Hiring employees
-
ఏప్రిల్‌లో ఆన్లైన్ హైరింగ్ తగ్గింది
ముంబై: వైట్ కాలర్ ఉద్యోగాల కోసం ఆన్లైన్ నియామకాలు ఏప్రిల్‌లో తగ్గాయని ఫౌండిట్ నివేదిక వెల్లడించింది. 2022 ఏప్రిల్‌తో పోలిస్తే గత నెలలో ఇది 6 శాతం క్షీణత నమోదైందని వివరించింది. ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ స్టార్టప్స్‌లో హైరింగ్ పెరిగిందని తెలిపింది. ‘ప్రస్తుత ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు వ్యాపారాలకు సవాలుతో కూడిన వాతావరణాన్ని సృష్టించాయి. నియామకా లు తగ్గినప్పటికీ ఉద్యోగార్థులకు అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో ఉద్యోగావకాశాలు పుష్క లంగా ఉన్నాయి. భారత స్టార్టప్ వ్యవస్థ ఒక మలుపు తీసుకుంది. జాబ్ మార్కెట్ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ నియామకాల విషయంలో మళ్లీ జోరు ప్రదర్శిస్తోంది’ అని తెలిపింది. టాప్–5లో ఎడ్టెక్.. ఉద్యోగావకాశాల పట్ల జాగ్రత్తతో కూడిన సెంటిమెంట్లు కొనసాగుతాయని ఆశిస్తున్నప్పటికీ, అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలపై ఆశాజనకంగా ఉంది. ప్రత్యేకించి స్టార్టప్‌లు ప్రతిభ, ఆవిష్కరణల కోసం డిమాండ్‌ను పెంచుతూనే ఉన్నాయి. స్టార్టప్ నియామకాల్లో టాప్–5 రంగాల్లో ఎడ్టెక్ ఉంది. బీఎఫ్ఎస్ఐ/ఫిన్‌టెక్, మీడియా, ఎంటర్టైన్మెంట్ వంటి ఇతర విభాగాలు కూడా స్టార్టప్ హైరింగ్‌లో గణనీయ డిమాండ్‌ను కలిగి ఉన్నాయి. ఆరోగ్య సేవలు, బీపీవో విభాగాలు తిరోగమన వృద్ధిని నమోదు చేశాయి. స్టార్టప్స్ హైరింగ్‌లో 33 శాతం వాటాతో బెంగళూరు టాప్‌లో నిలిచింది. ఢిల్లీ, ముంబై, పుణే సైతం మెరుగైన ప్రతిభ కనబరిచాయి. జోరుగా రిటైల్ రంగం.. రిటైల్ రంగం 22% వృద్ధి నమోదు చేసింది. ఈ రంగం అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో ఉద్యోగార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. ఈ వృద్ధికి ఈ–కామర్స్ గణనీయంగా దోహదపడింది. భారత్ ఇప్పుడు అతిపెద్ద ఆన్లైన్ రిటైలర్లకు వేదికైంది. ఈ విస్తరణ రిటైల్ ఔట్లెట్లలో నిపుణులకు డిమాండ్‌ను పెంచింది. ఉద్యోగార్థులకు పుష్కలమైన అవకాశాలను రిటైల్ రంగం కల్పిస్తోంది. ఇతర విభాగాల్లో ఇలా.. ట్రావెల్, టూరిజం విభాగం 19 శాతం, టెలికం 14, ఎన్జీవో, సోషల్ సర్వీస్ 11, ప్రకటనలు, మార్కెట్ పరిశోధన, పబ్లిక్ రిలేషన్స్ 7, చమురు, వాయువు 3, షిప్పింగ్, మెరైన్‌లో హైరింగ్ 2 శాతం ఎగసింది. సాంకేతికత, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై ఆధారపడటం పెరుగుతున్న కారణంగా సైబర్ సెక్యూరిటీ నిపుణులకు అధిక డిమాండ్ ఉంది. బీఎఫ్ఎస్ఐ 4 శాతం, బీపీవో, ఐటీఈఎస్ విభాగంలో నియామకాలు 13 శాతం క్షీణించాయి. ఆరోగ్య సేవలు, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ 16, ఐటీ–హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ విభాగాలలో 22 శాతం తిరోగమన వృద్ధి నమోదైందని నివేదిక వివరించింది. -
