ఆస్తి పన్ను ఆరగించేశారు ! | theft to property tax! | Sakshi
Sakshi News home page

ఆస్తి పన్ను ఆరగించేశారు !

Published Tue, Apr 19 2016 2:51 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

theft to  property tax!

బీబీఎంపీలో రూ. కోట్ల గోల్‌మాల్
మాజీ మేయర్ సహా పలువురు సభ్యుల వెల్లడి

 

బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికే పరిధిలోని ఆస్తిపన్ను వసూలు విషయంలో రూ.5,649 కోట్ల గోల్‌మాల్ జరిగినట్లు మాజీ మేయర్లు బీజేపీకి చెందిన సీనియర్ నాయకులు ఎస్.కే నటరాజ్, కట్టె సత్యనారాయణలు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వివరాలను అదే పార్టీకి చెందిన నాయకులు, మాజీ ఉపమేయర్ ఎస్. హరీష్, మాజీ బీబీఎంపీ సభ్యుడు ఏ.హెచ్ బసవరాజ్‌తో కలిసి నగరంలో సోమవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. వసూలైన ఆస్తి పన్నును బ్యాంకులో జమ చేయడం తదితర విధుల కోసం గతంలో ఇండియన్ సెంటర్ ఫర్ సోషల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సంస్థ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను వినియోగించేవారన్నారు. ఈ నేపథ్యంలో 2012-13,2013-14 ఏడాదిలో బీబీఎంపీ పరిధిలో రూ.6,680 కోట్లు ఆస్తి పన్ను వసూలైందని, అయితే  అందులో కేవలం రూ.1,031 కోట్ల మాత్రం బీబీఎంపీ ఖాతాల్లో జమైందని, మిగిలిన రూ.5,649 కోట్లకు సంబంధించి వివరాలు తెలియడం లేదని వివరించారు. ఇక ఆస్తి పన్ను చెల్లింపుల కోసం కొంతమంది డీడీలు, చెక్కులు ఇస్తారని అయితే వాటిలో 60 శాతం చెక్కుల బౌన్స్ కావడం, సంతకం సరిగా లేకపోవడంతో తదితర కారణాలతో చెల్లుబాటు కాలేదన్నారు.  ఇలా చెల్లుబాటు కాని చెక్కులు, డీడీలు ఇచ్చిన వారి నుంచి తిరిగి ఆస్తిపన్ను వసూలు చేయడం లేదని వారు పేర్కొన్నారు.


ఇందుకు మెకానికల్ ఇంజనీర్ అయిన శేషాద్రిని బీబీఎంపీ ఐటీ విభాగం అధిపతిగా నియమించడమే ప్రధాన కారణమని, ఆయనను తొలగించి సమర్థుడైన అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆస్తిపన్ను వసూలు కోసం కావేరి పేరుతో నూతనంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌పై కూడా అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. అందువల్ల ఈ సాఫ్ట్‌వేర్ వినియోగాన్ని కూడా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. బీబీఎంపీలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో మొత్తం 16 లక్షల ఆస్తులు ఉన్నట్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించిందన్నారు. అయితే ప్రస్తుతం బీబీఎంపీ పరిధిలో 10 లక్షల ఆస్తులు మాత్రమే ఉన్నాయన్నారు. మిగిలిన ఆరు లక్షలు ఎక్కడికి వెళ్లినట్టు అని వారు ప్రశ్నించారు. ఆస్తుల సంఖ్య తగ్గిపోవడం వల్ల బీబీఎంపీ ఖజానాకు వేల కోట్ల గండి పడుతోందని పేర్కొన్నారు. నగరంలో 2వేలకు పైగా అనధికార అడ్వర్టైజ్‌మెంట్ బోర్డులు ఉన్నాయన్నారు. అదే విధంగా 370 ఐటీ బీటీ కంపెనీలు వేలకొద్ది హాస్టల్స్, నర్సింగ్‌హోంలు ఆస్తిపన్ను చెల్లించడం లేదన్నారు. ఈ విషయమై ప్రతి ఏడాది కోట్లాది రుపాయలు చేతులు మారుతున్నాయని వారు ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై వెంటనే సమగ్ర దర్యాప్తు జరిపించి అక్రమార్కుల పై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్‌చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement