anti-corruption squad
-
30 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వర్సిటీ వీసీ
సాక్షి, చెన్నై: అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకానికి రూ.30 లక్షలు లంచం తీసుకుంటూ కోయంబత్తూరులోని భారతీయార్ వర్సిటీ వీసీ గణపతి అవినీతి నిరోధక విభాగం అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. వర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టు కోసం సురేశ్ అనే అభ్యర్థి వీసీ గణపతిని సంప్రదించాడు. అయితే, ఆయన రూ.35లక్షలు డిమాండ్ చేయగా చివరకు రూ.30 లక్షలకు ఒప్పందం కుదిరింది. దీనిపై సురేశ్ అవినీతి నిరోధక విభాగానికి సమాచారం అందించాడు. ఈ మేరకు శుక్రవారం రూ.లక్ష నగదు, రూ.29 లక్షలకు చెక్కులను వీసీకి ఆయన నివాసంలో అందజేస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించారన్న ఆరోపణలపై వర్సిటీ ప్రొఫెసర్ ధర్మరాజ్పైనా కేసు నమోదు చేశారు. ఇద్దరి నివాసాల్లోనూ సోదాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న కరెన్సీ నోట్లను చించివేసి డ్రైనేజీలో పడ వేసిన వీసీ భార్య స్వర్ణలతపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. -
‘ఏసీబీ’ ఎలా చేద్దాం...
బెంగళూరు: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన అవినీతి నిరోధక దళం (ఏసీబీ) కార్యాచరణకు సంబంధించి చర్చించేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం మరోమారు ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఏసీబీ ఏర్పాటుకు ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలు, రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ ఏర్పాటుపై వెల్లువెత్తుతున్న విమర్శలు తదితర అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర హోం శాఖ మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్, న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అరవింద్ జాదవ్, డీజీపీ ఓం ప్రకాష్లతో ప్రత్యేకంగా చర్చించారు. ఏసీబీలో ఎఫ్ఐఆర్ నమోదు, అధికారుల కార్యనిర్వహణ తదితర అంశాలపై ఇప్పటికీ గందరగోళం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఏసీబీ కార్యనిర్వహణ ఏ విధంగా ఉండాలి, ఉద్యోగుల నియామకం తదితర అంశాలపై సీఎం సిద్ధరామయ్య ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. -
ఏసీబీ హఠావో
ఏసీబీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ బీజేపీ ధర్నా బెంగళూరు: అవినీతి నిరోధక దళం(ఏసీబీ) ఏర్పాటును వ్యతిరేకిస్తూ బీజేపీ శ్రేణులు పోరాటానికి సన్నద్ధమయ్యాయి. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప నేతృత్వంలో ‘ఏసీబీ హఠావో’ నినాదంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు సోమవారమిక్కడి ఆనంద్రావ్ సర్కిల్లో ఉన్న గాంధీజీ విగ్రహం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా యడ్యూరప్ప మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజలతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలే ఏసీబీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారని అభిప్రాయడ్డారు. అయితే సిద్ధరామయ్య ఒంటెద్దు పోకడలను అవలంభిస్తూ ఏసీబీను ఏర్పాటు చేయడానికి ముందుకు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడిన వారిని రక్షించేందుకే లోకాయుక్తాను నిర్వీర్యం చేస్తూ ఏసీబీ ఏర్పాటుకు సిద్ధరామయ్య తహతహలాడుతున్నారని యడ్యూరప్ప ఘాటు వాఖ్యలు చేశారు. ఇదే సందర్భంలో మాట్లాడిన సీనియర్ పార్టీ నేత ఆర్. అశోక్ ‘లోకాయుక్త దేశంలోనే అత్యంత ఉత్తమ దర్యాప్తు సంస్థగా పేరుగాంచింది. అయితే ఈ సంస్థను పూర్తిగా మూసివేయాలని సిద్ధరామయ్య భావిస్తూ తెరపైకి ఏసీబీని తీసుకువచ్చారు. సిద్ధరామయ్య తన నిర్ణయాన్ని మార్చుకోక పోతే ఏసీబీ హఠావో పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి తమ పోరాటాన్ని ఉదృతం చేస్తాం.’ అని హెచ్చరించారు. ఈ ధర్నాలో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంతకుమర్, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్జ్యోషి, మాజీ ముఖ్యమంత్రి జగదీష్శెట్టర్ పాల్గొన్నారు. -
వెనక్కు తీసుకోండి
ఏసీబీ ఏర్పాటుపై విధాన సభలో తీవ్ర వాగ్వాదం నిర్ణయం ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన సీఎం సభ అరగంట పాటు వాయిదా బెంగళూరు: అవినీతి నిరోధక దళం (ఏసీబీ) ఏర్పాటు నిర్ణయాన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకునే వరకు సభ లోపల, బయట తమ పోరాటాలు కొనసాగుతాయని హెచ్చరించింది. సోమవారం ఉదయం సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే బీజేపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర హెగ్డే కాగేరి మాట్లాడుతూ... ఏసీబీ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే సందర్భంలో లోకాయుక్తకు మరింత ఎక్కువగా అధికారాలను కల్పించడంపై విస్తృత చర్చ సైతం జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోక పోతే తమ పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కలగజేసుకుంటూ...‘ఎట్టి పరిస్థితుల్లోనూ ఏసీబీని ఏర్పాటు చేసి తీరతాం, ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదు. ఇప్పటికే ఏసీబీకి సంబంధించి నియామకాలు కూడా ప్రారంభమయ్యాయి’ అని ప్రకటించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు మరింత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో మరోసారి విశ్వేశ్వర హెగ్డే కాగేరి ఈ విషయంపై స్పందిస్తూ....‘మీ ఎమ్మెల్యేలకు సైతం ఇష్టం లేకుండానే ఏసీబీని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. దీంతో మీరు మీ పార్టీలో ఏకాకిగా మారిపోయారు. ’అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. పరిస్థితి చేయిదాటిపోతోందని భావించిన స్పీకర్ కాగోడు తిమ్మప్ప అరగంట పాటు సభను వాయిదా వేశారు. బడ్జెట్లో సాగునీటిని నిధులేవీ.... 2016-17 ఏడాదికి గాను ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నీటిపారుదలకు సరిగ్గా నిధులను కేటాయించలేదని బీజేపీ ఎమ్మెల్యే బసవరాజ బొమ్మాయ్ మండిపడ్డారు. రైతుల తలరాతలను మార్చేలా సాగునీటి పధకాలకు నిధులను కేటాయించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఇదే సందర్భంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సైతం బడ్జెట్లో ఎలాంటి భరోసాను అందించలేదని అన్నారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రభుత్వం కరువు సమస్యలపై దృష్టి సారించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.