టెకీలకు తీపికబురు
బెంగళూర్ : ఐటీలో స్లోడౌన్ కనుమరుగవుతుండటంతో మళ్లీ నియామకాలు ఊపందుకున్నాయి. పలు కంపెనీలు సిబ్బంది సంఖ్యను పెంచుకునేందుకు రిక్రూట్మెంట్కు దిగుతుండటంతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. మరోవైపు బహుళజాతి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ గోల్డ్‌మాన్ శాక్స్ బెంగళూర్ సెంటర్లో ఇంజనీరింగ్ హెడ్‌కౌంట్‌ను భారీగా పెంచుకోవాలని కసరత్తు సాగిస్తోంది. భారత్‌లో 290 మంది ఉద్యోగులతో 2004లో కార్యాలయాలను నెలకొల్పిన గోల్డ్‌మాన్‌కు ప్రస్తుతం 5000 మంది ఉద్యోగులు ఉన్నారు. తమ సంస్థ భారత్‌లో ఏటా 24 శాతం మేర విస్తరిస్తోందని, గత ఐదేళ్లలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ 20 శాతం పెరిగాయని గోల్డ్‌మాన్ శాక్స్ సర్వీసెస్ ఇండియా హెడ్ గుంజన్ సంతాని చెప్పారు. వ్యాపార వృద్ధికి అనుగుణంగా తాము హైరింగ్ ప్రక్రియను చేపడతామని తెలిపారు. బెంగళూర్ సెంటర్ తమకు కీలకమని, ఇక్కడ కేవలం ఇంజనీరింగ్ కాకుండా ఆటోమేషన్, డిజిటైజేషన్ బిజినెస్‌ను కూడా అందిస్తున్నామని చెప్పారు. -
ఎం అండ్ ఎంలో కొత్త ఉద్యోగాలు
ముంబై : దేశీయ ఆటో దిగ్గజం మహింద్రా అండ్ మహింద్రా గ్రాడ్యుయేట్ల నియామకాలపై దృష్టిసారించింది. ఇంజనీరింగ్, బిజినెస్ స్కూళ్ల ద్వారా 2018లో 300 మంది గ్రాడ్యుయేట్లను తన కంపెనీలోకి తీసుకోవాలని యోచిస్తోంది. గతేడాది కూడా క్యాంపస్‌ల నుంచి ఇంతే మొత్తంలో నియామకాలను చేపట్టింది. వీరిలో ఎక్కువ మందిని ఇంజనీర్లనే నియమించుకుంది. డిజైన్స్, కొత్త టెక్నాలజీలు(ఎక్కువగా ఆటోమేషన్), ఎలక్ట్రిక్ వాహనాలపై పనిచేయడానికి వీరిని నియమించింది. అన్ని టీమ్‌ల్లో తాము ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికిల్ సొల్యూషన్ కోసం నియామకాలు చేపడుతున్నామని, కంపెనీ ఎక్కువగా దృష్టిసారించిన ప్రాంతంలో ఇదీ ఒకటని చీఫ్ పీపుల్ ఆఫీసర్ రాజేశ్వర్ త్రిపాఠి చెప్పారు. ఈ ఏడాది 600 మంది నుంచి 700 మందిని తీసుకోవాలని కంపెనీ భావిస్తోందని, ఈ నియామకాలు ఎక్కువగా క్యాంపస్ రిక్రూట్మెంట్, భర్తీ నియామకాల ద్వారా ఉంటాయన్నారు. ఇప్పటికే మహింద్రా అండ్ మహింద్రాలో 22వేల మంది స్టాఫ్ ఉన్నారు. వారిలో కనీసం 16వేల మంది బ్లూ-కాలర్ ఉద్యోగులే. పలు కార్యకలాపాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, రోబోటిక్స్ వంటి కొత్త టెక్నాలజీలను చేర్చుతోంది. మహింద్రా అండ్ మహింద్రాలో మహిళా ఉద్యోగులు మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 20 శాతం మంది ఉన్నారు. ఈ వైవధ్యాన్ని మెరుగుపర్చేందుకు తాము కృషిచేస్తున్నామని కంపెనీ చెప్పింది. -
2వేల మందిని పైగా నియమించుకుంటాం..
