హొంగసంద్ర బీబీఎంపీ వార్డు
కార్పొరేటర్‌గా భారతి
కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్
తిరస్కరణతో ఏకగ్రీవం
విజేతగా ప్రకటించిన ఎన్నికల అధికారి
బృహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికల్లో బీజేపీ తొలిబోణి కొట్టింది. బొమ్మనహళ్లిలోని హొంగసంద్ర బీబీఎంపీ వార్డు(189)లో కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వరి నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంతో బీజేపీ అభ్యర్థి ఎం.భారతి ఏకగ్రీవంగా ఎన్నికైంది.
బెంగళూరు : ఈ మేరకు ఎన్నికల అధికారులు గురువారం ప్రకటించారు. నామినేషన్ వేసే సమయంలో కుల ధ్రువీకరణ పత్రంలో తన పేరు మీద ఉన్నది కాకుండా తన భర్త పేరు మీద ఉన్నది మహేశ్వరి సమర్పించారు. విషయాన్ని గుర్తించిన ఎన్నికల అధికారులు ఆ నామినేషన్‌ను తిరస్కరించారు. ఈ వార్డు నుంచి జేడీఎస్ బరిలో లేకపోవడం, స్వతంత్రులుగా ఉన్న ఇద్దరు తమ నామినేషన్లను గురువారం ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
బీజేపీలో సంబరాలు
బీబీఎంపీ ఎన్నికల్లో బీజేపీ తొలిబోణి సాధించడంతో స్థానిక బీజేపీ కార్యకర్తల్లో ఆనందోత్సవాలు పెల్లుబుకాయి. కార్పొరేటర్‌గా గెలుపొందిన భారతిని అభినందనలతో ముంచెత్తారు. ఎమ్మెల్యే ఎం. సతీష్‌రెడ్డి అక్కడకు చేరుకుని భారతిని అభినందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో ఎన్నికల సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు దుర్వినియోగం అవుతుంటుందని, ఒక మంచి అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ద్వారా ఈ లోటును పూరించవచ్చునని అన్నారు. భారతి మాట్లాడుతూ.. ఈ విజయం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు చెందుతుందని అన్నారు. ఇంత సులువుగా విజయం సాధిస్తానని అనుకోలేదని అన్నారు. వార్డు సమగ్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. విజయోత్సవాల్లో నగరసభ మాజీ సభ్యుడు టి.రామచంద్ర, బీజేపీ బొమ్మనహళ్లి అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, నాయకులు సయ్యద్ సలాం, నరేంద్రబాబు, ఆనంద్‌రెడ్డి, బాబురెడ్డి, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
బీజేపీ తొలిబోణి
Published Fri, Aug 14 2015 2:30 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement