తదితర అంశాలపై ఇప్పటికీ గందరగోళం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఏసీబీ కార్యనిర్వహణ ఏ విధంగా ఉండాలి, ఉద్యోగుల నియామకం తదితర అంశాలపై సీఎం సిద్ధరామయ్య ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.