న్యూయార్క్ : డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు టెక్ దిగ్గజాలన్నీ అమెరికన్లకు భారీగా ఉద్యోగ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా మరో దేశీయ సాఫ్ట్వేర్ సేవల సంస్థ టెక్ మహింద్రా కూడా ఈ ఏడాది అమెరికాలో 2,200 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్టు ప్రకటించింది. గతేడాది కూడా ఈ కంపెనీ ఇంతేమొత్తంలో ఉద్యోగులను నియమించుకుంది. తమ దేశంలో ఉద్యోగాలను సృష్టించాలని ఆ దేశ ప్రభుత్వం పిలుపునిచ్చిన నేపథ్యంలో టెక్ మహింద్రా ఈ నియామకాల ప్లాన్‌ను ప్రకటించినట్టు తెలిసింది. ముంబైకి చెందిన ఈ కంపెనీకి అమెరికాలో 6000 మంది ఉద్యోగులుండగా.. 400 మందికి పైగా క్లయింట్స్ ఉన్నారు. గత నాలుగేళ్లుగా కూడా ఈ కంపెనీ నియామకాలు కాలేజీల నుంచే జరుగుతున్నాయి. ''గతేడాది తాము సుమారు 2,200 మంది ఉద్యోగులను నియమించుకున్నాం. ఈ ఏడాది కూడా అంతేమొత్తంలో నియమించుకోవాలని చూస్తున్నాం'' అని టెక్ మహింద్రా అధ్యక్షుడు, స్ట్రాటజిక్ వెర్టికల్స్ లక్ష్మణన్ చిదంబరం చెప్పారు. అమెరికాలో నియామకాలకు ప్రధాన కారణంగా.. ఆ దేశ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు తమకు అందాయని, అమెరికాలో ఉద్యోగాలు కల్పించడంలో తాము అతిపెద్ద పాత్ర పోషించాలని వారు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం టెక్ మహింద్రాకు అమెరికా అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. అమెరికాలో మొత్తం 28 నగరాల్లో ఈ సంస్థ తన కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది. అంతేకాక 16 డెవలప్మెంట్ సెంటర్లను కలిగిఉంది. ప్రపంచవ్యాప్తగా ఈ కంపెనీకి 1.17 లక్షల మంది ఉద్యోగులున్నారు. ఐటీ కంపెనీలు ఇటీవల అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో తీవ్ర కఠినతరమైన నిబంధనలను ఎదుర్కొంటున్నాయి. వ్యాపార వాతావరణంలోను, వర్క్ పర్మిట్లోనూ ఆ దేశాలు పరిమితులు విధిస్తున్నాయి.. కాగ, కంపెనీలు కూడా భారత్‌లో ఉద్యోగాల కోత విధించి, అమెరికాలో భారీగా నియామకాల ప్రక్రియకు తెరలేపినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కానీ ఈ రిపోర్టులను టెక్ దిగ్గజాలు ఖండిస్తున్నాయి. -
‘ఏసీబీ’ ఎలా చేద్దాం...
బెంగళూరు: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన అవినీతి నిరోధక దళం (ఏసీబీ) కార్యాచరణకు సంబంధించి చర్చించేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం మరోమారు ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఏసీబీ ఏర్పాటుకు ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలు, రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ ఏర్పాటుపై వెల్లువెత్తుతున్న విమర్శలు తదితర అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర హోం శాఖ మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్, న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అరవింద్ జాదవ్, డీజీపీ ఓం ప్రకాష్‌లతో ప్రత్యేకంగా చర్చించారు. ఏసీబీలో ఎఫ్ఐఆర్ నమోదు, అధికారుల కార్యనిర్వహణ తదితర అంశాలపై ఇప్పటికీ గందరగోళం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఏసీబీ కార్యనిర్వహణ ఏ విధంగా ఉండాలి, ఉద్యోగుల నియామకం తదితర అంశాలపై సీఎం సిద్ధరామయ్య ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.