ఆర్మీ చీఫ్‌పై వివాదస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ నేత, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ ఆదివారం ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మాఫియాలాగా హెచ్చరికలు చేసే పాక్ సైన్యానికి మన ఆర్మీకి తేడా ఉంది. మన ఆర్మీ చీఫ్(రావత్) వీధి రౌడీలా మాట్లాడుతుంటే వినడానికి ఇబ్బందిగా ఉంది. ఆయన రాజకీయ వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి’ అని అన్నారు.
ఆర్మీ చీఫ్‌ను వీధి రౌడీ అనడానికి కాంగ్రెస్ పార్టీకి ఎంత ధైర్యమని హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజు మండిపడ్డారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ క్షమాపణ చెప్పడంతో పాటు సందీప్‌ను పార్టీ నుంచి తొలగించాలని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా డిమాండ్ చేశారు. మరోవైపు సందీప్ వ్యాఖ్యలు దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ స్పందించింది. తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో సందీప్ క్షమాపణలు చెప్పారు.