సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోలో ప్రతి రోజు 25 లక్షల మంది ప్రయాణిస్తారు. అయితే చాలామందికి మెట్రో ప్రయాణం సందర్భంగా పాటించాల్సిన నియమాల గురించిన అవగాహన లేదు. వారికి అవగాహన లేదనడం కన్నా తమ తీరుతెన్నులు మార్చుకోవడానికి ఢిల్లీ వాసులు ఇష్టపడడం లేదనడం సముచితంగా ఉంటుంది. మెట్రో ప్రారంభించి ఇప్పటికి 13 ఏళ్లవుతోంది. దీనిని మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ అనేక ప్రచార మాధ్యమాల ద్వారా విృస్తతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రయాణీకుల ఆలోచనాసరళిలో మార్పు రావడం లేదు. ఇప్పటికీ పలువురు మెట్రో రైలు ట్రాక్‌ను సాధారణ రైల్వే ట్రాక్ మాదిరిగా దాటడానికి ప్రయత్నిస్తుంటారు. మెట్రో ట్రాక్‌ను దాటి ఒక ప్లాట్‌ఫారంపై నుంచి మరో ప్లాట్‌ఫారానికి వెళ్లడం చట్టరీత్యా నేరమని తెలిసినప్పటికీ ఈ పద్ధతిని చాలామంది ఉయోగిస్తుంటారు.
ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటివరకు ఈ నేరంపై 12 మందిని పట్టుకున్నట్లు సీఐఎస్‌ఎఫ్ రికార్డులు ద్వారా తెలుస్తోంది. 2014లో అయితే 655 మంది పట్టుబడ్డారు. పట్టుబడినవారిలో చాలామంది తాము మొదటిసారి మెట్రోలో ప్రయాణిస్తున్నామని, తమకు నిబంధనల గురించి తెలియదని చెబుతున్నారు. మరి కొందరు ప్లాట్ ఫారం దాటి ఎలా వెళ్లాలో తెలియక ట్రాక్ దాటామన్న సాకు చెబుతుంటారు. ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేయడానికి డీఎంఆర్‌సీ జరిమానా విధిస్తుంటుంది. అలాంటి ప్రయత్నం చేసేవారిని పట్టివ్వడంలో సీసీటీవీ కెమేరాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. దాదాపు 90 శాతం కేసుల్లో సీసీటీవీ సహాయంతోనే పట్టుకున్నారు. అలాగే 10 శాతం మంది సీఐఎస్‌ఎఫ్ జవాన్లకు పట్టుబడ్డారు. సీసీటీవీ కెమేరాల సహాయంతో సీఐఎస్‌ఎఫ్ జవాన్లు కొన్ని దుర్ఘటనలను కూడా నివారించగలుగుతున్నారు.
మెట్రో నిబంధనలు తెలియదంటోన్న ఢిల్లీ వాసులు
Published Wed, Mar 11 2015 11:07 PM | Last Updated on Sat, Sep 2 2017 10:40 PM
Advertisement