న్యూఢిల్లీ: పదిహేనేళ్ల పాటు ఆమె దేశరాజధాని రాజకీయాలను శాసించింది. 1998 నుంచి 2013 దాకా మూడు దఫాలు ముఖ్యమంత్రిగా పనిచేసింది. చివరికి గత ఏడాది ఆమ్ ఆద్మీ గాలితో బలమైన మద్దతు ఉన్న సొంత నియోజకవర్గంలో కూడా గెలవలేకపోయింది.
ఆమె ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేరళ గవర్నర్ షీలా దీక్షిత్. మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పుడామె కొడుకు సందీప్ దీక్షిత్ భవితవ్యం ఏమిటో తేలనుంది.
సందీప్ దీక్షిత్ తూర్పుఢిల్లీ నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. షీలా దీక్షిత్‌పై గట్టి విమర్శలు చేసేవారు సైతం ఆమె లేకుండా ఢిల్లీ రాజకీయాలుంటాయని మాత్రం ఊహించలేకపోయారు. కానీ దీక్షిత్ ఓటమికి పార్టీలోని అంతర్గత కలహాలు కూడా ఒక కారణం. అయితే ఇప్పుడు తిరిగి షీలా దీక్షిత్ కీర్తి పతాకను సందీప్ దీక్షిత్ ఎగరేయగలుగుతారా? ఆమె పేరును నిలబెట్టగలుగుతారా? అనేది మే 16న బయటపడనుంది.షీలా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొడుకు నియోజకవర్గం అయిన తూర్పు ఢిల్లీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించారు.
మెట్రోతోపాటు, రోడ్లవంటి మౌలిక సదుపాయాలు, 2010 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ విషయంలో ఆమె తోడ్పాటునందించారు. రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందడంతో ఈస్ట్ ఢిల్లీ వేగవంతంగా మార్పు చెందింది. ఇవన్నీ ఇలా ఉంటే... ఇప్పుడు బీజేపీ అభ్యర్థి మహేష్‌గిరి, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్ధి రాజ్‌మోహన్ గాంధీ సందీప్ దీక్షిత్‌కు గట్టి పోటీ ఇచ్చారు. మోడీ గాలి బీజేపీకి కలిసొచ్చే అంశమయితే... 10 అసెంబ్లీ సీట్లకు గాను 8 స్థానాలతో బలంగా ఉన్న కాంగ్రెస్‌ను 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకే పరిమితం చేసి, 8 స్థానాలను గెలుచుకోవడం ఆమ్ ఆద్మీ పార్టీ బలం.
అయితే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఫ్లైఓవర్లు, కామన్వెల్త్‌గేమ్స్ సమయంలో మెట్రో లింక్స్ కోసం వందల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడంతో మురికివాడలు, అనధికారిక కాలనీలు, ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలు కొన్ని కాంగ్రెస్‌ను తిరస్కరించాయని చెప్పాలి. దీంతో 64 సీట్లకు గాను మున్సిపల్ ఎన్నికల్లో కేవలం 19 సీట్లను మాత్రమే దక్కించుకుంది కాంగ్రెస్. మున్సిపల్ ఎన్నికలను కోల్పోవడంతో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కొన్ని దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన తుర్పు ఢిల్లీ ప్రజలకు ఐటీవో చుంగీ ఫ్లైఓవర్, గీతా కాలనీబ్రిడ్జ్, ఔటర్ రింగ్ రోడ్డును కలుపుతూ షాలీమార్గ్ ్గబైపాస్, గాజీపూర్ ఫ్లైఓవర్ వంటి అనేక వాగ్దానాలు చేశారు షీలా దీక్షిత్. 2008లో మూడోసారి ఆమె అధికారంలోకి రావడానికి ఆ తూర్పుఢిల్లీ, వాయవ్య ఢిల్లీ ప్రజలే కీలక భూమిక పోషించారు కూడా.
ఇన్ని బలాలు, లోపాలు ఉన్న కారణంగానే ఇప్పుడు సందీప్ దీక్షిత్ భవితవ్యం ఏమిటనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే తూర్పు ఢిల్లీలో ఉన్న సంప్రదాయక ఓట్ బ్యాంకు కాంగ్రెస్‌కు కలిసొస్తుందంటున్నారు విమర్శకులు. అనధికారిక కాలనీలను క్రమబద్ధీకరించడమే కాదు అభివృద్ధి చేస్తామని, బలహీన వర్గాలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ చేసిన వాగ్దానాలేవీ 2012, 2013 ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో సందీప్ దీక్షిత్ మూడోసారి విజయం సాధిస్తారా? తిరిగి తన సత్తా నిలుపుకుంటారా? వేచి చూడాలి.
మూడోసారీ గెలుస్తారా?
Published Sat, Apr 12 2014 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 AM
Advertisement
Advertisement