ఏసీబీ ఏర్పాటుపై విధాన సభలో తీవ్ర వాగ్వాదం
నిర్ణయం ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన సీఎం
సభ అరగంట పాటు వాయిదా
బెంగళూరు: అవినీతి నిరోధక దళం (ఏసీబీ) ఏర్పాటు నిర్ణయాన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకునే వరకు సభ లోపల, బయట తమ పోరాటాలు కొనసాగుతాయని హెచ్చరించింది. సోమవారం ఉదయం సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే బీజేపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర హెగ్డే కాగేరి మాట్లాడుతూ... ఏసీబీ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే సందర్భంలో లోకాయుక్తకు మరింత ఎక్కువగా అధికారాలను కల్పించడంపై విస్తృత చర్చ సైతం జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోక పోతే తమ పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కలగజేసుకుంటూ...‘ఎట్టి పరిస్థితుల్లోనూ ఏసీబీని ఏర్పాటు చేసి తీరతాం, ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదు. ఇప్పటికే ఏసీబీకి సంబంధించి నియామకాలు కూడా ప్రారంభమయ్యాయి’ అని ప్రకటించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు మరింత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో మరోసారి విశ్వేశ్వర హెగ్డే కాగేరి ఈ విషయంపై స్పందిస్తూ....‘మీ ఎమ్మెల్యేలకు సైతం ఇష్టం లేకుండానే ఏసీబీని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. దీంతో మీరు మీ పార్టీలో ఏకాకిగా మారిపోయారు. ’అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. పరిస్థితి చేయిదాటిపోతోందని భావించిన స్పీకర్ కాగోడు తిమ్మప్ప అరగంట పాటు సభను వాయిదా వేశారు.
బడ్జెట్‌లో సాగునీటిని నిధులేవీ....
2016-17 ఏడాదికి గాను ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నీటిపారుదలకు సరిగ్గా నిధులను కేటాయించలేదని బీజేపీ ఎమ్మెల్యే బసవరాజ బొమ్మాయ్ మండిపడ్డారు. రైతుల తలరాతలను మార్చేలా సాగునీటి పధకాలకు నిధులను కేటాయించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఇదే సందర్భంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సైతం బడ్జెట్‌లో ఎలాంటి భరోసాను అందించలేదని అన్నారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రభుత్వం కరువు సమస్యలపై దృష్టి సారించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.