
అవకతవకలు లేనే లేవు
ముంబై : అత్యంత ఎత్తయిన ఆదర్శ్ భవనంలో ఫ్లాట్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన వార్తలను కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే కొట్టిపారేశారు. సోమవారం రాత్రి నగరంలోని కాందివలి ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇవన్నీ నిరాధార ఆరోపణలన్నారు. ‘ఆదర్శ్ హౌసింగ్ సొసైటీలో ఫ్లాట్ల కేటాయింపునకు సంబంధించి ఎటువంటి అవతవకలు జరగలేదు. కార్గిల్ అమర జవాన్ల కుటుంబాలకు ఇందులో రిజర్వేషన్ ఏమీ లేదు’ అని అన్నారు. కాగా ఆదర్శ్ కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ద్విసభ్య కమిషన్ తప్పుపట్టిన మాజీ ముఖ్యమంత్రుల జాబితాలో షిండే పేరు కూడా ఉంది.
శీతాకాల సమావేశాల సందర్భంగా నాగపూర్‌లో గత ఏడాది డిసెంబర్ 20వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం ద్విసభ్య కమిషన్ సమర్పించిన నివేదికను తిరస్కరించిన సంగతి విదితమే. అయితే ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ద్విసభ్య కమిషన్ చేసిన సిఫార్సులలో కొన్నింటిని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా రాష్ర్ట ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టాయి. రాజకీయ నాయకులకు అనుకూలంగా, ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా ఉన్న సిఫారసులను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిదంటూ విమర్శించాయి. బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జేఏ పాటిల్ నేతృత్వంలోని ద్విసభ్య కమిషన్ దివంగత ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, అశోక్‌చవాన్, శివాజీరావ్ నీలంగేకర్ పాటిల్‌ల తీరును తన నివేదికలో తప్పుబట్టిన సంగతి విదితమే.