అమరావతి: కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా టోల్ పన్ను రద్దైనా ఆర్టీసీ మాత్రం ప్రయాణీకుల జేబుకు చిల్లులు పెడుతోంది. గత పది రోజులుగా టోల్ రుసుంను ఆర్టీసీ టిక్కెట్లతో కలిపి వసూలు చేస్తోంది. రోజుకు ప్రయాణీకుల నుంచి రూ.2 కోట్ల మేర ఒక్క టోల్ గేట్ రుసుం పేరిట ఆర్టీసీ గుంజుతోంది. నెలకు సరిపడా టోకెన్లను ముందుగానే టోల్‌గేట్లకు చెల్లించామని, ప్రయాణీకులకు ఎలా తగ్గిస్తామని ఆర్టీసీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 టోల్‌ప్లాజాల్లో నిత్యం 13 వేల ఆర్టీసీ బస్సులు దాటుతున్నాయి. వేలాది ట్రిప్పులు నడుస్తున్నాయి. 65 లక్షల మందిని ఆర్టీసీ నిత్యం వారి గమ్యస్థానాలకు చేర్చుతుంది. రూ.12 నుంచి రూ.13 కోట్ల వరకు టిక్కెట్ల రూపంలో ఆదాయం ఆర్టీసీకి సమకూరుతుంది. ఇందులో ఒక్క టోల్ ఫీజు రూపేణా రోజుకు రూ.40-50 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. గత తొమ్మిది రోజుల నుంచి టోల్ ఫీజు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఆర్టీసీ మాత్రం ప్రయాణీకుల నుంచి రూ.3.50 కోట్ల వరకు రాబట్టినట్లు చెబుతున్నారు.
కాగా, పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఆర్టీసీపైనా పడింది. చిల్లర లేక చాలా మంది ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. దీంతో రూ.8 కోట్ల వరకు ఆర్టీసీకి నష్టం ఏర్పడింది. ఇందులో టోల్‌గేటు రుసుం తొలగించి టిక్కెట్ల ధరలను ఆ మేరకు తగ్గిస్తే ఈ నష్టం రూ.12 కోట్ల వరకు ఉండేదని యాజమాన్యం ఊరట చెందుతుండటం గమనార్హం.
ఆర్టీసీ ప్రయాణికులపై తొలగని ‘టోల్’ భారం
Published Wed, Nov 16 2016 7:23 PM | Last Updated on Tue, Aug 28 2018 3:57 PM
Advertisement
Advertisement