ఏసీబీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ బీజేపీ ధర్నా
బెంగళూరు: అవినీతి నిరోధక దళం(ఏసీబీ) ఏర్పాటును వ్యతిరేకిస్తూ బీజేపీ శ్రేణులు పోరాటానికి సన్నద్ధమయ్యాయి. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప నేతృత్వంలో ‘ఏసీబీ హఠావో’ నినాదంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు సోమవారమిక్కడి ఆనంద్‌రావ్ సర్కిల్‌లో ఉన్న గాంధీజీ విగ్రహం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించాయి.
ఈ సందర్భంగా యడ్యూరప్ప మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజలతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలే ఏసీబీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారని అభిప్రాయడ్డారు. అయితే సిద్ధరామయ్య ఒంటెద్దు పోకడలను అవలంభిస్తూ ఏసీబీను ఏర్పాటు చేయడానికి ముందుకు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడిన వారిని రక్షించేందుకే లోకాయుక్తాను నిర్వీర్యం చేస్తూ ఏసీబీ ఏర్పాటుకు సిద్ధరామయ్య తహతహలాడుతున్నారని యడ్యూరప్ప ఘాటు వాఖ్యలు చేశారు. ఇదే సందర్భంలో మాట్లాడిన సీనియర్ పార్టీ నేత ఆర్. అశోక్ ‘లోకాయుక్త దేశంలోనే అత్యంత ఉత్తమ దర్యాప్తు సంస్థగా పేరుగాంచింది. అయితే ఈ సంస్థను పూర్తిగా మూసివేయాలని సిద్ధరామయ్య భావిస్తూ తెరపైకి ఏసీబీని తీసుకువచ్చారు.
సిద్ధరామయ్య తన నిర్ణయాన్ని మార్చుకోక పోతే ఏసీబీ హఠావో పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి తమ పోరాటాన్ని ఉదృతం చేస్తాం.’ అని హెచ్చరించారు. ఈ ధర్నాలో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంతకుమర్, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జ్యోషి, మాజీ ముఖ్యమంత్రి జగదీష్‌శెట్టర్ పాల్గొన్నారు.